ప్రొ.జయశంకర్ వర్సిటీ ఏర్పాటు | Pro.Jaya Shankar University established in telangana | Sakshi
Sakshi News home page

ప్రొ.జయశంకర్ వర్సిటీ ఏర్పాటు

Aug 1 2014 1:30 AM | Updated on Aug 17 2018 2:08 PM

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలను విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం కూడా..
ఆచార్య ఎన్జీ రంగా, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీలను విభజిస్తూ ఉత్తర్వులు

 
సాక్షి, హైదరాబాద్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలను విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీని విభజించి ‘ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ’గా నామకరణం చేసింది.
 
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ విభజన చేసినట్లు పేర్కొంది. ఈ విభజన అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ నోడల్ ఆఫీసర్/రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు ఇచ్చారు. జయశంకర్ యూనివర్సిటీ ప్రస్తుతం ఉన్న క్యాంపస్‌లోనే కొనసాగుతుందని స్పష్టంచేశారు. కొత్త వర్సిటీకి చట్టం రూపొందించే వరకు ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ చట్టం-1963 ప్రకారమే కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు.
 
అలాగే మాజీ ప్రధాని పీవీ పేరుమీద ‘పీవీ నరసింహారావు తెలంగాణ రాష్ట్ర వెటర్నరీ, యానిమల్, ఫిషరీస్ సెన్సైస్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నోడల్ ఆఫీసర్/పశుసంవర్థకశాఖ డెరైక్టర్‌ను ఆదేశించింది. తిరుపతిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీని విభజించి దీన్ని ఏర్పాటు చేసింది. విభజన తర్వాత తెలంగాణ వెటర్నరీ వర్సిటీ రాజేంద్రనగర్‌లోని ప్రస్తుత క్యాంపస్‌లోనే ఉంటుందని పేర్కొంది.
 
పోస్టుల విభజన..:
వ్యవసాయ, వెటర్నరీ యూనివర్సిటీలను విభజిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయా వర్సిటీల్లో ఉన్న పోస్టులను 58:42 నిష్పత్తి ప్రకారం విభజిస్తామని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రవీణ్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియంతా కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల ప్రకారమే ఉంటుందని స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement