పోస్టుమార్టం నివేదిక రాకుండానే కేసు మూసేస్తారా? | Dr shashi kumar's wife kanthi to sakshi | Sakshi
Sakshi News home page

పోస్టుమార్టం నివేదిక రాకుండానే కేసు మూసేస్తారా?

Feb 11 2016 2:47 AM | Updated on Sep 3 2017 5:22 PM

పోస్టుమార్టం నివేదిక రాకుండానే కేసు మూసేస్తారా?

పోస్టుమార్టం నివేదిక రాకుండానే కేసు మూసేస్తారా?

ఇరవై ఏళ్ల వైవాహిక జీవితం వారిది. ఒక కుమార్తె. ఒక కుమారుడు. పిల్లలు చాలా చలాకీగా చదువుతున్నారు. వృత్తిపరంగా కాసులకు కొదవలేదు.

♦ నా భర్త సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న వారందరినీ విచారించాలి
♦ ‘సాక్షి’తో కన్నీళ్ల పర్యంతమైన డాక్టర్ శశికుమార్ భార్య కాంతి
 
 సాక్షి, హైదరాబాద్: ఇరవై ఏళ్ల వైవాహిక జీవితం వారిది. ఒక కుమార్తె. ఒక కుమారుడు. పిల్లలు చాలా చలాకీగా చదువుతున్నారు. వృత్తిపరంగా కాసులకు కొదవలేదు. జీవితం సాఫీగా సాగిపోతోంది. ఇంతలోనే ఊహించని పరిణామం. అన్నీ తానై చూసుకుంటున్న అతను చనిపోయాడనే వార్త ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హిమాయత్‌నగర్‌లో డాక్టర్ శశికుమార్ తోటి డాక్టర్ ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరపడం, అదే రాత్రి మొయినాబాద్‌లో తన స్నేహితురాలి ఫామ్‌హౌస్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అసలేమి జరిగిందో తెలియక అంతులేని ఆవేదనలో శశికుమార్ భార్య కాంతి కుంగిపోయారు.

తన భర్త మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కన్నీళ్ల పర్యంతమయ్యారు. తన భర్త మరణంపై ఆమె మనసులో ముసురుకున్న అనుమానాలను ప్రపంచం ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది ‘సాక్షి’. ‘ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అయితే నా భర్తకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మీ ద్వారా నా ప్రశ్నలను అడగాలనుకుంటున్నా’నని ఆమె బాధాతప్త హృదయంతో మాట్లాడారు. హైదరాబాద్ చైతన్యపురి ప్రభాత్‌నగర్‌లోని తమ నివాసంలో ఆమె ‘సాక్షి’ మీడియాతో మాట్లాడారు. పోస్టుమార్టం నివేదిక రాకుండానే పోలీసులు కేసు మూస్తామని చెబుతుండటం బాధిస్తోందన్నారు. ఆయన వెంట తీసుకెళ్లిన కారు, బ్రీఫ్ కేసు జాడ ఇంకా తెలియలేదని చెప్పారు. బ్రీఫ్ కేసులో ఆయన సంతకం చేసిన చెక్‌బుక్ లీఫ్‌లు, ముఖ్యమైన ప్రొఫెషనల్ డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. ఆయన సూసైడ్ నోట్‌లో సాయికుమార్, ఓబుల్‌రెడ్డి, రమణారావు, చెన్నారెడ్డి, కేకే రెడ్డిలను శిక్షించాలని రాసిన దాని గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు.

 మానసిక ఆందోళనకు గురయ్యారు
 లారెల్ హాస్పిటల్స్ విషయంలో రెండు నెలల నుంచి ఉదయ్, సాయికుమార్‌ల వల్ల శశికుమార్ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని, తిండి కూడా సరిగా తినలేదని ఆమె చెప్పారు. ‘సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు వారి వద్ద నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. హిమాయత్‌నగర్‌కి రమ్మని చెప్పారు. అప్పుడు ఆయన మొహంలో ఆందోళన కనిపించింది. ఆయనతో మాట్లాడదామని అనుకునేలోపు వెళ్తున్నా అని బ్రీఫ్ కేసు పట్టుకొని కారులో బయలుదేరి వెళ్లారు.

అయితే సాయంత్రం 5.30 గంటల సమయంలో హిమాయత్‌నగర్‌లో కాల్పులు జరిగాయన్న విషయం తెలిసింది. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకి శశికుమార్ చనిపోయాడన్న విషయం తెలవడంతో అందరం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం’ అని ఆమె పేర్కొన్నారు. మానసికంగా చాలా ఆందోళనకు గురవుతున్న శశికుమార్‌ది ఎదుటివాళ్లను చంపాలనే మనస్తత్వం ఎంతమాత్రం కాదన్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కూడా కాదని కాంతి చెప్పారు. మొయినాబాద్ నక్కలపల్లిలోని ఫాంహౌస్‌కు శశికుమార్‌ను తీసుకెళ్లిందని మీడియాలో వస్తున్న వార్తల్లో కనిపిస్తున్న చంద్రకళ.. తన భర్త స్నేహితురాలిగా మాత్రమే తెలుసన్నారు. ఆత్మరక్షణ కోసమే రివాల్వర్ వెంట పెట్టుకునేవారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement