 
															భవన నిర్మాణ నిబంధనలు ఇక సరళతరం
రాష్ట్ర రాజధానితో పాటు పలు ఇతర నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇక మరింత ఎత్తయిన భవనాలు కనిపించనున్నాయి.
	రాష్ట్రంలో భవనాల నిబంధనలను సడలించనున్న సర్కారు
	200, 300 చదరపు గజాల్లోపు స్థలాలపై మరింత ఊరట
	నిర్మాణ స్థల విస్తీర్ణం ఆధారంగా ఫీజులు... ఆకాశ హర్మ్యాలకు ప్రోత్సాహం
	ప్రభుత్వ పరిశీలనలో నూతన భవన నిర్మాణ నియమావళి
	 
	సాక్షి, హైదరాబాద్:
	రాష్ట్ర రాజధానితో పాటు పలు ఇతర నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇక మరింత ఎత్తయిన భవనాలు కనిపించనున్నాయి. భవన నిర్మాణ నిబంధనలూ సరళతరం కానున్నాయి. సెట్‌బ్యాక్, ‘తనఖా’ తిప్పలూ తప్పనున్నాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో భవనాల ఎత్తు, సెట్‌బ్యాక్ (భవనం చుట్టూ వదలాల్సిన నిర్ణీత ఖాళీ స్థలం), మార్ట్‌గేజ్ తదితర అంశాల్లో ఉన్న పరిమితులు, నిబంధనలను ప్రభుత్వం సడలించనుంది. ఈ మేరకు కొత్త భవన నిర్మాణ నియమావళిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ‘హైదరాబాద్ భవన నిర్మాణ నియమావళి-2015’ పేరుతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన ముసాయిదా విధానం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలనలో ఉంది. దీనిని సీఎం కేసీఆర్ ఆమోదిస్తే... తొలుత హైదరాబాద్‌లో, తర్వాత రాష్ట్రమంతా అమల్లోకి రానుంది.
	 
	లక్షల మందికి ప్రయోజనం..
	‘ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ నియమావళి’ పేరుతో 2012 ఏప్రిల్‌లో ఉమ్మడి రాష్ట్ర సర్కారు జారీ చేసిన 168 జీవోయే ప్రస్తుతం అమల్లో ఉంది. ఇందులో భవనం ఎత్తు, సెట్‌బ్యాక్, తనఖా (మార్ట్‌గేజ్) తదితర అంశాలపై కఠిన నిబంధనలు ఉన్నాయి. దీంతో నిర్మాణ అనుమతులు పొందేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భవన నిర్మాణాల్లో సడలింపులు ఇవ్వాలని సాధారణ ప్రజలు, బిల్డర్లు కొంతకాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్కారు కొత్త విధానాన్ని తీసుకువస్తోంది.
	 
	 ప్రధానంగా 200, 300 చదరపు గజాలలోపు విస్తీర్ణంలో ఉన్న స్థలాల్లో పూర్తిగా సెట్‌బ్యాక్ సడలింపులతో పాటు అదనంగా ఒకటి రెండు అంతస్తులు నిర్మించుకునేందుకు అనుమతించే అంశం పరిశీలనలో ఉంది. ఇది అమల్లోకి వస్తే లక్షల మంది భవన యజమానులకు ప్రయోజనం కలగనుంది. ఇక హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ప్రస్తుతం నివాస, వాణిజ్య భవనాల ఎత్తు 15 మీటర్లకు మించకూడదనే నిబంధన ఉంది. తాజాగా మరో 5 మీటర్ల వరకు ఎత్తు పెంచుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.
	 
	తప్పనున్న తనఖా బాధలు
	భవన నిర్మాణ అనుమతి పొందాలంటే.. 10 శాతం స్థలాన్ని అనుమతులిచ్చే అధికారి పేరు మీద తనఖా రిజిస్ట్రేషన్ చేసే నిబంధన ప్రస్తుతం అమల్లో ఉంది. ఒకవేళ ప్లాన్‌లో ఉల్లంఘనలు జరిగితే ఈ స్థలాన్ని జప్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ‘తనఖా’ విషయంలోనూ మార్పు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భారీ నిర్మాణాల బిల్డర్ల నుంచి పర్యావరణ ప్రభావ ఫీజును 4 విడతల్లో వసూలు చేస్తున్నారు. ఇకపై 6 నుంచి 8 విడతలకు పెంచే అవకాశముంది. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతి ఫీజులు సైతం భారీగానే ఉన్నాయి. వ్యక్తిగత ఇళ్లకు సైతం వేలలో ఫీజు ఉండడంతో మధ్య తరగతి వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి నిర్మాణ స్థలం విస్తీర్ణం ఆధారంగా రాయితీలతో, శ్లాబుల్లో ఫీజులను నిర్ణయించే అవకాశముంది.
	 
	ఆకాశహర్మ్యాలకు ప్రోత్సాహం
	హెచ్‌ఎండీఏ పరిధిలో ఆకాశహర్మ్యాల నిర్మాణాలను ప్రభుత్వం ప్రోత్సహించనుంది. సరళీకృత అనుమతులతో పాటు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందించే విధంగా కొత్త నియమావళిని తీసుకురానుంది. టీఎస్-ఐపాస్ తరహాలో సింగిల్ విండో విధానంలో భవన అనుమతులు జారీ చేయనున్నారు. అనుమతుల్లో జాప్యం లేకుండా నిర్ణీత కాల వ్యవధిని ప్రభుత్వం ప్రకటించనుంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
