పంచాయతీరాజ్‌కు రూ.14,723 కోట్లు

పంచాయతీరాజ్‌కు రూ.14,723 కోట్లు - Sakshi


వ్యవస్థ పటిష్టం కోసం బడ్జెట్‌లో భారీ కేటాయింపులు



ఆసరాకు అవసరానికి మించి రూ.5,330.59 కోట్లు

‘భగీరథ’కు 80% అప్పులే.. బడ్జెట్‌ సపోర్ట్‌ రూ.3,000 కోట్లు




సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థలను పటిష్టం చేయడంతో పాటు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం 2017–18 వార్షిక బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు భారీ స్థాయిలో కేటాయింపు చేసింది. 2016–17 బడ్జెట్‌లో పీఆర్‌అండ్‌ఆర్‌డీకి రూ.11,031 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తాజా బడ్జెట్‌లో రూ.14,723.42 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.1,891.09 కోట్లను నిర్వహణ పద్దుగా చూపగా, అభివృద్ధి పనుల కోసం ప్రగతి పద్దు కింద రూ.12,832.32 కోట్లు కేటాయించింది.



నిర్వహణ వ్యయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి రూ.3 కోట్లు.. ప్రగతి పద్దులో జిల్లా పరిషత్తులకు సాయం, స్థానిక సంస్థలకు ఎస్‌ఎఫ్‌సీ గ్రాంట్‌ కలిపి రూ.111 కోట్లు, మండల పరిషత్తులకు రూ.61.50 కోట్లు, గ్రామ పంచాయతీల కోసం రూ.52.10 కోట్లు కేటాయించింది. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి రహదారుల నిర్మాణానికి రూ.484.60 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ.146.77 కోట్లు, గిరిజన సబ్‌ప్లాన్‌ కింద రూ.86 కోట్లు ప్రకటించింది. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి మిషన్‌ భగీరథతో కలిపి రూ.3,228.37 కోట్లు కేటాయించింది.



గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు ఇలా..

గ్రామీణాభివృద్ధికి నిర్వహణ పద్దు కింద బడ్జెట్లో రూ.58.41 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ప్రగతి పద్దు కింద రూ.7,384 కోట్లు చూపింది. రూర్బన్, టీఆర్‌ఐజీపీ, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం.. తదితర పథకాల అమలు కోసం రూ.330 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఉపాధిహామీ పథకానికి రూ.3 వేల కోట్లు, రాజేంద్రనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థకు రూ.6.04 కోట్లు కేటాయించారు.



ఆసరాకు భారీ కేటాయింపులు

సామాజిక భద్రతా పింఛన్ల పథకం ‘ఆసరా’కు ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. పథకం కింద ప్రస్తుతం 36 లక్షల మంది లబ్ధిదారులుండగా, నెలనెలా పింఛన్ల కోసం ఏడాదికి రూ.4,800 కోట్లు అవసరమవుతున్నాయి. ఏప్రిల్‌ 1నుంచి ఒంటరి మహిళలకూ ఆసరా కింద ఆర్థిక భృతి అందించాలని నిర్ణయించడంతో సుమారు 2 లక్షల మందికి మరో రూ,.247 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆసరాకు రూ.5,247 కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం రూ.5,330.59 కోట్లు కేటాయించడం విశేషం.



అప్పులతోనే భగీరథ!

మిషన్‌ భగీరథ ప్రాజెక్ట్‌కు వివిధ ఆర్థిక సంస్థలిచ్చే అప్పులే ఆధారం కానున్నాయి. రూ.42 వేల కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కు బ్యాంకు రుణాల ద్వారానే నిధులు సమకూర్చాలని ప్రభుత్వం భావించింది. అయితే.. ప్రాజెక్ట్‌ పరిధిలోని వివిధ సెగ్మెంట్లకు 80%  మించి రుణాలిచ్చేందుకు బ్యాంకు లు అంగీకరించకపోవడంతో 20 శాతం నిధులను బడ్జెట్‌ సపోర్ట్‌గా అందిం చేందుకు ప్రభు త్వం సన్నద్ధమైంది. ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. తన వాటా నిధుల కింద రూ.3 వేల కోట్లు కేటాయించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top