
మరణ శిక్ష రద్దు
అదనపుకట్నం వేధింపుల వ్యవహారంలో భార్య, అత్తమామలను చంపిన కేసులో భర్త, మరొకరికి మరణశిక్ష విధిస్తూ....
కింది కోర్టు తీర్పును రద్దు చేసిన హైకోర్టు
వేధింపుల కేసులో భర్త, మరొకరిని నిర్దోషులుగా ప్రకటన
సాక్షి, హైదరాబాద్: అదనపుకట్నం వేధింపుల వ్యవహారంలో భార్య, అత్తమామలను చంపిన కేసులో భర్త, మరొకరికి మరణశిక్ష విధిస్తూ కరీంనగర్ ఆరవ అదనపు సెషన్స్ జడ్జి కోర్టు విధించిన మరణ శిక్షను ఉమ్మడి హైకోర్టు రద్దు చేసింది. దర్యాప్తులో లోపాలు ఉన్న కారణంగా సంశయ లాభం కింద నిందితులిద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.సీతారామ్మూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. జె.దేవేందర్ కరీంనగర్ జిల్లా గోదావరిఖని వాసి. అదే జిల్లాకు చెందిన ఆరుణతో అతనికి వివాహమైంది.
అదనపు కట్నం కోసం అరుణతో పాటు ఆమె తల్లిదండ్రులైన బాణమ్మ, బాణయ్యలను వేధించడం మొదలుపెట్టారు. అదనపు కట్నం ఇచ్చేందుకు నిరాకరించడంతో... తన బంధువు నరేశ్‌తో కలసి వారిని హత్య చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన కరీంనగర్ ఆరవ అదనపు సెషన్స్ జడ్జి కోర్టు... దేవేందర్, నరేశ్ కలసి అరుణ, ఆమె తల్లిదండ్రులను హత్య చేశారని తేల్చి, వారికి మరణశిక్ష విధించింది. దీనిపై వారు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
విచారణ జరిపిన జస్టిస్ సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం పోలీసుల దర్యాప్తులో పలు లోపాలున్నాయని తేల్చింది. హత్య జరిగిన వెంటనే కేసు నమోదు చేయలేదని, బంధువులు ఫిర్యాదు చేసేంత వరకు వేచి చూశారంది. వీటితో పాటు పలు లోపాలున్నాయన్న ధర్మాసనం, సంశయ లా భం కింద దేవేందర్, నరేశ్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు పేర్కొంది.