ఎంతో నమ్మకంగా తమ వద్ద ఉంటున్న ఆ ఇద్దరికీ వారు రూ.3 కోట్ల విలువైన ఆస్తి నిర్వహణ బాధ్యతలు అప్పగించి, విదేశాల్లో ఉంటున్నారు.
ఎంతో నమ్మకంగా తమ వద్ద ఉంటున్న ఆ ఇద్దరికీ వారు రూ.3 కోట్ల విలువైన ఆస్తి నిర్వహణ బాధ్యతలు అప్పగించి, విదేశాల్లో ఉంటున్నారు. అయితే, ఆ ఇద్దరూ కూడబలుక్కుని ఆ ఆస్తిని వేరొకరికి అమ్మేశారు. విషయం తెలుసుకున్న యజమాని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాలివీ...జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్-12లోని ఎమ్మెల్యే కాలనీలో ఫ్లాట్ నంబర్ 84-ఏ యజమానులు అబ్దుల్ వాహిద్ అలీ దంపతులు షార్జాలో నివాసముంటారు. ఈ ఫ్లాట్ నిర్వహణ బాధ్యతను తమకు ఎంతో నమ్మకస్తులైన హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ వాజిద్ మోయినొద్దీన్, ఆసిఫ్ సయీద్‌లకు అప్పగించారు.
అయితే సయ్యద్ వాజిద్ మోయినొద్దీన్, ఆసిఫ్ సయీద్‌లు ఇద్దరూ కలిసి రూ.3 కోట్ల విలువ చేసే ఈ ఫ్లాట్ డాక్యుమెంట్లను నకిలీవి రూపొందించి ఇటీవల వేరొకరికి విక్రయించేశారు. అంతేకాదు, బాధితుడు అబ్దుల్ వాహిద్ భార్యకు రూ.2 కోట్లు ఇచ్చినట్లుగా స్టాంప్ పేపర్లు కూడా పుట్టించారు. యజమాని అబ్దుల్ వాహిద్‌కు ఇటీవలనే తమ ఇంటిని నకిలీ డాక్యుమెంట్లతో విక్రయించినట్లు తెలియడంతో హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారు.
ఇటీవలి వరకు ఈ ఫ్లాట్‌లో లర్నియమ్ స్కూల్ కొనసాగింది. స్కూల్‌ను ఖాళీ చేయించిన తర్వాత ఆ ఇద్దరూ కలిసి నకిలీ డాక్యుమెంట్లతో ఇంటిని విక్రయించారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 468, 471, 420, 120(బి) కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.