మళ్లీ స్టే తెచ్చుకున్న బాబు | Chandrababu brought Stay once again | Sakshi
Sakshi News home page

మళ్లీ స్టే తెచ్చుకున్న బాబు

Sep 3 2016 2:32 AM | Updated on Aug 31 2018 8:31 PM

మళ్లీ స్టే తెచ్చుకున్న బాబు - Sakshi

మళ్లీ స్టే తెచ్చుకున్న బాబు

అనుకున్నదే జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మళ్లీ సాధించారు.

‘ఓటుకు కోట్లు’లో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు నిలుపుదల
 
- ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలపై స్టే
- ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపివేత
- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
 
 సాక్షి, హైదరాబాద్: అనుకున్నదే జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మళ్లీ సాధించారు. ఇప్పటికే అనేక కేసుల్లో పై కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు తాజాగా ‘ఓటుకు కోట్లు’ కేసులో సైతం హైకోర్టు నుంచి స్టే సాధించారు. దేశంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ముఖ్యమంత్రి, ఆయన సహచరులు రెడ్‌హ్యాండెడ్‌గా ఆడియో, వీడియో టేపుల్లో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారు. ఆ విషయాలను కోట్లాదిమంది ప్రజలు వీక్షించారు. అయినా ఈ కేసులో సాంకేతిక కారణాలతో దర్యాప్తు నిలుపుదల చేస్తూ చంద్రబాబు స్టే తెచ్చుకోగలగడం విశేషం.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల అమలును హైకోర్టు నిలిపేసింది. అంతేకాక ఫిర్యాదునకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ కూడా నిలుపుదల చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అటు ఏసీబీ, ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డిలను ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేయడంతో పాటు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని విచారించాల్సిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్ సెలవుపై భోపాల్ వెళ్లడంతో దీనిని మరో న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారించారు.

 రామకృష్ణారెడ్డికి అసలు సంబంధమే లేదు...
 ఈ సందర్భంగా చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఫిర్యాదుదారు దాఖలు చేసిన కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ కూడా దాఖలు చేశారని కోర్టుకు నివేదించారు. ఇటువంటి పరిస్థితుల్లో కింది కోర్టు ఫిర్యాదుదారు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ సమయంలో ఆయన ఏదో విషయం చెప్పేందుకు ప్రయత్నించగా న్యాయమూర్తి అడ్డుతగులుతూ అవన్నీ వద్దు.. పాయింట్‌లోకి రండి.. అంటూ స్పష్టం చేశారు. అసలు ఈ కేసుకూ, ఫిర్యాదుదారుకూ ఎటువంటి సంబంధంలేదని, ఈ కేసుకు అతను థర్డ్‌పార్టీ అని లూథ్రా వివరించారు. అంతేకాక అతను పిటిషనర్‌కు రాజకీయ ప్రత్యర్థని, ప్రతిపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యే అని తెలిపారు. ఈ సమయంలో న్యా యమూర్తి స్పందిస్తూ, అతను ఫిర్యాదు దాఖలు చేయ డం సక్రమమే.. కాని మేజిస్ట్రేటే సరైన ఉత్తర్వులు ఇవ్వలేదంటారు.. అంతేనా? అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.

 అటువంటి మెమో ఎలా దాఖలు చేస్తారు?
 దీనిపై మీరేమంటారని ఏసీబీ తరఫు న్యాయవాది వి.రవికిరణ్‌రావును ప్రశ్నించారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చిన తరువాత ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మెమోను పరిశీలించబోతుండగా మళ్లీ న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వాటిని చూడాల్సిన అవసరం లేదని.. విషయం చెప్పండన్నారు. కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదని, దర్యాప్తు కొనసాగుతోందని అందులో పేర్కొన్నామని రవికిరణ్‌రావు తెలిపారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ఇటువంటి మెమో మీరెలా దాఖలు చేస్తారు? కోర్టు మీకు ఆదేశాలు ఇచ్చింది. వాటిని మీరు అమలు చేయాలి. అంతే తప్ప అందుకు విరుద్ధంగా మెమో ఎలా దాఖలు చేస్తారు? ఇలా దాఖలు చేయవచ్చని ఏ చట్టం చెబుతోంది? తప్పో ఒప్పో మేజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. వాటిని మీరు అమలు చేయాల్సిందే. చేయబోమని ఎలా చెబుతారు? మెమో దాఖలు ద్వారా కోర్టు నుంచి మరో ఉత్తర్వులు ఆహ్వానిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

 రామకృష్ణారెడ్డికి అర్హత ఉంది...
 ఈ ఫిర్యాదు దాఖలు చేసే అర్హత ఫిర్యాదుదారుకు ఎక్కడ ఉందని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బదులిస్తూ, ప్రైవేటు వ్యక్తికి జోక్యం చేసుకునే అర్హత ఉందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందన్నారు. ప్రత్యేక కోర్టు ఆదేశాలపై ఈ దశలో పిటిషన్ దాఖలు చేసే అర్హత చంద్రబాబుకే లేదని వివరించారు. ఇందుకు సంబంధించి ఆయన సుప్రీంకోర్టు తీర్పులు కొన్నింటిని ఉదహరించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ‘అవన్నీ వద్దు.. మీరు ఓ తీర్పు చూపితే వాళ్లు వంద తీర్పులు చూపిస్తారు. నేరుగా పాయింట్‌లోకి రండి’ అన్నారు. ఇటువంటి పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని, ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నిషేధం విధిస్తోందని సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఇవన్నీ ఎందుకు.. ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదంటారు... అంతే కదా అని న్యాయమూర్తి మళ్లీ వ్యాఖ్యానించారు.

 పీసీ యాక్ట్ కింద హైకోర్టు జోక్యం చేసుకోరాదు...
 దీంతో సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ, అవినీతికి పాల్పడేలా మిగిలిన నిందితులను ప్రోత్సహించినందుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) సెక్షన్ 12 కింద చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాము సీఆర్‌పీసీ సెక్షన్200 కింద ఫిర్యాదు చేశామన్నారు. సెక్షన్ 156(3) కింద ఫిర్యాదు దాఖలు చేయలేదన్నారు. పీసీ యాక్ట్ కింద చర్యలు కోరి, దర్యాప్తునకు సంబంధిత కోర్టు ఆదేశించిన సందర్భాల్లో మిగిలిన ఏ కోర్టులు కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ పీసీ యాక్ట్ సెక్షన్ 19(3) నిషేధం విధిస్తోందన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన మళ్లీ కొన్ని తీర్పుల గురించి ప్రస్తావించారు. తీర్పుల సంగతి ఎందుకు.. అవినీతి నిరోధక చట్టం కింద ఈ పిటిషన్ దాఖలు చేయకూడదు.. స్టే ఇవ్వకూడదు.. ఇదే కదా మీరు చెప్పాలనుకుంటోంది.. అని న్యాయమూర్తి అడిగారు. మరి నిబంధనలను కింది కోర్టు సరిగా అర్థం చేసుకోకుండా ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా బాధితుడు కోర్టుకు రాకూడదా? దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసిన కేసుల్లో మళ్లీ దర్యాప్తు చేయాలని ఆదేశించవచ్చా? అని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. అవినీతి నిరోధక చట్టం కింద ఫిర్యాదు దాఖలు చేసినప్పుడు అందులో స్టే కోరడానికి వీల్లేదని సుధాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు. అయితే ఈ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి ఉత్తర్వులు ఇవ్వడం ప్రారంభించారు.

 ఈ అంశాలపై లోతుగా విచారణ జరపాల్సి ఉంది...
 ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత ఫిర్యాదుదారుకు ఉందా? సీఆర్‌పీసీ సెక్షన్ 200 కింద ఫిర్యాదు చేసినప్పుడు 156(3) కింద మేజిస్ట్రేట్ దర్యాప్తునకు ఆదేశించవచ్చా? దర్యాప్తు పూర్తైచార్జిషీట్ దాఖలు చేసిన కేసులో మళ్లీ దర్యాప్తు చేయమని మేజిస్ట్రేట్ ఆదేశించవచ్చా? కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు అవసరం లేదంటూ ఏసీబీ మెమో దాఖలు చేయవచ్చా? అన్న అంశాలపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందువల్ల ఏసీబీ కోర్టు ఆదేశాల అమలును స్టే చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా ఫిర్యాదుకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తున్నట్లు కూడా తెలిపారు.  
 
 ప్రధాన కేసులో దర్యాప్తు చేసుకోవచ్చు...
విచారణ వాయిదా వేస్తున్న తరుణంలో ఏసీబీ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు స్పష్టత కోరారు. దీనిని న్యాయమూర్తి స్పందిస్తూ..‘రవికిరణ్ మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ప్రధాన కేసులో మీరు దర్యాప్తు కొనసాగించుకోవచ్చు. ఇవి కేవలం ఎమ్మెల్యే ఫిర్యాదునకు సంబంధించిన కేసులో ఇస్తున్న ఉత్తర్వులు మాత్రమే.’ అని స్పష్టం చేశారు. ఈ సమయంలో సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, ఉత్తర్వుల కాపీని వీలైనంత త్వరగా అందజేసేలా చూడాలని కోరారు. ఎందుకని న్యాయమూర్తి ప్రశ్నించగా, అప్పీల్‌కు వెళతామని సుధాకర్‌రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేస్తారన్న మాట... అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సాయంత్రం కల్లా ఉత్తర్వుల కాపీని ఇవ్వాల్సినంత అత్యవసరం ఏదీ లేదని, కాపీ కోసం సుధాకర్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న న్యాయమూర్తి తరువాత వాటిని తొలగించారు.
 
 నోటికి పని చెప్పిన ఏజీపీ
న్యాయమూర్తి ఉత్తర్వులు ఇవ్వడం పూర్తి చేసిన తర్వాత అందరూ కోర్టు హాలులో నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమౌతున్న సమయంలో ఓ ఏజీపీ (ప్రభుత్వ సహాయ న్యాయవాది) తన నోటికి పని చెప్పారు. చంద్రబాబుపై దర్యాప్తునకు ఆదేశించిన మేజిస్ట్రేట్‌కు దురుద్దేశాలు ఆపాదించేలా వ్యాఖ్యలు చేశారు. అది కూడా కోర్టు హాలులోనే. పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ఉద్దేశించి... చంద్రబాబుపై దర్యాప్తునకు ఆదేశించిన మేజిస్ట్రేట్ మీ బంధువేలే.. ఎవరికి తెలియదు.. అంటూ పొగరుగా వ్యాఖ్యానించారు. దీనిపై సుధాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. దీంతో ఒకసారిగా కోర్టు హాలు, బయట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏజీపీ వ్యాఖ్యలను సుధాకర్‌రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆయనకు ఇవన్నీ సహజమంటూ న్యాయమూర్తి నవ్వుతూ వ్యాఖ్యానించారు.

అప్పటికే కోర్టు హాలు బయట పెద్ద సంఖ్యలో న్యాయవాదులు గుమికూడారు. తరువాత కోర్టు హాలు నుంచి బయటకు వచ్చిన సుధాకర్‌రెడ్డి.. కింది కోర్టు మేజిస్ట్రేట్ ఏ విధంగా తనకు బంధువవుతారో చెప్పాలంటూ ఏజీపీని గట్టిగా నిలదీశారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. దీంతో అక్కడ ఒకింత ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సైతం తీవ్రంగానే స్పందించారు. దీంతో అటు పోలీసులు, ఇటు మిగిలిన న్యాయవాదులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఏజీపీ మాటలను అక్కడున్న న్యాయవాదులందరూ తప్పుపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement