80 కోట్ల చేప పిల్లల పంపిణీ | Sakshi
Sakshi News home page

80 కోట్ల చేప పిల్లల పంపిణీ

Published Tue, Mar 6 2018 1:35 AM

Distribution of 80 crore fish - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న వానాకాలం సీజన్‌లో 80 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామని పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఆక్వా ఎక్స్‌పో ఇండియా–2018 అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ను హెచ్‌ఐసీసీలో నిర్వహించనుందని తెలిపారు. మత్స్యరంగ అభివృద్ధికి మొదటిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ వేదిక ఇదని వివరించారు.

అంతర్జాతీయంగా అభివృద్ధి పరిచిన సాంకేతిక విధానాలు, కొత్త జాతులు, వాటిని ఉత్పత్తి చేసే విధానాలు, మంచి యంత్ర సామగ్రి, నాణ్యమైన ఉత్పత్తులు, ఉత్తమ మార్కెటింగ్‌ పద్ధతులు, వినియోగదారులకు నాణ్యతపై అవగాహన కల్పించడం తదితర అంశాలపై ఈ ఎగ్జిబిషన్‌ ఉంటుందన్నారు. రాష్ట్రంలో మటన్, చికెన్, చేపల మార్కెట్లు ఒకే దగ్గర ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 40 ఫిష్‌ మార్కెట్లు, ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  

బీజేపీ, కాంగ్రెస్‌లపై కక్ష కాదు...
బీజేపీ, కాంగ్రెస్‌లపై కక్ష కాదని, జాతీయ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరముందనేది సీఎం కేసీఆర్‌ ఆలోచన అని తలసాని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఆలోచనపై దేశవ్యాప్తంగా అనేకమంది రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులు స్పందిస్తుంటే, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం స్పందించడం లేదన్నారు.

ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న భయం కనిపిస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్లో రైతుల కోసం రూ. 2 లక్షల కోట్లు ఎందుకు కేటాయించలేదనేది కేసీఆర్‌ అభిప్రాయమన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అద్భు తాలు చేస్తున్నప్పుడు దేశంలో ఎందుకు చేయలేరనేది కేసీఆర్‌ అభిప్రాయమన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వరాలు కురిపి స్తూ ఇతర రాష్ట్రాలకు కేంద్రం ఏమీ నిధులు కేటాయించడం లేదని తలసాని విమర్శించారు. 

Advertisement
Advertisement