
జై..యువరాజ్!
సదర్ ఉత్సవాల్లో ఈ సారి కూడా హరియాణా ‘యువరాజ్’ (దున్నపోతు) సందడి చేయనుంది.
►సదర్ ఉత్సవాల్లో సందడి చేయనున్న హరియాణా ‘యువరాజ్’
►ప్రత్యేక ఏసీ కంటైనర్‌లో నగరానికి..
►ఈ సారి ధర రూ.11 కోట్లు..
హైదరాబాద్: సదర్ ఉత్సవాల్లో ఈ సారి కూడా హరియాణా ‘యువరాజ్’ (దున్నపోతు) సందడి చేయనుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 22వ తేదీన హర్యాణాలోని కురుక్షేత్ర జిల్లా సునారియో గ్రామం నుంచి బయలుదేరిన యువరాజ్ ఈ సారి తన కొడుకు ‘ధారా’ తో కలిసి వేడుకల్లో పాల్గొంటుంది. 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం నుంచి ఏసీ సదుపాయం ఉన్న ప్రత్యేక కంటెయినర్‌లలో నగరానికి తరలిస్తున్నారు. 10 మంది యువకులు దాంతో పాటు హైదరాబాద్ వస్తున్నారు. రోజుకు 125 కిలోమీటర్ల చొప్పున పయనిస్తూ 29వ తేదీ నాటికి నగరానికి చేరుకొనే విధంగా ప్రణాళికను రూపొందించారు. కంటెయినర్‌లలో దున్నల కోసం ప్రత్యేకంగా రబ్బరుతో మ్యాటింగ్ ఏర్పాటు చేశారు.
గత సంవత్సరం రూ.7 కోట్ల ఖరీదు ఉన్న యువరాజ్ ధర ఈ ఏడాది రూ.11 కోట్లకు చేరినట్లు దాని యజమాని కరమ్‌వీర్‌సింగ్ ‘సాక్షి’తో చెప్పారు. యువరాజ్ , దాని కొడుకు ధారాతో పాటు, వాటికి కావలసిన నాణ్యమైన దాణా, యాపిల్స్, ఎండు ఫలాలతో మరో ప్రత్యేక వాహనం కూడా వస్తోంది. గత సంవత్సరం విశ్రాంతి లేకుండా పయనించడంతో యువరాజ్ జ్వరంతో అలసిపోయినందువల్ల ఈ సారి మరింత జాగ్రత్తగా తగిన విశ్రాంతిని అందజేస్తూ నగరానికి తీసుకొస్తున్నారు.
ఇటీవల న్యూఢిల్లో జరిగిన ప్రదర్శనలో ప్రధాని నరేంద్రమోదీని సైతం అమితంగా ఆకర్షించిన యువరాజ్ నగరంలో ఈ నెల 31వ తేదీన ముషీరాబాద్‌లో, నవంబర్ 1వ తేదీన నారాయణగూడ వేడుకల్లో పాల్గొననుంది. ఇప్పటి వరకు నగరంలో ప్రదర్శించిన దున్నలు అన్నీ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖరీదు చేసేవే. కానీ ఏకంగా రూ.11 కోట్ల ఖరీదైన ముర్రా జాతికి చెందిన యువరాజ్‌ను హైదరాబాద్‌కు తెప్పించేందుకు, ప్రదర్శన నిమిత్తం రూ.20 లక్షల వరకు ఖర్చు చేయవలసి వస్తోందని అఖిల భారత యాదవ సంఘం.ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. 1800 కిలోల బరువు, 14 ఫీట్ల పొడవు, 6 ఫీట్ల ఎత్తు ఉన్న ఈ దున్నకు ప్రతి రోజు గడ్డి, దాణాతో పాటు, పాలు, బాదం, పిస్తా, కాజు, బెల్లం, క్యారెట్, వంటి ఖరీదైన ఆహారం అందజేస్తున్నట్లు చెప్పారు.
ఏటా రూ.కోటికిపైగా ఆదాయం...
హరియాణా ‘యువరాజ్’కు ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మంచి పేరు ఉంది. 2007లో పుట్టిన ఈ దున్న ఇప్పటి వరకు ఎన్నో దూడలకు జన్మనిచ్చింది. దీని వీర్యం కోసం యురోపియన్ దేశాల్లో ఎంతో డిమాండ్ ఉంది. టర్కీ, స్కాట్లండ్, బ్రెజిల్ వంటి దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. నాలుగు రోజులకు ఒక సారి దీని నుంచి వీర్యాన్ని సేకరిస్తారు. అలా సేకరించిన వీర్యాన్ని నైట్రోజన్ సిలిండర్‌లలో భద్రపరిచి ఇంజక్షన్ల రూపంలో విక్రయిస్తారు. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ.400. ఒక్కసారి విడుదలయ్యే వీర్యంపైన రూ. 3 నుంచి రూ.4 లక్షల వరకు లభిస్తుంది. ఇలా ఏటా కొన్ని వందల ఇంజక్షన్లను విక్రయిస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. హర్యానా ‘యువరాజ్’ వీర్యం విక్రయాలపైనే ఏటా రూ.కోటి వరకు ఆదాయం లభించడం గమనార్హం.
బయోడేటా
దున్న పేరు : యువరాజ్
పుట్టిన తేదీ : 16 జనవరి 2007
తల్లిదండ్రులు : గంగ, యోగరాజ్
స్వస్థలం : కురుక్షేత్ర, హరియాణా
యజమాని : కరమ్‌వీర్‌సింగ్
ఆహారం : రోజుకు 15 కిలోల యాపిల్స్, 30 లీటర్ల పాటు, 5 కిలోల క్యారెట్, 5 కిలోల బత్తాయి, కిలో కాజు, కిలో బాదం, 5 కిలోల బెల్లం, స్వచ్ఛమైన దాన, గడ్డి, వివిధ రకాల పప్పుల పొట్టు,మొక్కజొన్న పొట్టు
వ్యాయామం : ప్రతిరోజు 5 కిలోమీటర్ల నడక
అవార్డులు : 12 నేషనల్ చాంపియన్ అవార్డులు, ఒక బెస్ట్ ఎనిమల్ అవార్డు
♦ హైదరాబాద్‌లో దీపావళి తరువాత 12, 13 తేదీల్లో జరుగనున్న సదర్ ఉత్సవాల కోసం ఇక్కడికి తెప్పించారు.
♦ ఇప్పటికే అందంగా ముస్తాబు చేసిన ‘యువరాజ్’కు ప్రతి రోజు డెట్టాల్‌తో శుభ్రంగా స్నానం చేయించడంతో పాటు ఖరీదైన నూనెలతో మాసాజ్ చేస్తున్నారు.