‘రోడ్ సైడ్’ టై | Sakshi
Sakshi News home page

‘రోడ్ సైడ్’ టై

Published Sat, Apr 2 2016 12:08 AM

‘రోడ్ సైడ్’ టై - Sakshi

సిటీబ్యూరో/నల్లకుంట: సువిశాల జాతీయ రహదారుల పైనే కాదు...        అంతంతమాత్రంగా ఉండే నగర రోడ్ల పైనా భారీ వాహనాలు దూసుకుపోతున్నాయి. ఫలితంగా తమ ప్రమేయం, నిర్లక్ష్యం లేకుండానే పాదచారులు అశువులు బాస్తున్నారు. శుక్రవారం విద్యానగర్‌లో స్కూలు వ్యాన్ బీభత్సంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఈ కోవకు చెందినదే. ఇలాంటి ఘటనలకు అటు డ్రైవర్లు, ఇటు వాహనాల ఫిట్‌నెస్ లోపాలే ప్రధాన కారణంగా తేలుతోంది.

 
‘ఖాళీ’ సమయాల్లోనే...

నగరంలో ఈ తరహా ప్రమాదాలన్నీ ‘నాన్-పీక్ అవర్స్’గా పిలిచే రద్దీ లేని వేళల్లోనే చోటు చేసుకుంటున్నాయి. రహదారులు  పక్కాగా లేకపోయినా... ఆ సమయాల్లో రోడ్లపై రద్దీ తక్కువగా ఉండటంతో వాహన చోదకులు దూసుకుపోతున్నారు. తాము నడుపుతున్న వాహనం ఫిట్‌నెస్, తమ సామర్థ్యాలను  పట్టించుకోవడం లేదు. ఫలితంగా హఠాత్తుగా అదుపు తప్పుతున్న వాహనాలు రహదారులపై ఉన్న వారి ప్రాణాలు తోడేస్తున్నాయి. ప్రైవేట్ వాహనాలే కాదు... సుశిక్షుతులైన డ్రైవర్లుగా పరిగణించే వ్యక్తులు నడిపే ఆర్టీసీ బస్సులూ ఈ కోవలోకి చేరుతున్నాయి. ఈనెల 21న తెల్లవారుజామున ఉప్పల్-రామాంతపూర్ ప్రధాన రహదారిపై పారిశుద్ధ్య విధుల్లో ఉన్న కార్మికురాలు కొమరమ్మను ఆర్టీసీ బస్సు బలిగొంది. శుక్రవారం నాటి మెటాడోర్ ప్రమాదమూ ఉదయం 6-7 గంటల మధ్యే జరిగింది.

 

డ్రైవర్ల ‘ఉల్లంఘనలూ’ తోడవుతున్నాయి

ఈ తరహా ప్రమాదాలకు డ్రైవర్లు నిబంధనలను బేఖాతరు చేయడమూ ఓ కారణంగా కనిపిస్తోంది. సిటీలోని అనేక ప్రాంతాల్లో... ప్రధానంగా కీలక రహదారులపై, కూడళ్ల వద్ద వేగాన్ని నియంత్రించుకోవాల్సిన డ్రైవర్లు దాన్ని బేఖాతరు చేస్తూ దూసుకుపోతున్నారు. దీంతో హఠాత్తుగా కనిపించే, ఎదురు వచ్చే పాదచారులను తప్పించలేక వారి ఉసురు తీస్తున్నారు. ఇంకొందరు ప్రైవేట్ డ్రైవర్లు ఏకంగా సెల్‌ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రాణాలు బలిగొంటున్నారు. జనవరి 9న సూరారం రాజీవ్ గృహకల్పలో రెండేళ్ల చిన్నారి ధనుష్‌ను ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో మృత్యువాత పడ్డాడు. ఆ సమయంలో డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండటమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పడం గమనార్హం.

 
‘కాల పరిమితి’ నామ్‌కే వాస్తేనే...

రహదారులపై సంచరించే వాహనాలకు మోటారు వాహనాల చట్టం కాల పరిమితిని విధించింది. 15 ఏళ్లు దాటిన వాహనాలకు నిత్యం ఫిట్‌నెస్ పరీక్షలు చేస్తూ.. సామర్థ్యంతో ఉన్న వాటినే అనుమతించాల్సిన బాధ్యత ఆర్టీఏపై ఉంది. ఈ నిబంధనలు పక్కాగా అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. విద్యానగర్‌లో వ్యక్తి ప్రాణం తీసిన మెటాడోర్ వ్యాన్ సైతం 1980లలో రోడ్డు ఎక్కింది. అప్పటి నుంచి నిర్విరామంగా ‘పని’ చేస్తూనే ఉండటంతో ఫిట్‌నెస్ కోల్పోయి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. గత నెల 27న నగరంలోని మూడు ప్రాంతాల్లో భారీ వాహనాలు ‘అదుపు తప్పాయి’. ఉప్పల్, రాజేంద్రనగర్‌లలో లారీలు, బంజారాహిల్స్ ప్రాంతంలో బస్సు దూసుకు వచ్చేయడంతో ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. అనేక మంది క్షతగాత్రులుగా మారడంతో పాటు కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మూడు ఉదంతాల్లో డ్రైవర్లలో ‘ఫిట్‌నెస్’ లోపమే కారణమని తెలుస్తోంది.

 
‘రవాణా’ పట్టదా?

ఫిట్‌నెస్ సరిగా లేని వాహనాల్లో పాఠశాలల విద్యార్థులను తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదనే విమర్శలు ఉన్నాయి. లక్కీ కేఫ్ చౌరస్తా వద్ద బ్రేక్‌లు ఫెయిలై... ఓ వ్యక్తిని పొట్టన పెట్టుకున్న వాహనాన్ని రామంతాపూర్ రాంరెడ్డినగర్‌కు చెందిన బి.లక్ష్మణ్ నిర్వహిస్తున్నారు. తార్నాకలోని సెయింట్ యాన్స్ పాఠశాలకు నిత్యంవిద్యార్థులను చేరవేస్తుంటాడు. విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు కచ్చితంగా పసుపు రంగులో ఉండాలి. ఆ పాఠశాల పేరు, ఫోన్ నంబర్లు వాహనంపై రాసి ఉంచాలి. ఇవేవీ లేకుండానే ఈ వాహనం దూసుకుపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement