బిల్లు ఆమోదం పొందే వరకు ఉద్యమం | Approved the bill to the movement | Sakshi
Sakshi News home page

బిల్లు ఆమోదం పొందే వరకు ఉద్యమం

Sep 12 2013 12:52 AM | Updated on Jul 29 2019 2:51 PM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం చెప్పారు.

శేరిలింగంపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం చెప్పారు. లింగంపల్లి జేవీఎన్ గార్డెన్‌లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమనేది ఈ ప్రాంత ప్రజల హక్కు. సమైక్యాంధ్ర ఒక భావన మాత్రమే. హైదరాబాద్‌పై గుత్తాధిపత్యం కోల్పోవలసి వస్తుందనే... ఆ ప్రాంత నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తెరమీదకి తెచ్చారు.

రియల్ ఎస్టేట్ పేరుతో ఈ ప్రాంతంలో ఎవరు ఏ మేర లాభపడ్డారో జర్నలిస్టులకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తెలంగాణలోని పబ్లిక్ రంగ సంస్థల్లో సెమీ, అన్‌స్కిల్డ్ ఉద్యోగాల్లో స్థానికులకు 80 శాతం కేటాయించాలి. రామచంద్రాపురం బీహెచ్‌ఇఎల్‌లో ప్రస్తుతం జరిగే నియామకాల్లోనూ స్థానికులకు ప్రాధాన్యతనివ్వాలి’ అని కోదండరాం అన్నారు. ‘రాష్ట్రం విలీనమైన తరువాత... అప్పటి ఒప్పందాలు ఉల్లంఘనకు గురైనందునే నేడు తెలంగాణ ఉద్యమం ఆవిర్భవించింది.

తెలుగు ప్రజలు విడిపోయి కలిసి ఉండే అవకాశానికి సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో దెబ్బతీస్తున్నారు’ అని టీజేఎఫ్ అధ్యక్షులు అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు.తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్... ‘హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పది రోజులు కూడా అంగీకరించే పరిస్థితి లేదు’ అన్నారు. టీజేయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మారుతీసాగర్, రాష్ట్ర నాయకులు క్రాంతి, ఎంవీ రమణ, శైలేష్‌రెడ్డి, పల్లె రవి పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement