5 నిమిషాలు దాటితే నో ఎంట్రీ | tenth exam's starts tomorrow onwords not allowed to school dress | Sakshi
Sakshi News home page

5 నిమిషాలు దాటితే నో ఎంట్రీ

Mar 20 2016 10:24 PM | Updated on Sep 3 2017 8:08 PM

5 నిమిషాలు దాటితే నో ఎంట్రీ

5 నిమిషాలు దాటితే నో ఎంట్రీ

యూనిఫారం వేసుకొని వస్తే అనుమతించరు. వేరే దుస్తులు ధరించాలి.. ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగ్‌లు, పుస్తకాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు..

మరికొద్ది గంటల్లో టెన్త్ పరీక్షలు.. సర్వం సిద్ధం
♦ పరీక్షలకు హాజరు కానున్న 5.67 లక్షల మంది

పరీక్షలకు హాజరయ్యే టెన్త్ విద్యార్థులకు ముఖ్య సూచనలు

♦  స్కూల్ యూనిఫారంలో రావద్దు
♦  విద్యార్థులు పరీక్షలకు పాఠశాల యూనిఫారం వేసుకొని రావద్దు.
♦  యూనిఫారం వేసుకొని వస్తే అనుమతించరు. వేరే దుస్తులు ధరించాలి.
♦  ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగ్‌లు, పుస్తకాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు.
♦  బ్లాక్ లేదా బ్లూ పెన్నుతోనే పరీక్షలు రాయాలి. ఇతర రంగుల పెన్నులతో పరీక్ష రాయవద్దు.
♦  జవాబుపత్రాల లోపల ఎలాంటి గుర్తులు పెట్టవద్దు. హాల్‌టికెట్ నెంబరు, ఫోన్‌నెంబరు వంటి రాయవద్దు. అలా రాస్తే ఆ జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేయరు.
♦  ఏదైనా సహాయం అవసరం అయితే ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్ కేంద్రానికి (040-23230942) ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.
♦  డీఈవో కార్యాలయాల్లో ఉండే హెల్ప్ కేంద్రాలకు కూడా ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.
♦  విద్యార్థులకు కేటాయించిన కేంద్రంలోనే పరీక్ష రాయాలి.
♦  ఆలస్యం అయిందన్న కారణంతో సమీపంలోని కేంద్రానికి వెళితే అనుమతించరు.
♦  ఏప్రిల్ 11 నుంచి స్పాట్ వాల్యుయేషన్
♦  ప్రభుత్వ పరీక్షల విభాగం
♦  డెరైక్టర్ డా.సురేందర్‌రెడ్డి వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీ(రేపటి) నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ప్రతిరోజు పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులను ఉదయం 9:35 గంటల వరకే పరీక్ష హాల్లోకి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. అంతకుమించి ఆలస్యమైతే  అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ద్వితీయభాష పరీక్ష మాత్రం ఉదయం 9:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్షల ఏర్పాట్లపై శనివారం సురేందర్‌రెడ్డి విలేక రులతో మాట్లాడారు.

 

విద్యార్థులను గంట ముందుగానే(ఉదయం 8:30 గంటలకే) పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని, ఆ సమయాన్ని వినియోగించుకొని ముందుగానే రావాలన్నారు. వీలైతే ఈ నెల 20 నాడే తమ పరీక్ష కేంద్రాలు ఎక్కడున్నాయో వెళ్లి చూసుకోవాలన్నారు. హాల్‌టికెట్లు అందని వారు వెబ్‌సైట్ www.bsetelangana.org నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఎవరైనా గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకొని హాజరు కావచ్చన్నారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన మరిన్ని అంశాలు ఆయన మాటల్లోనే..

 

వికలాంగులు 20 మార్కుల కే పాస్
అంధ, మూగ, చెవిటి, అంగవైకల్యం కలిగిన విద్యార్థులు ఉత్తీర్ణత మార్కులను 20కి తగ్గించారు. వీరికి జంబ్లింగ్ విధానం ఉండదు. వారు మూడు లాంగ్వేజెస్ పేపర్లకు బదులు ఒక్క భాషా పేపరు రాస్తే చాలు. డిస్‌లెక్సియాతో బాధపడేవారు ఇంగ్లిషు పేపరు రాయాల్సిన అవసరం లేదు. 9వ తరగతి విద్యార్థిని సహాయకునిగా ఇవ్వడంతోపాటు గంట అదనంగా సమయం ఇస్తారు. జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 11 నుంచి ప్రారంభిస్తారు. 5 ఏళ్ల సర్వీసున్నవారినే మూల్యాంకన విధులకు తీసుకుంటారు. మూల్యాంకనం ప్రారంభమయ్యాక 7 వారాల తరువాతే ఫలితాలను వెల్లడించేందుకు వీలు ఉంటుంది.

 

 మాల్‌ప్రాక్టీస్‌కు సహకరిస్తే చర్యలు
మాల్‌ప్రాక్టీస్‌కు సహకరిస్తే ఇన్విజిలేటర్లపైనా చర్యలు ఉంటాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఇన్విజిలేటర్లు కొంత మంది ప్రైవేటు స్కూళ్ల టీచర్లను తీసుకున్నామని, 425 కేంద్రాల్లో ఫర్నిచర్ కొరత ఉంటే ఇతర స్కూళ్ల నుంచి తెప్పించి సర్దుబాటు చేశామన్నారు. జిల్లాకు ఒక సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, 5 మార్కులు కలిగిన ఆబ్జెక్టివ్ పేపర్‌ను చివరి అరగంట సమయంలో ఇస్తారని తెలిపారు.

 

పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ మినహా మరెవరూ సెల్‌ఫోన్లు వాడటానికి వీల్లేదని, చీఫ్ సూపరింటెండెంట్లు కెమెరా లేని సెల్‌ఫోన్లనే వినియోగించాలన్నారు. మొత్తం 5 లక్షల 67 వేల 478 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5 లక్షల 21 వేల 46 మంది, ప్రైవేట్ విద్యార్థులు 35,711 మంది, ఓరియంటల్ ఎస్సెస్సీ, ఒకేషనల్ విద్యార్థులు మరో 10,721 మంది ఉన్నారు. 392 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్స్ ఉంటాయని, 144 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement