దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పినందుకు కన్నతండ్రినే హతమార్చాడు ఓ కసాయి కొడుకు.
దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పినందుకు కన్నతండ్రినే హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మద్యం సేవించవద్దని మందలించిన తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన సంఘటన దోమలగూడలోని మైసమ్మబండలో సోమవారం రాత్రి 9 గంటలకు జరిగింది. వివరాలు.. తుకారాం(68), నర్సుబాయి దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
తుకారం పెద్ద కొడుకు వైద్యనాథ్ తాగుడికి బానిసై నిత్యం మద్యం తాగి భార్యపిల్లలను వేధిస్తుండేవాడు. దీంతో భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. కొడుకు తాగుడు గురించి తల్లి మందలించడంతో సోమవారం రాత్రి కోపంతో ఆమెపై దాడికి యత్నం చేశాడు. అంతేకాక అడ్డువచ్చిన తమ్ముడు కిషన్‌పై కూడా వైద్యనాథ్ దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న తండ్రి అడ్డురావడంతో రాడ్డుతో తలపై బలంగా కొట్టాడు.
గాయపడ్డ తుకారాంని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు ప్రకటించారు. కిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.


