సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీని, పీడీఎస్‌యూను ఉక్కుపాదంతో అణచివేస్తానని ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా ఖండించారు.
న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్
హైదరాబాద్: సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీని, పీడీఎస్‌యూను ఉక్కుపాదంతో అణచివేస్తానని ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా ఖండించారు. విప్లవ పార్టీపై ఉక్కుపాదం మోపుతానని బెదిరిస్తే ఉద్యమా లు ఆగవని, ఇలాంటి బెదిరింపులకు బెదిరే చరిత్ర న్యూ డెమోక్రసీకి లేదన్నారు. ఉద్యమ పార్టీ, ఉద్యమాలే శ్వాసగా, ఆశగా బతుకుతుందని, అధికార పార్టీ నేతలు ప్రజాస్వామిక ధోరణి ప్రదర్శించాలని హితవు పలికారు.
ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చేందుకు చేసిన ఆందోళనలను, నిరసనలను చిల్లర వేషాలంటూ మాట్లాడటం ముఖ్యమంత్రికి తగదన్నారు. 2009లో కేసీఆర్‌ను అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకొచ్చినప్పుడు పీడీఎస్‌యూ, న్యూ డెమోక్రసీలే ఆయనకు అండగా నిలిచాయని గుర్తుచేశారు. ఈ ఉద్యమాల ఫలితంగానే కేసీఆర్ సీఎం అయిన తరువాత జిల్లాల్లో పోడుభూములు లాక్కుంటున్నారని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం మరిచారని, ప్రాజెక్టు నిర్మాణాలలో జాప్యం పాటిస్తున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు రావడం లేదని జిల్లాకో వర్సిటీ ఇస్తామన్న హామీ నెరవేరలేదన్నారు. కాగా పీడీఎస్‌యూ, మాతృసంస్థ న్యూ డెమోక్రసీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు.