ఆ ఆర్టీఏ అధికారులను సస్పెండ్‌ చేయండి | Sakshi
Sakshi News home page

ఆ ఆర్టీఏ అధికారులను సస్పెండ్‌ చేయండి

Published Tue, Mar 6 2018 1:49 AM

mahender reddy on rta officers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వాహనాలు మనుగడలో ఉన్న కాలం, వాటి ధరలను మార్చి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దారిమళ్లించిన రంగారెడ్డి జిల్లాలోని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలోని బాధ్యులైన నలుగురు అధికారులను సస్పెండ్‌ చేయాలని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన సచివాలయంలో రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈ అవినీతి తతంగం పూర్వోత్తరాల గురించి వాకబు చేశారు. ఇలాంటి అవినీతి తంతు మరెక్కడా జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బండ్లగూడ కార్యాలయంలోని పురుషోత్తం అనే అధికారిని రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేయాలని మంత్రి ఆదేశించారు. ఖజానాకు నష్టంచేసిన రూ.1.20 కోట్లను రికవరీ చేయాలని పేర్కొన్నారు.

ఇకనుంచి వాహనాల ధరలో కృత్రిమ డిస్కౌంట్‌ ఇచ్చి పన్ను ఎగ్గొట్టే వీలులేకుండా ఆన్‌లైన్‌ విధానాన్ని మార్చాలని, ప్రతి ఫైల్‌ను ఏవో స్థాయి అధికారి వరకు పరిశీలించాలని అన్నారు. రవాణా శాఖ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేయకుండా బ్లాక్‌ చైన్‌ సాంకేతిక విధానాన్ని అనుసరించాలని పేర్కొన్నారు. సమావేశంలో రవాణాశాఖ కార్యదర్శి సునీల్‌శర్మ, జేటీసీ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement