యూఐఐకి 5.. ఓరియంటల్‌కు 4 జిల్లాలు | Sakshi
Sakshi News home page

యూఐఐకి 5.. ఓరియంటల్‌కు 4 జిల్లాలు

Published Mon, Aug 1 2016 1:09 AM

UII 5 .. Oriental to 4 districts

గ్రీన్‌హౌస్ నిర్మాణాలకు బీమా కంపెనీల ఖరారు
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్ నిర్మాణాలకు బీమా సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న ఉద్యాన శాఖ తాజాగా బీమా కంపెనీలకు జిల్లాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను ఓరియంటల్ బీమా కంపెనీ లిమిటెడ్‌కి.. మెదక్, నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలను యునెటైడ్ ఇండియా బీమా కంపెనీ లిమిటెడ్ (యూఐఐ)కి అప్పగించింది. నిర్దేశించిన జిల్లాల్లోని గ్రీన్‌హౌస్ రైతులకు ఆయా కంపెనీలు బీమా వసతి కల్పించాల్సి ఉంటుంది.

గ్రీన్‌హౌస్ నిర్మాణాలకు నష్టం వాటిల్లితే పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యాన శాఖ నుంచి 50 శాతం సబ్సిడీ విడుదలయ్యాక జిల్లా అధికారి ధ్రువీకరణ పత్రం ఆధారంగా సంబంధిత కంపెనీ బీమా పాలసీని రైతుకందజేస్తుంది.
 
పంటలకు బీమా లేదు..

గ్రీన్‌హౌస్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న సర్కారు.. అందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరు శాతం, ఇతర రైతులకు 75 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఎకరా గ్రీన్‌హౌస్ నిర్మాణానికి రూ. 40 లక్షల వరకు ఖర్చు అవుతున్న నేపథ్యంలో భారీగా సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం.. ఈదురు గాలులు, వరదల వల్ల సొమ్ము నష్టపోకుండా బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఓరియంటల్, యునెటైడ్ ఇండియా బీమా కంపెనీలకు రూ. 34 లక్షల బీమా ఏడాది పాటు అవకాశం కల్పించింది. గ్రీన్‌హౌస్ నిర్మాణం, పాలీషీట్లు, షేడ్‌నెట్లకు కవరేజీ ఉంటుందని, అందులో పండించే పంటలకు మాత్రం బీమా ఉండదని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement