మంచి పాలన కోసం ‘టీఎలక్షన్ వాచ్’


‘మంచి మున్సిపల్ కార్పొరేషన్ కావాలంటే మంచి కార్పొరేటర్‌ను ఎన్నుకోవాలి. అంటే ఆ అభ్యర్థికి నేరచరిత్ర ఉండకూడదు.కాంట్రాక్టర్ కాకూడదు. చదువుకున్నవాడై ఉండాలి. నలుగురికీ సేవ చేయాలన్న తపన ఉండాలి. ఇటువంటి అభ్యర్థులను గెలిపించుకునేందుకు సిటీ వాసులు కూడా ఓటింగ్‌కు పోటెత్తాలి. గతంలో నమోదైన 35 శాతం పోలింగ్‌ను 70 శాతం వరకు పెంచాలి. యువత ఇందులో ప్రధాన పాత్ర పోషించాలి..’అని పిలుపునిస్తోంది 20 పౌరసేవా సంస్థలు, 30 మంది సామాజిక కార్యక్రమాలతో ఏర్పాటైన తెలంగాణ ఎలక్షన్ వాచ్.


ఈ కార్యక్రమ ఉద్దేశాలను లక్డీకాపూల్‌లోని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ కన్వీనర్ పద్మనాభ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధి డాక్టర్ రావ్ చెలికాని, అప్పా డెరైక్టర్ శ్రీనివాస్, లెట్స్ వోట్ నిర్వాహకుడు రాఘవేంద్ర మీడియాకు తెలిపారు. తమ సంస్థ ఏ రాజకీయ పార్టీకి, వ్యక్తికి సంబంధించింది కాదని స్పష్టం చేశారు.
నేర చరితులు పాలకులుగా ఎంపిక కాకూడదనే ఉద్దేశంతో హైదరాబాద్, సైబరాబాద్  పోలీసు కమిషనర్‌లకు లేఖలు రాసి నేరగాళ్ల జాబితాను తీసుకుంటున్నామని తెలిపారు. నామినేషన్ సమయాల్లో అభ్యర్థులు సమర్పించే ఆఫిడవిట్లతో వారికి ఏమైనా నేరచరిత్ర ఉందో తెలుసుకుంటామన్నారు. ఒక వేళ నేరచరితులు ఎన్నికల్లో పాల్గొంటే.. ఓటింగ్ కి నాలుగు రోజుల ముందు నుంచి అభ్యర్థుల నేర చరిత్రను జనానికి చెబుతామన్నారు. నో యువర్ క్యాండిడేట్ పేరుతో ఉమ్మడి చర్చా వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాగా.. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రచారం చేయనున్నట్లు వివరించారు. ఎన్నికల ముందు, పోలింగ్ రోజు జరిగే అక్రమాలపై ప్రజలకు సమాచారం ఇచ్చేలా నిఘావేదికను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

కాగా.. కార్పోరేటర్ కావాలంటే రాజకీయ పార్టీలన్నీ మంచివారికే టికెట్ ఇవ్వాలనీ.. స్థానికులకే టికెట్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశామని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ లేఖకు సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top