ఉదాసీనతే అసలు.. ఉన్మాదం | psycho killed a 6 year child in secundrbad rail way station | Sakshi
Sakshi News home page

ఉదాసీనతే అసలు.. ఉన్మాదం

Dec 11 2013 1:27 AM | Updated on Sep 2 2017 1:27 AM

ఉదాసీనతే అసలు..  ఉన్మాదం

ఉదాసీనతే అసలు.. ఉన్మాదం

ఓ ఉన్మాది రెండు చేతుల్లో కత్తులతో వీరంగమాడుతూ పట్టపగలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆరేళ్ల చిన్నారి ప్రియదర్శినిని కర్కశంగా పొడిచి చంపేశాడు.

 అక్కడి నుంచి నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగిస్తారు..  
 కానీ నిఘా, భద్రత మచ్చుకైనా కానరావు..
 హిజ్రాలు, వ్యభిచారిణులు యథేచ్ఛగా తిరుగుతుంటారు..
 కొందరు మత్తులో జోగుతూ మతితప్పి ప్రవర్తిస్తుంటారు..
 ఆగి ఉన్న రైలు బోగీల్లో అసాంఘిక కార్యకలాపాలు..
 జేబుదొంగల చేతివాటం సరేసరి..
 అడపాదడపా రైలు బోగీలకు నిప్పంటుకుంటుంటుంది..  
 
 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముఖచిత్రమిది. పోలీసులది షరా మామూలుగా ఉదాసీన వైఖరి. ఇవన్నీ అక్కడ చాలా సర్వసాధారణ దృశ్యాలు.
 
 సాక్షి, సిటీబ్యూరో:
 ఓ ఉన్మాది రెండు చేతుల్లో కత్తులతో వీరంగమాడుతూ పట్టపగలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆరేళ్ల చిన్నారి ప్రియదర్శినిని కర్కశంగా పొడిచి చంపేశాడు. మెటల్ డిటెక్టర్లు, ప్రవేశద్వారాల వద్ద తనిఖీలు దాటుకుని అతను స్టేషన్ ప్రాంగణంలోకి నేరుగా వచ్చేయగలిగాడంటే నిఘా, భద్రత పర్యవేక్షణ ఎంత అధ్వానంగా ఉన్నాయో ఊహించవచ్చు. మరికాసేపట్లో రెలైక్కి నాన్న, నాన్నమ్మతో సరదాగా ప్రయాణించాల్సిన చిన్నారి ఉన్మాది చేతుల్లో దారుణంగా బలైపోయింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టించింది. అసాంఘికశక్తులపై కఠినంగా వ్యవహరించి వారిని స్టేషన్‌కు ఆమడదూరంలో ఉంచే పద్ధతి తొలి నుంచీ ఉండి ఉంటే ఇంతటి దారుణోదంతం జరిగేది కాదని ప్రయాణికులు అంటున్నారు.  
 
 ‘టై’ జోన్‌గా స్టేషన్ పరిసరాలు
 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నిత్యం హిజ్రాలు, వ్యభిచారిణుల సంచారం ఉంటుంది. అనేక సందర్భాల్లో వీరు ప్రయాణికుల్ని ఆకర్షించడం ద్వారా నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లి దాడులకు పాల్పడిన ఉదంతాలూ ఉన్నాయి. ఇక, వీరి మధ్య గ్యాంగ్‌వార్స్ కూడా తరచూ జరుగుతుంటాయి. ఇక మేజర్లు, మైనర్లు అనే తేడా లేకుండా వైట్‌నర్, మద్యం తాగే వాళ్లు, ఆ మత్తులో తిరిగే వాళ్లకు ఇక్కడ కొదవే లేదు. వీరి కారణంగా ప్రయాణికులు నిత్యం ఇబ్బందుల పాలవుతున్నారు. ఇక్కడిలా ఉంటే, రైల్వే యార్డుల్లో నిలిపి ఉంచిన రైళ్లు సైతం బుగ్గైన ఉదంతాలున్నాయి. ఇన్ని జరుగుతున్నా అటు గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ), ఇటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్న దాఖలాల్లేవు. దీంతో రైల్వేస్టేషన్ ప్రాంతం టై జోన్ గా మారి ప్రయాణికులను ఉలిక్కిపడేలా చేస్తోంది.
 
 సీసీ కెమెరాలు ఉన్నదెందుకు?
 లష్కర్ రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరాలకు లెక్కే లేదు. గత ఆగస్టులో గాంధీ ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన ఒకరోజు వయసున్న చిన్నారి కేసు మిస్టరీ గంటల్లో వీడిందంటే ఇక్కడి సీసీ కెమెరాలు ఇచ్చిన క్లూ వల్లే సాధ్యమైంది. ఇప్పటి వరకు సీసీ కెమెరాలు ఓ ఉదంతం జరిగినప్పుడు దాన్ని కొలిక్కి తేవడానికి మాత్రమే ఉపకరిస్తాయనే భావన అధికారులు, వ్యవస్థల్లో వేళ్లూనుకుపోయింది. వీటివల్ల ఉదంతం జరగకుండా నిరోధించడం కూడా సాధ్యమనే భావన పెరగాలి. నిజానికి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యే దృశ్యాలను నిరంతరం పరిశీలించి, పర్యవేక్షించడానికి ఒక వ్యవస్థ ఉండాలి. అయితే అటువంటిదేమీ జరగడం లేదు. వాటిని పరిశీలించే సిబ్బందికి ఆ కోణంలో శిక్షణా ఇవ్వడం లేదు. దీంతో ఉదంతాలు జరగకుండా నిరోధించే వ్యవస్థ కరువై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. అనుమానిత వస్తువులు, వ్యక్తుల్ని ఎలా గుర్తించాలి? విపరీత స్వభావం కలిగిన వారి, అసాంఘికశక్తుల కదలికలెలా ఉంటాయనే అంశాలపై శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన ఉన్నతాధికారులకు రాకపోవడం గమనార్హం.
 
 టిక్కెట్టు లేకుండానే చిత్తూరు టు హైదరాబాద్
 బాలికను పాశవికంగా హత్య చేసిన కరణ్‌కుమార్‌ది చిత్తూరు జిల్లా పుత్తూరు. అక్కడ నుంచి టిక్కెట్టు లేకుండా పలు రైళ్లు మారుతూ సికింద్రాబాద్ వచ్చేశాడు. ఇటీవలే పుత్తూరులో తమిళనాడుకు చెందిన అల్‌ఉమా సంస్థ ఉగ్రవాదులు చిక్కారు. కరణ్ అదే ప్రాంతం నుంచి పలు స్టేషన్లు దాటుకుని ఇక్కడి వరకు వచ్చేసినా మార్గమధ్యంలో ఉన్న ఏ పోలీసులకూ అనుమానం రాలేదు.
 
 టిక్కెట్టు లేని ఈ ప్రయాణికుడిని టీటీఈ, టీసీలు గుర్తించి అవసరమైన చర్యలు తీసుకున్నా అతను అక్కడే ఆగిపోయేవాడు. ఇలా పలు కోణాల్లో అధికారులు విఫలమవ్వడం వల్లే ఉన్మాది చిన్నారిని చిదిమేశాడు.
 లష్కర్ స్టేషన్‌లో మిస్టరీ ఘటనలుసికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న పలు అగ్ని‘ప్రమాదాలు’ మిస్టరీగానే ఉండిపోయాయి. ఈ ఉదంతాల సందర్భంలో సంబంధిత అధికారులు సరైన రీతిలో స్పందించి ఉంటే గట్టి భద్రత చర్యలకు వీలుండేది.
 
     2006 ఆగస్టు: సికింద్రాబాద్-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు మూడు బోగీలు దగ్ధమయ్యాయి
     2007 డిసెంబర్: బోయగూడ యార్డ్‌లో నిలిపి ఉంచిన రైలు బోగీలో మహిళ అనుమానాస్పదస్థితిలో కాలిబూడిదైంది
     2009 సెప్టెంబర్: యార్డ్‌లో నిలిచి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి.
 
 గంగపుత్ర కాలనీలో విషాదఛాయలు
 భోలక్‌పూర్, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చిన్నారి ప్రియదర్శిని దారుణంగా హత్యకు గురైన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.  ముషీరాబాద్ గంగపుత్రకాలనీకి చెందిన శ్రీనివాస్, సోనూ దంపతుల పెద్ద కుమార్తె ప్రియదర్శిని.వీరు ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో ఉంటున్నారు. చిన్నారి మరణవార్త విని ఇరుగుపొరుగు వారు కంటతడిపెట్టారు. మెదక్ జిల్లా కోనైపల్లికి చెందిన టి.శ్రీనివాస్, సోనూ దంపతులు రెండేళ్ల క్రితమే ఈ ప్రాంతంలో అద్దెకు దిగారు. ప్రియదర్శిని ముషీరాబాద్ పార్శిగుట్ట వద్ద గల మార్టినెట్ హై స్కూల్‌లో 1వ తరగతి చదువుతోంది. శ్రీనివాస్ ప్రైవేటు ఉద్యోగి. భార్య సోనూ దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ స్కూల్‌లో టీచర్. ప్రియదర్శిని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement