
సాక్షి, హైదరాబాద్: చిన్నారులుసహా ప్రతి ఒక్కరూ వినియోగించే టెటనస్(టీటీ) వ్యాక్సిన్ల రీ–ప్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యాంపిల్స్(ఇంజక్షన్ల బుడ్డి) ను ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ప్యాక్ చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళ వారం రాత్రి దాడి చేశారు. దాదాపు రూ.20 లక్షల విలువైన యాంపిల్స్ స్వాధీనం చేసుకు న్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నా రు. డి.సూర్యనారాయణరాజు ఎండీగా, ఆయన కుమారుడు వి.వేణుగోపాలరాజు డైరెక్టర్‌గా ఘట్‌కేసర్‌లో డానో పేరుతో కంపెనీ నడుస్తోంది.
ఈ సంస్థే టీటీ యాంపుల్స్‌ను తయారు చేసి ప్యాక్ చేస్తుంది. నిబంధనల ప్రకారం వీటిని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో, పరిశుభ్రమైన వాతావరణంలో, పటిష్టమైన ఏర్పాట్ల మధ్య ప్యాక్ చేయాలి. డానో సంస్థకు అను బంధంగా, వేణుగోపాలరాజు పేరుతో అంబర్‌పేట్‌లోని ఛే నంబర్ వద్ద ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. సంస్థకు అవసరమైన ముద్రణ తోపాటు యాంపిల్స్ ప్యాక్ చేయడానికి అవసరమైన చిన్న అట్ట పెట్టెల్ని ఇక్కడ తయారు చేస్తుంటారు. ఘట్‌కేసర్‌లోని సంస్థలో తయారు చేసినవాటిలో సక్రమంగా ప్యాక్ కాని, పూర్తిస్థాయిలో నిండని యాంపిల్స్‌ను నిర్వాహకులు ఇక్కడకు తరలిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఈ ప్రెస్‌లో ఆ యాంపిల్స్‌ను రీ–ప్యాక్ చేసి మళ్లీ కంపెనీకి తరలిస్తున్నారు. ఇలా రీ–ప్యాక్ చేసే సమయంలో ఆ బాటిళ్లపై బ్యాచ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్ తదితరాలు తెలిపే కవర్లు, స్టిక్కర్లు సైతం ఉండట్లేదు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ తమ బృందాలతో దాడి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకోవడంతోపాటు రూ.20 లక్షల విలువైన యాంపిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం ఔషధ నియంత్రణ విభాగానికి అప్పగించారు. స్వాధీనం చేసుకున్న నమూనాలపై ల్యాబ్ రిపోర్ట్ వచ్చాకే అవి ఎంత ప్రమాదకరమో తెలుస్తుందని అధికారులు చెప్తున్నారు. ప్రాథమికంగా ఈ సంస్థ నిర్వాహకులు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు.