‘హార్వర్డ్‌’కు గురుకుల విద్యార్థి | Residential Student to the 'Harvard' | Sakshi
Sakshi News home page

‘హార్వర్డ్‌’కు గురుకుల విద్యార్థి

Jul 17 2017 3:23 AM | Updated on Sep 5 2017 4:10 PM

‘హార్వర్డ్‌’కు గురుకుల విద్యార్థి

‘హార్వర్డ్‌’కు గురుకుల విద్యార్థి

ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి మాశగల్ల ఆనంద్‌ ఎంపికయ్యాడు.

ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన మాశగల్ల ఆనంద్‌
 
సాక్షి, హైదరాబాద్‌: ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి మాశగల్ల ఆనంద్‌ ఎంపికయ్యాడు. అకడమిక్‌ ప్రొఫైల్, రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో శిక్షణకు ఎంపిక చేస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఆసియా నుంచి దాదాపు 2,500 మంది విద్యార్థులు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోగా అందులో 40 మంది ఎంపికయ్యారు.

ఈ శిక్షణ కార్యక్రమం త్వరలో దుబాయ్‌లో ప్రారంభం కానుంది. అనంతరం ఆయా విద్యార్థులు వర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ చేసేందుకు ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సందర్భంగా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేస్తోందని, వారికి కల్పిస్తున్న వసతులతో విద్యార్థులు అద్భుతాలు సాధిస్తున్నారని అన్నారు. గురుకులాలకు ప్రత్యేక నిధులిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
 
వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి..
మాశగల్ల ఆనంద్‌ సొంతూరు వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం. అమ్మ రత్నమ్మ, నాన్న కాశయ్య ఇద్దరూ వ్యవసాయ కూలీలు. ఆనంద్‌ నాలుగో తరగతి వరకు స్థానికంగానే చదువుకున్నాడు. చదివించే స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులు.. ఐదో తరగతిలో చిల్కురు గురుకుల పాఠశాలలో చేర్పించారు. అక్కడ పదో తరగతి పూర్తి చేసిన ఆనంద్‌.. ఇబ్రహీంపట్నంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో 2016–17 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశాడు. తాజాగా హార్వర్డ్‌ వర్సిటీ నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి ఎంపిక కావడంతో వచ్చే నెల రెండో వారంలో దుబాయ్‌ వెళ్లనున్నాడు. శిక్షణ పూర్తి చేస్తే హార్వర్డ్‌ యూనివర్సిటీలో డిగ్రీలో ప్రవేశానికి 50 శాతం వెయిటేజీ ఇస్తారు. 
 
‘గురుకుల’ప్రవేశంతో జీవితమే మారిపోయింది..
గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందడంతో నా జీవితమే మారిపోయింది. అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చా. ఉన్నత చదువును విజయవంతంగా పూర్తి చేసి పెద్ద పరిశ్రమను స్థాపించాలనేది నా కోరిక. అందులో ప్రతిభావంతులైన నిరుపేదలకు ఉపాధి కల్పించాలనేది భవిష్యత్తు లక్ష్యం.
– ‘సాక్షి’తో ఆనంద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement