నగరంలోని పంజగుట్ట ఫ్లై ఓవర్‌పై కలకలం రేగింది. ఓ వ్యక్తి తన వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకోవడానికి యత్నించాడు.
హైదరాబాద్: నగరంలోని పంజగుట్ట ఫ్లై ఓవర్‌పై కలకలం రేగింది. ఓ వ్యక్తి తన వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకోవడానికి యత్నించాడు. ఇది గుర్తించిన వాహనదారులు అతని ప్రయత్నాన్ని అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. గత పది రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కానీ, ప్రైవేట్ క్యాబ్ యాజమాన్యాలు కానీ తమ సమస్యలు పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో.. మనస్తాపానికి గురైన ఓ క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
రమేష్ అనే ఉబెర్ క్యాబ్ డ్రైవర్ గత పదిరోజులుగా సమ్మెలో పాల్గొంటున్నాడు. అసలే కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, క్యాబ్ యజమానుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం పంజగుట్ట ఫ్లై ఓవర్‌పై కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకోవడానికి యత్నించాడు. అటునుంచి వెళ్తున్న వాహనదారులు అతడు ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకున్నారు. వాహనదారుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్యాబ్ డ్రైవర్ రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.