కేజీ టు పీజీకి గురుకులాలే పునాది! | cm kcr review meeting over gurukul schools in telangana | Sakshi
Sakshi News home page

కేజీ టు పీజీకి గురుకులాలే పునాది!

Oct 30 2016 2:43 AM | Updated on Aug 14 2018 10:54 AM

కేజీ టు పీజీకి గురుకులాలే పునాది! - Sakshi

కేజీ టు పీజీకి గురుకులాలే పునాది!

కేజీ టు పీజీ ఉచిత విద్య విధానానికి గురుకుల విద్య పునాది వంటిదని సీఎం కేసీఆర్ తెలిపారు.

రాష్ట్రంలో గురుకులాల సంఖ్య పెంచుతాం: సీఎం కేసీఆర్‌
వచ్చే ఏడాది 119 బీసీ, 89 మైనారిటీ గురుకులాలు
ఒక్కో విద్యార్థికి రూ.84 వేల ఖర్చుతో విద్య, వసతి, ఆహారం

సాక్షి, హైదరాబాద్‌:
రాబోయే రోజుల్లో గురుకుల విద్యాలయాల సంఖ్యను విరివిగా పెంచుకుంటూ వెళతామని.. కేజీ టు పీజీ ఉచిత విద్య విధానానికి అది పునాది వంటిదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. భావితరానికి మంచి విద్యను అందించడం ద్వారానే పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ లక్ష్య సాధన కోసమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం జనాభా దామాషా ప్రకారం గురుకుల విద్యాలయాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో గురుకుల విద్య విస్తరణపై శనివారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. మంచి విద్య అందించడం ద్వారానే పేదల జీవితాలు బాగుపడతాయని తాను బలంగా నమ్ముతున్నానని ఈ సందర్భంగా కేసీఆర్‌ చెప్పారు.  ఒక్కో విద్యార్థిపై దాదాపు రూ.84 వేల ఖర్చుతో మంచి విద్య, వసతి, ఆహారం అందిస్తున్నామన్నారు. వచ్చే ఏడాదిలో బీసీల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకులాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

కావాల్సినన్ని ఏర్పాటు చేస్తాం..
మైనారిటీ వర్గాలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ ఏడాది 71 మైనారిటీ గురుకుల పాఠశాలలు ప్రారంభించామని తెలిపా రు. వచ్చే విద్యా సంవత్సరం మరో 89 విద్యాలయాలు ప్రారంభిస్తామని కేసీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ సహా ఇతర ప్రాంతాల్లో మైనారిటీల జనాభా, స్థలాల అందుబాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మరిన్ని గురుకులాలు మంజూరు చేయడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు. మైనారిటీల జనాభా ఎక్కువగా ఉన్న చోట ఒక బాలికల, ఒక బాలుర గురుకులంతోనే సరిపెట్టకుండా ఎన్ని అవసరమైతే అన్ని స్థాపించాలని అధికారులకు సూచించారు.

2016–17లో 71 మైనారిటీ గురుకులాల ద్వారా 17 వేల మందికి విద్య అందుతున్నదని, దీని కోసం రూ.143.21 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. 160 గురుకులాల ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష మంది విద్యార్థులకు మంచి విద్య అందుతుందని పేర్కొన్నారు. గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం మరో రూ.3 వేల కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, బాబూమోహన్, గణేశ్‌గుప్తా, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement