యువ మహిళా పారిశ్రామిక వేత్తలదే భవిష్యత్‌ | Industrialist Jennifer Women Empowerment and Industrial Development | Sakshi
Sakshi News home page

యువ మహిళా పారిశ్రామిక వేత్తలదే భవిష్యత్‌

Sep 14 2017 11:08 AM | Updated on Sep 19 2017 4:33 PM

అమెరికా పారిశ్రామికవేత్త జెన్నీఫర్‌

అమెరికా పారిశ్రామికవేత్త జెన్నీఫర్‌

యువతులే ప్రపంచ పారిశ్రామిక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించగలరు..

అమెరికా పారిశ్రామికవేత్త జెన్నీఫర్‌
సాక్షి, హైదరాబాద్‌ : ‘యువతులే ప్రపంచ పారిశ్రామిక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించగలరు.. ప్రధానంగా అట్టడుగు వర్గాల స్త్రీలకు అందని ద్రాక్షగా ఉన్న పారిశ్రామిక రంగాన్ని వారికి చేరువచేసేందుకు 2020ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నాం’’ అని అన్నారు అమెరికాకి చెందిన పారిశ్రామికవేత్త జెన్నీఫర్‌. మహిళా సాధికారతకు, పారిశ్రామికాభివృద్ధికి హైదరాబాద్‌ అనువైన ప్రదేశంగా వున్నదని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళా, యువపారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో పలుచోట్ల ఆమె వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్‌కి వచ్చిన జెన్నీఫర్‌  బేగంపేట్‌ యూఎస్‌ కౌన్సిలేట్‌ జనరల్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఈ యేడాది నవంబర్‌లో హైదరాబాద్‌ వేదికగా గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ జరుగనుందన్నారు. 2015లో తాము ప్రారంభించిన కాంకర్డియా ప్రాజెక్ట్‌లో భాగంగా 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు చెందిన 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళలోపు యువతులను పారిశ్రామిక రంగంలో భాగస్వాములను చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. కేవలం 15 శాతంగా ఉన్న మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య గణనీయంగా పెరిగినప్పుడే అన్ని వర్గాల మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోగలరని ఆమె అభిప్రాయపడ్డారు.  పురుషులతో పోలిస్తే ఆర్థికావలంబన విషయంలోనూ, గుర్తింపు విషయంలోనూ స్త్రీలకు కొన్ని అడ్డంకులు ఎదురవుతున్న మాట వాస్తవమేనన్నారు. అందుకు అమెరికా కూడా అతీతం కాదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement