ఆలమట్టిలోకి ఒక్కరోజే 16 టీఎంసీలు | Sakshi
Sakshi News home page

ఆలమట్టిలోకి ఒక్కరోజే 16 టీఎంసీలు

Published Fri, Jul 15 2016 3:20 AM

ఆలమట్టిలోకి ఒక్కరోజే 16 టీఎంసీలు

* 70 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
* తుంగభద్రకు భారీగా ప్రవాహాలు
* మరో పది రోజుల్లో దిగువకు కృష్ణమ్మ పరుగులు!
సాక్షి, హైదరాబాద్:
ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆలమట్టి జలక ళను సంతరించుకుంటోంది. బుధవారం ఒక్కరోజే ప్రాజెక్టులోకి ఏకంగా 16 టీఎంసీల మేర నీరొచ్చి చేరింది. గురువారం సైతం 1.75 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండటం, ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదవుతుండటంతో ఐదారు రోజుల్లోనే ప్రాజెక్టు నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదే జరిగితే ఈ నెలాఖరుకు ఎగువ ప్రాజెక్టుల నుంచి దిగువన ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులకు నీళ్లొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. తుంగభద్రకు కూడా ప్రవాహాలు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 2 టీఎంసీల మేర నీరు వచ్చి చేరింది. ఆలమట్టిలోకి మరో 50 టీఎంసీల నీరు చేరితే దిగువన ఉన్న నారాయణపూర్‌కు నీటిని వదిలే అవకాశాలున్నాయి. నారాయణపూర్ నిండిన వెంటనే జూరాలకు నీటి ప్రవాహాలు మొదలు కానున్నాయి. దిగువకు ప్రవాహాలు వచ్చేందుకు పది రోజులకు మించి సమయం పట్టకపోవచ్చని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది.
 
గోదావరి తగ్గుముఖం
భద్రాచలం: గోదావరి నీటి ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రానికి నీటిమట్టం 42.5 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాకపోవడం, దిగువన ఉన్న కిన్నెరసాని, శబరి నదుల్లో వరద తాకిడి లేకపోవడంతో గోదావరి నీటి మట్టం తగ్గుతోంది. భద్రాచలం డివిజన్‌లోని పలు మండలాల్లో రోడ్లపై నీటి ఉధృతి తగ్గింది. రాకపోకలు ప్రారంభం కాగా.. భద్రాచలంలోని స్నానఘట్టాలు, కల్యాణకట్ట కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి. స్లూయిజ్ లీకేజీ ద్వారా నీరు బయటకు వచ్చి ఇళ్లు మునగటంతో గోదావరి తగ్గినప్పటికీ ఇంకా కొంత మేర అలాగే నీరు నిలిచిపోయింది. శుక్రవారం నాటికి వరద మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
 
ఎస్సారెస్పీ... తగ్గిన ఇన్‌ఫ్లో
బాల్కొండ: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి గురువారం వరద నీరు తగ్గుముఖం పట్టింది. క్రితం రోజు 58 వేల క్యూసెక్కులు వచ్చి చేరిన వరద నీరు  19,344 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్ట్ నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు) కాగా.. గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1062.30 అడుగులు (16.34 టీఎంసీల) నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుత సీజన్‌లో 12 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో 15 అడుగుల నీటి మట్టం పెరిగిందన్నారు.

Advertisement
 
Advertisement