గుర్తింపు దక్కలేదని టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్య | TRS activist commits suicide | Sakshi
Sakshi News home page

గుర్తింపు దక్కలేదని టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్య

Apr 24 2017 2:39 AM | Updated on Aug 30 2019 8:24 PM

గుర్తింపు దక్కలేదని టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్య - Sakshi

గుర్తింపు దక్కలేదని టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్య

‘‘టీఆర్‌ఎస్‌ పార్టీలో సముచి తమైనా స్థానం దక్కడం లేదు. మొదటి నుంచి పనిచేసినవారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

- ఆది నుంచి ఉన్నవారిపై కక్ష సాధిస్తున్నారని సూసైడ్‌ నోట్‌
- మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధపెట్టి పరిష్కరించాలని విజ్ఞప్తి


హైదరాబాద్‌: ‘‘టీఆర్‌ఎస్‌ పార్టీలో సముచి తమైనా స్థానం దక్కడం లేదు. మొదటి నుంచి పనిచేసినవారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మాపై వారి కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి. కేటీఆర్‌ సారూ.. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు వట్టిమాటలుగానే మిగిలిపోయాయి’ అని సూసైడ్‌ నోట్‌ రాసి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త  ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌ మైలా ర్‌దేవ్‌పల్లికి చెందిన మహిపాల్‌రెడ్డి(42) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూనే టీఆర్‌ఎస్‌ పార్టీలో చురు గ్గా వ్యవహరిస్తున్నారు.

ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన నేతల తీరుతో కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం వాకింగ్‌ కోసమని బయటకు వెళ్లాడు. రాజేంద్రనగర్‌లోని  ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ ప్రాంగణంలోని డీ హాస్టల్‌ వద్ద ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు రాజేంద్రనగర్‌ పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరీశీలించగా ఓ సూసైడ్‌ నోట్‌ లభించింది. ‘పార్టీకి అంతగా ఆదరణ లేని సమయంలో మైలార్‌దేవ్‌పల్లిలో కష్టపడి టీడీపీ ధీటుగా పార్టీని నిలబెట్టిన  టి.శ్రీశైలంరెడ్డి అన్నగారికి ఎమ్మెల్యేకు సమానమైన పదవి ఇచ్చి గౌరవించగలరు. ఇదే నా చివరి కోరిక’ అంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు.

ఆత్మస్థైర్యం కోల్పోవద్దు: మంత్రి మహేందర్‌రెడ్డి
కార్యకర్తలు ఆత్మస్ధైర్యాన్ని కోల్పోవద్దని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సూచించారు. మహిపాల్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ మహిపాల్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని, ప్రభుత్వం తరఫున ఆయన పిల్లలకు చదువు చెప్పిస్తామని వెల్లడించారు. సూసైడ్‌ నోటు గురించి ప్రశ్నించగా దానిపై పూర్తిస్థాయి విచారణ జరపనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement