‘నయా’వంచకుడు | Porno graphy post on the facebook | Sakshi
Sakshi News home page

‘నయా’వంచకుడు

Mar 11 2017 1:42 AM | Updated on Sep 18 2018 8:23 PM

‘నయా’వంచకుడు - Sakshi

‘నయా’వంచకుడు

అతడి పేరు మణిరత్నం... వృత్తి వ్యవసాయ కూలీ, ప్రవృత్తి మాత్రం వాట్సాప్‌ వేధింపులు...

 ఫేస్‌బుక్‌ నుంచి నెంబర్లు... వాట్సాప్‌లో గ్రూప్‌
 మహిళలను టార్గెట్‌ చేసుకుని అశ్లీల సాహిత్యం పోస్ట్‌
 దర్యాప్తు చేపట్టిన ఎస్సైకే బెదిరింపులు, ఫేస్‌బుక్‌ హ్యాక్‌
 నిందితుడి అరెస్టు


సిటీబ్యూరో: అతడి పేరు మణిరత్నం... వృత్తి వ్యవసాయ కూలీ, ప్రవృత్తి మాత్రం వాట్సాప్‌ వేధింపులు... బాధితుల జాబితాలో అనేక మంది మహిళలు/యువతులతో పాటు ఓ ఎస్సై కూడా ఉన్నారు. డీసీపీ అవినాష్‌ మహంతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందమూరుకు చెందిన ఉప్పులూరి మణిరత్నం పదో తరగతి వరకు చదివాడు. అక్కడే వ్యవసాయ కూలీగా పని చేస్తున్న ఇతగాడికి ఓ స్మార్ట్‌ఫోన్‌ ఉంది. కొన్ని రోజుల క్రితం ‘ఆల్‌ ఫ్రీ’ సర్వీసు కనెక్షన్‌ తీసుకున్నాడు. అప్పటి నుంచి తన ఫోన్‌లో ఎడాపెడా ఇంటర్‌నెట్‌ వాడేస్తున్న మణిరత్నం ఫేస్‌బుక్‌పై దృష్టి పెట్టాడు. అందులో మహిళలు/యువతులకు చెందిన పేజీల్లోకి వెళ్లి,  వారి ఫోన్‌ నెంబర్లు సేకరించేవాడు.

ఆ నెంబర్ల ఆధారంగా వాట్సాప్‌లో సదరు యువతులు/ మహిళలతో చాటింగ్స్‌ ప్రారంభించేవాడు. కొన్నిసార్లు శృతిమించిన సంభాషణలు చేసేవాడు. ఎదుటి వారి ప్రమేయం లేకుండానే వాట్సాప్‌లో ఓ గ్రూప్‌ క్రియేట్‌ చేసిన మణిరత్నం దానికి ‘రోమాంటిక్‌ థాట్స్‌ షేరింగ్‌’ అనే పేరు పెట్టాడు. ఈ గ్రూప్‌ ద్వారా అభ్యంతరకర/అశ్లీల పోస్టులు, ఫొటోలు షేర్‌ చేయడంతో పాటు సభ్యులుగా ఉన్న వారి వ్యక్తిగత వివరాలు, ఫొటోలు తదితరాలు అడుగుతూ వేధించాడు. దాదాపు 300 మంది యువతులు/మహిళలు అతడి భారిన పడ్డారు. వీరిలో కొందరు ‘హాక్‌ ఐ’ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును షీ–టీమ్స్‌కు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన ఎస్సై ఎం.శోభన్‌బాబు ప్రాథమికంగా నిందితుడు వినియోగించిన నెంబర్‌కు ఫోన్‌ చేసి అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదు. దీంతో నిందితుడి నెంబర్‌కు వాట్సాప్‌ ద్వారా సందేశం పంపాడు. తనకు సందేశం వచ్చిన నెంబర్‌ను ట్రూకాలర్‌లో తనిఖీ చేసిన మణిరత్నం అది పోలీసు విభాగంలో పని చేసే శోభన్‌కు చెందినదిగా గుర్తించాడు.

దీంతో మరింత రెచ్చిపోయిన నిందితుడు ఎస్సైకే బెదిరింపు సందేశాలు పంపడంతో పాటు అతడి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేశాడు. ఎస్సైతో చాటింగ్స్‌ చేసే సందర్భంలో నిందితుడు కొన్ని వ్యక్తిగత అంశాలు ప్రస్తావించడంతో శోభన్‌బాబు సైబర్‌క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ బి.చాంద్‌ బాష సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు.

శివబాలాజీపై అభ్యంతరకర వ్యాఖ్యలు...
సిటీ నటుడు శివబాలాజీ సైతం సైబర్‌ బాధితుడిగా మారారు. దీంతో ఆయన శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శివబాలాజీ ప్రస్తుతం ‘కాటమరాయుడు’ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయినట్లు గురువారం తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ సందర్బంలో మరో నటుడు అలీ తదితరులతో దిగిన సెల్ఫీలను అప్‌లోడ్‌ చేశారు. ఈ పోస్ట్‌పై ‘వాసు సీహెచ్‌’ ఐడీతో ఉన్న వ్యక్తి అసభ్యపదజాలంతో కామెంట్‌ చేశాడు. శివబాలాజీ మందలించినప్పటికీ స్పందన లేకపోవడంతో శుక్రవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement