
దేవాలయాలు ఏటీఎంలు కాదు..
భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా సైతం గౌరవిస్తుండగా...
విద్యారణ్య భారతి స్వామి
చార్మినార్: భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా సైతం గౌరవిస్తుండగా... మనము మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామని జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి అన్నారు. సోమవారం మీరాలంమండి మహంకాళేశ్వర దేవాలయంలో శివపంచాయితం, మహంకాళి అమ్మవారు, అంజనేయ స్వామి, నాగ ఫణింద్రుడు, నవగ్రహాలకు ఆయన ప్రాణ ప్రతిష్ట చేశారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్బంగా ఒబామా దీపాలు వెలిగించి హిందూ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.
భారతీయులు ఏదో ఒక సాకు చెబుతూ దేవాలయాలు, పూజలకు దూరమవుతున్నామన్నారు. దేవాలయాలు ఏటీఎం కేంద్రాలు కాదని, మానవ వికాస కేంద్రాలుగా ఆయన అభివర్ణించారు. దేవాలయాన్ని కోర్కెలు తీర్చే మిషన్‌గా కాకుండా ఆధ్యాత్మిక వికాస కేంద్రంగా చూడాలన్నారు. 180 ఏళ్ల క్రితం లార్డ్ మెకాలే భారత సంసృ్కతి, సంప్రదాయాలను దెబ్బతీసేలా కార్యచరణను రూపొందించారని, ఈ కుట్రలను సమష్టిగా ఎదుర్కోవాలన్నారు. కార్యక్రమంలో దేవాలయం కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.