గోదావరి పుష్కరాలు సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్: గోదావరి పుష్కరాలు సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని ఏర్పాట్లు చేసినా తొక్కిసలాట జరిగిందని వాపోయారు. సోమవారం శాసనసభలో తొక్కిసలాట మృతులకు సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు.
ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేసినా తొలి రోజునే ఘటన జరగడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. తొక్కిసలాటలో 28 మంది చనిపోవడం కలచివేసిందన్నారు. ఘటన జరిగిన తర్వాత తాను రాజమండ్రిలోనే ఉండి పరిస్థితులు చక్కదిద్దానని చెప్పుకొచ్చారు. చనిపోయినా వారికి తీసుకురాలేకపోయినా వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీయిచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చామని తెలిపారు.