20లోగా కౌంటర్ దాఖలు చేయండి... | Wages not given since september to the 108 employees | Sakshi
Sakshi News home page

20లోగా కౌంటర్ దాఖలు చేయండి...

Oct 17 2016 6:17 PM | Updated on Sep 4 2018 5:24 PM

జీవీకే సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

- హైకోర్టు ఆదేశం
-108 ఉద్యోగులకు సెప్టెంబర్ వేతనాలు ఇప్పటికీ ఇవ్వలేదు
సాక్షి, హైదరాబాద్

108 అంబులెన్సులు నిర్వహణ దక్కించుకున్న యుకెఎస్‌ఎఎస్-బీవీజీ కన్సార్టియంపై జీవీకే సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో సర్కారు ఏంచేయాలో పాలుపోవడం లేదు. టెండరు నిబంధనల ప్రకారం ఈ రెండు సంస్థల కన్సార్టియంకు అర్హత లేదని జీవీకే సంస్థ కోర్టుకు పత్రాలను దాఖలు చేసింది. దీంతో 108 అంబులెన్సులను తక్షణమే ఆ సంస్థలకు ఇవ్వకుండా ఉపసంహరించుకోవాలని స్టే విధించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఈ సంస్థలకు అర్హత ఉందని ఎలా చేయాలో కసరత్తు చేస్తోంది. కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కౌంటర్ దాఖలు చేయడంలో భాగంగా టెండరు దక్కించుకున్న సంస్థల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో కాల్ సెంటర్‌గానీ, అంబులెన్సులు నిర్వహించిన అనుభవం గానీ ఈ సంస్థలకు లేదని జీవీకే హైకోర్టుకు చెప్పింది.


సెప్టెంబర్ జీతాలు ఇప్పటికీ లేవు
అక్టోబర్ నెల ముగుస్తున్నా 108 ఉద్యోగుల నిర్వహణకు ఇవ్వాల్సిన వేతనాలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఉద్యోగులకు తామే సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించాలని, సర్కారు నుంచి తమకు రావాల్సిన వేతనాలు ఇంకా రాలేదని జీవీకే సంస్థ ప్రతినిధులు చెప్పారు. సుమారు రూ.7 కోట్ల బకాయిలు ఉన్నాయని, నిధులు తక్షణమే చెల్లించాలని కోరుతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా సుమారు 6 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన వాహనాలన్నీ మరమ్మతులతో ఆగిపోతున్నాయని, దీంతో ఎమర్జెన్సీ కాల్స్‌కు సకాలంలో హాజరు కాలేకపోతున్నట్టు చెప్పుకొచ్చారు. 108 అంబులెన్సుల పరిస్థితి రోజురోజుకూ దిగజారుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement