టుండా రైలుపై మావోయిస్టుల దాడి | Maoists attack train tunda | Sakshi
Sakshi News home page

టుండా రైలుపై మావోయిస్టుల దాడి

Oct 19 2013 4:18 AM | Updated on Oct 9 2018 2:51 PM

‘1987 ఏప్రిల్‌లో ఆజం ఘోరీని కలవడానికి హైదరాబాద్ వచ్చా... అది సాధ్యం కాకపోవడంతో రైలులో తిరిగి వెళ్తుండగా ఆదిలాబాద్‌జిల్లా కాగజ్‌నగర్ వద్ద నేను ప్రయాణిస్తున్న రైలుపై మావోయిస్టులు దాడి చేశారు. త్

సాక్షి, సిటీబ్యూరో:  ‘1987 ఏప్రిల్‌లో ఆజం ఘోరీని కలవడానికి హైదరాబాద్ వచ్చా... అది సాధ్యం కాకపోవడంతో రైలులో తిరిగి వెళ్తుండగా ఆదిలాబాద్‌జిల్లా కాగజ్‌నగర్ వద్ద నేను ప్రయాణిస్తున్న రైలుపై మావోయిస్టులు దాడి చేశారు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డా’ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో లష్కరే తొయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా బయటపెట్టిన విషయమిది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆగస్టులో అరెస్టు చేసిన టుండాను సిట్ అధికారులు ఈ నెల 10న పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చారు.

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ 1998లో సిటీ పోలీసులకు చిక్కిన పాకిస్తాన్ జాతీయుడు సలీం జునైద్ కేసులో టుండా నిందితుడు. సిట్ విచారణలో టుండా వెల్లడించిన అంశాలివి...  ఆ తరవాత కొన్నాళ్లకు ఢిల్లీలో ఆజం ఘోరీని కలి సినప్పుడు ఈ అనుభవా న్ని అతడితో పంచుకున్నా డు. ఆ తర్వాతే 1994లో దేశం దాటడం, బంగ్లాదేశ్‌లో సలీం జునైద్‌కు శిక్షణ ఇవ్వడం వంటివి చేశాడు. సిట్ పోలీసుల కస్టడీ గడువు పూర్తికావడంతో పోలీసులు టుండాను శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.
 
 ఉగ్ర బాటపట్టిన తరవాత టుండా తొలిసారిగా 1986లో నగరానికి వచ్చాడు. అప్పుడే వరంగల్‌కు చెందిన ఆజం ఘోరీతో పరిచయం ఏర్పడింది. ఇతడి ద్వారానే టుండాకు తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్ (టీఐఎం) సహా మరికొన్ని ఉగ్రవాద సంస్థలకు చెందిన అబ్దుల్ బారి, ఫసీయుద్దీన్, నజీర్ పరిచయమయ్యారు. టుండా రెండోసారి 1987 ఏప్రిల్‌లో సిటీకి వచ్చేప్పటికీ ఆజం ఘోరీ వ్యవహారాలు పోలీసులకు తెలియడంతో అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దీంతో పరారీలో ఉండిపోవడంతో అతడిని కలుసుకోవడం టుండాకు సాధ్యం కాలేదు.

అలాంటి పరిస్థితుల్లో టుండా నగరంలో ఉండటం క్షేమం కాదని భావించిన నజీర్, ఫసీయుద్దీన్‌లు హైదరాబాద్ రైల్వేస్టేషన్ (నాంపల్లి)కు తీసుకువెళ్లి రైలు ఎక్కించారు. టుండా ప్రయాణిస్తున్న ఈ రైలుపై కాగ జ్‌నగర్ ప్రాంతంలో నక్సలైట్లు దాడి చేశారు. రైలు పట్టాలను పేల్చేయడంతో పాటు తుపాకులతోనూ విరుచుకుపడ్డారు. అనేక బోగీల్లో ఉన్న ప్రయాణికులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. అయితే, టుండా ప్రయాణిస్తున్న బోగీకి ఎలాంటి నష్టం జరగకపోవడంతో క్షేమంగా బయటపడ్డాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement