
రాష్ట్రంలో నియంతృత్వ పాలన: సురవరం
రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగు తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగు తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల్లో పెరుగుతున్న ఖర్చులు రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతికి నిదర్శన మన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మంగళవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 1న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సీపీఐ ఏర్పాటు చేసిన తెలంగాణ అభివృద్ధి సదస్సులో తాను చేసిన ప్రారంభోపన్యాసంపై ‘సిల్లీ’గా మాట్లాడానని సీఎం వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.
అయితే తాను లేవనెత్తిన అంశాలకు సమాధానం దాటవేసి, ఇలాంటి వ్యాఖ్యలను సీఎం చేయడం తీవ్ర అభ్యంతరకరమని లేఖలో పేర్కొన్నారు. తన విమర్శల్లో అవాస్తవాలుంటే సరిచేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రతిపక్షాలకు, ప్రజా సంఘాలకు సీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని, ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సంస్కారహీనంగా సమాధానాలు ఇవ్వడ మేమిటని ప్రశ్నించారు.ప్రతివిమర్శలో ఆయనకు మరింత రాజకీయ సంస్కారం చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు సురవరం లేఖలో పేర్కొన్నారు.