breaking news
JBS Garden
-
జేబీఎస్ టు ఎంజీబీఎస్ మెట్రో పరుగులు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ వాసుల కలల మెట్రో రైల్‌ను జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ పచ్చ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జేబీఎస్ వద్ద నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణం చేశారు. సీఎం ప్రయాణించడంతో ఈ మార్గంలోని చిక్కడపల్లి మినహా ఇతర మెట్రో స్టేషన్లలో ఎక్కడా రైలును నిలపకుండా నేరుగా ఎంజీబీఎస్ వరకు నడిపారు. దీంతో 13 నిమిషాల్లోనే జర్నీ పూర్తయ్యింది. సాధారణంగా ఈ మార్గంలో మిగతా ప్రతీ స్టేషన్లో మెట్రో రైల్ నిలిపితే ప్రయాణానికి 16 నిమిషాల సమ యం పడుతుంది. ఎంజీబీఎస్ వద్ద మెట్రో దిగిన సీఎం స్టేషన్ లో ప్రయాణికులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఎల్అండ్టీ, హెచ్ ఎంఆర్ అధికారులు నగర మెట్రో ప్రాజెక్టు విశేషాలను కేసీఆర్‌కు వివరించారు. మెట్రో ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎంపీ రేవంత్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ సీఈఓ ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఎల్అండ్టీ మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి, నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నారు. నేడు ఉదయం 6–30 నుంచి అందుబాటులోకి... జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో శనివారం ఉదయం 6–30 గంటల నుంచి మెట్రో సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నిత్యం ఈ మార్గంలో సుమారు 60 వేల నుంచి లక్ష మంది వరకు జర్నీ చేసే అవకాశాలున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. కాగా, మెట్రో ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకావడంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో జోష్ కనిపించింది. జేబీఎస్ మెట్రో స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న నాయకులు, కార్యకర్తలు బ్యాండ్ మేళాలు, నృత్యాలతో సందడి చేశారు. చిక్కడపల్లి మెట్రో స్టేషన్ వద్ద కొన్ని నిమిషాల పాటు రైల్ నిలపడంతో కేసీఆర్‌ను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరికి సీఎం అభివాదం చేశారు. మెట్రో విస్తరణకు ప్లాన్ సిద్ధం చేయండి... నగరం నలుమూలలా మెట్రో విస్తరణకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మెట్రోలో ప్రయాణిస్తూ ఆయన.. ఎన్వీఎస్ రెడ్డి, ఇతర అధికారులతో మాట్లాడారు. నగరవాసులకు కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణం సాగించేందుకు, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మెట్రో ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. మూడు మార్గాల్లో మెట్రో పూర్తితో ఆ ఫలాలను నగరవాసులు అందిపుచ్చుకున్నారని సీఎం అన్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లు అత్యాధునిక ఎయిర్ పోర్టుల తరహాలో కనిపిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. టెక్నాలజీ, విజన్‌పరంగా ఢిల్లీ మెట్రో కంటే హైదరాబాద్ మెట్రో మరింత అత్యాధునికంగా ఉందన్నారు. మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఆ మార్గంలోని ప్రతి ప్రాంతాల విశిష్టతలను ముఖ్యమంత్రి గుర్తు చేసినట్లు హెచ్ఎమ్ఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్ మెట్రో: కల నిజమాయె..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ స్వప్నం సాకారమైంది.భాగ్యనగర జీవనరేఖ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలిదశ సంపూర్ణమైంది. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన యజ్ఞం నేటితో పూర్తయ్యింది. ఎల్బీనగర్– మియాపూర్ (29 కి.మీ), నాగోల్– రాయదుర్గం(29 కి.మీ), ఇప్పటికే అందుబాటులో ఉండగా.. నేడు జేబీఎస్– ఎంజీబీఎస్ (11 కి.మీ) రూట్ ప్రారంభం కానుండటంతో లక్ష్యం పరిపూర్ణమైంది. నగర మెట్రో ప్రాజెక్టుకు 2008లోనే ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. ఎన్నో బాలారిష్టాలను అధిగమించి 2012లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టినప్పటికీ.. అవి పూర్తయ్యేనాటికి నిర్మాణ వ్యయం రూ.17,132 కోట్లకు చేరుకుంది. తొలుత 2017 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నప్పటికీ.. ఆస్తుల సేకరణ, న్యాయపరమైన చిక్కులు, పనులు చేపట్టేందుకు రైట్ ఆఫ్ వే సమస్యల నేపథ్యంలో ప్రాజెక్టు మూడేళ్లు ఆలస్యమైంది. మెట్రోఅధికారుల అంచనా ప్రకారం మూడు మార్గాల్లో సుమారు 16 లక్షల మంది జర్నీ చేస్తారని ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ప్రయాణికుల మార్క్ 4 లక్షలకు మించలేదు. 2016 నుంచి ఇప్పటివరకు సుమారు 10 కోట్ల మంది మెట్రో రైళ్లలో జర్నీ చేసినట్లు అధికారులుప్రకటించారు. నేర్చుకోవాల్సిన పాఠాలివీ.. టప్రతి స్టేషన్ వద్ద ప్రైవేటు ఆస్తులు కొనుగోలు చేసైనామల్టీలెవల్ పార్కింగ్ సదుపాయం కల్పించాలి. పార్కింగ్ ఫీజు అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలి. టమెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు సులువుగా చేరుకునేందుకు(లాస్ట్‌మైల్ కనెక్టివిటీ) బ్యాటరీ బస్సులు, మినీ బస్సులను నిరంతరం అందుబాటులో ఉంచాలి. వీటిని స్టేషన్ల వద్ద నిలిపేందుకు వీలుగా బస్‌బేలు ఏర్పాటు చేయాలి. టమెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణీకులకు నామమాత్రపు అద్దె ప్రాతిపదికన బైక్‌లు, సైకిల్లు ఇచ్చే ఏర్పాటు చేయాలి. టప్రతి స్టేషన్ వద్ద ఓలా, ఉబర్ క్యాబ్‌లు, ఆటోలను నిలిపేలా చర్యలు తీసుకోవాలి. వారి దోపిడీని నివారించాలి. టప్రతి స్టేషన్‌ను సమీప బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ముఖ్యమైన కార్యాలయాలు, మాల్స్‌లోకి సులువుగా చేరుకునేందుకు వీలుగా ఆకాశమార్గాలు(స్కైవాక్‌లు)ఏర్పాటు చేయాలి. లాభమా..? నష్టమా..? మెట్రో ప్రాజెక్టులో ప్రయాణికుల చార్జీల ద్వారా వచ్చే ఆదాయం కేవలం 45 శాతం మాత్రమే. మిగతా 50 శాతం రెవెన్యూ రియాల్టీ ప్రాజెక్టులే ఆధారమంటే అతిశయోక్తి కాదు. మరో ఐదు శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. మొత్తంగా ప్రభుత్వం నిర్మాణ సంస్థకు వివిధ ప్రాంతాల్లో కేటాయించిన 269 ఎకరాల విలువైన స్థలాల్లో రాబోయే 10–15 ఏళ్లలో రూ.2243 కోట్లతో వివిధ ప్రాంతాల్లో 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్, ఇతర వాణిజ్యస్థలాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అయితే గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఆర్థిక కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. రియాల్టీ, టూరిజం, నిర్మాణరంగం తదితర మఖ్యమైన రంగాల్లో ప్రస్తుతం స్తబ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఆశిస్తున్న మేర 50 శాతం ఆదాయం సమకూరుతుందా..? లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. మెట్రో నిర్మాణ ఒప్పందం కుదిరిన 2011లో 18 చోట్ల మాల్స్ నిర్మించాలని భావించినా ఇప్పటివరకు కేవలం ఐదు ప్రాంతాల్లో మాత్రమే మాల్స్ నిర్మాణం చేపట్టడం గమనార్హం. మెట్రో విశేషాలు ఇవీ.. ♦ కారిడార్ 1 : మియాపూర్ – ఎల్బీనగర్ : 29 కి.మీ, 27 స్టేషన్లు – రెడ్ లైన్ ( ఏ కారిడార్) ♦ కారిడార్ 2 : జేబీఎస్ – ఎంజీబీఎస్ : 11 కి.మీ, 9 స్టేషన్లు – గ్రీన్ లైన్ ( బీ కారిడార్ ) ♦ కారిడార్ 3 : నాగోల్ – రాయదుర్గ్ : 29 కి.మీ, 23 స్టేషన్లు – బ్లూ లైన్ ( సీ కారిడార్ ) ♦ మెట్రో తొలి పిల్లర్ ఏర్పాటు : 2012 ఏప్రిల్ 19 ఉప్పల్ జెన్‌ప్యాక్ట్ ♦ మొత్తం మెట్రో పిల్లర్లు : 2599 ( ఎంజీబీఎస్ చివరి పిల్లర్ ) ♦ రోజూవారి మెట్రో ప్రయాణికులు : సుమారు 4 లక్షలు ♦ మెట్రో మాల్స్ : పంజాగుట్ట , ఎర్రమంజిల్, హైటెక్ సిటీ, రాయదుర్గం, మూసారంబాగ్, ♦ స్కై వాక్ : పంజగుట్ట మెట్రో స్టేషన్ నుంచి సమీపంలోని మెట్రో మాల్ కి నేరుగా చేరుకొనేలా నిర్మాణం ♦ మెట్రో రైళ్లు , స్టేషన్లలో వస్తువులు పోగొట్టుకుంటే కస్టమర్ కేర్ నం: 040–23332555 ♦ అమీర్‌పేట్ , నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం ♦ ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలు: బేగంపేట్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్, స్టేడియం, తార్నాక, మెట్టుగూడ, హబ్సిగూడ మెట్రో స్టేషన్లు నగర మెట్రో ప్రస్థానం సాగిందిలా.. అంచలంచెల అభివృద్ధి తేదీ ♦ హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ప్రారంభం మే 14–2007 ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మైటాస్‌తో నిర్మాణ ఒప్పందం కుదిరింది సెప్టెంబరు 19–2008 ♦ మైటాస్‌తో నిర్మాణ ఒప్పందం రద్దు జూలై 7–2009 ♦ రెండోమారు ఆర్థిక బిడ్లు తెరిచింది జూలై 14–2010 ♦ ఎల్అండ్టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌తో నిర్మాణ ఒప్పందం కుదిరింది సెప్టెంబరు 4–2010 ♦ మెట్రో డిపో నిర్మాణానికి ఉప్పల్‌లో 104 ఎకరాల కేటాయింపు జనవరి–2011 ♦ ఫైనాన్షియల్ క్లోజర్, కామన్ లోన్ అగ్రిమెంట్ కుదిరింది మార్చి–2011 ♦ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాకు సెంట్రల్మెట్రో యాక్ట్ వర్తింపు జనవరి– 2012 ♦ 104 ఎకరాల మియాపూర్ డిపోల్యాండ్నుఎల్టీఎంఆర్హెచ్ఎల్కు కేటాయింపు మార్చి–2012 ♦ మెట్రో గ్రౌండ్ వర్క్స్ ప్రారంభం ఏప్రిల్ 26– 2012 ♦ కియోలిస్ సంస్థకు మెట్రో రైళ్ల నిర్వహణకు కాంట్రాక్టు కేటాయింపు మే 2012 ♦ రాయదుర్గంలో 15 ఎకరాల స్థలం కేటాయింపు ఆగస్టు 2012 ♦ కుత్భుల్లాపూర్ కాస్టింగ్‌యార్డులో 62 ఎకరాల హెచ్ఎంటీ స్థల లీజు సెప్టెంబరు 2012 ♦ బోగీల తయారీకి హ్యూండాయ్ రోటెమ్ కంపెనీతో ఒప్పందం సెప్టెంబరు 2012 ♦ మెట్రో రైలు పనుల ప్రారంభం నవంబరు 25– 2012 ♦ కేంద్ర ప్రభుత్వం నుంచి సర్దుబాటు నిధిరూ.1458 కోట్ల విడుదలకు ఆమోదం మే 2013 ♦ హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల సెప్టెంబర్ 2014 ♦ రైల్వే బోర్డు నుంచి హెచ్ఎంఆర్కుసిగ్నలింగ్ టెలికాం సిస్టంకు అనుమతి జనవరి 20–2015 ♦ వేలీవ్ ఛార్జీలు లేకుండా మెట్రో రైలు ఓవర్‌బ్రిడ్జీల నిర్మాణానికి రైల్వేశాఖ అనుమతి జనవరి 23–2015 ♦ మెట్రో కారిడార్3 స్టేజ్1కు ఆర్డీఎస్ఓ సంస్థ నుంచి స్పీడ్ సర్టిఫికెట్ మే 8– 2015 ♦ నాగోల్ మెట్టుగూడ(8కి.మీ)కు సీఎం ఆర్ఎస్ ధ్రువీకరణ జారీ ఏప్రిల్ 20– 2016 ♦ మెట్రోకు ప్రత్యేక విద్యుత్ టారిఫ్‌ను వర్తింపజేస్తూ ప్రభుత్వ నిర్ణయం ఏప్రిల్ 27– 2016 ♦ ఆర్డీఎస్ఓ నుంచి 80 కి.మీ వేగంతోమెట్రో రైళ్లు దూసుకెళ్లేందుకు అనుమతి జూన్ 17–2016 ♦ మియాపూర్ ఎస్.ఆర్.నగర్మార్గంలోప్రయాణికుల రాకపోకలకుసీఎంఆర్ఎస్ అనుమతి ఆగస్టు 16–2016 ♦ మెట్రో ప్రాజెక్టును 2018 నవంబరు 30 నాటికి పూర్తికి ప్రభుత్వ ఆదేశాల జారీ ఆగస్టు 16–2016 ♦ హెచ్ఎంఆర్ ప్రాజెక్టుకు భద్రతను మంజూరు చేస్తూ మున్సిపల్ శాఖ ఆదేశాలు ఆగస్టు 22– 2017 ♦ కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నుంచి మెట్టుగూడ–అమీర్‌పేట్ మార్గానికి అనుమతి నవంబర్ 20– 2017 పాతబస్తీపై ఎందుకీ నిర్లక్ష్యం.. మెట్రో పై అసదుద్దీన్ ట్వీట్.. హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో మెట్రో పనులంటే అంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ఫలక్‌నుమా వరకు మెట్రో పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని ట్విటర్ వేదికగా నిలదీశారు. దీనిపై నెటిజన్లు కూడా విమర్శలు కురిపించారు. ముస్లింలు పన్నులు చెల్లించడం లేదా అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. పాతబస్తీ విషయానికి వచ్చే సరికే ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తాయంటూ మరో నెటిజన్ నిలదీశారు. ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు మెట్రో పనులు పూర్తి చేయడానికి మీకు నిధులు ఉంటాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో పనులు ఎప్పుడు మొదలుపెడతారు. ఎప్పుడు పూర్తి చేస్తారు?’ అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. నేడు జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అవుతుందంటూ మెట్రో యాజమాన్యం చేసిన ట్వీట్‌కు బదులిస్తూ అసదుద్దీన్ ఈ ట్వీట్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థను ట్యాగ్ చేశారు. -
బిల్లు ఆమోదం పొందే వరకు ఉద్యమం
శేరిలింగంపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం చెప్పారు. లింగంపల్లి జేవీఎన్ గార్డెన్లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమనేది ఈ ప్రాంత ప్రజల హక్కు. సమైక్యాంధ్ర ఒక భావన మాత్రమే. హైదరాబాద్‌పై గుత్తాధిపత్యం కోల్పోవలసి వస్తుందనే... ఆ ప్రాంత నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తెరమీదకి తెచ్చారు. రియల్ ఎస్టేట్ పేరుతో ఈ ప్రాంతంలో ఎవరు ఏ మేర లాభపడ్డారో జర్నలిస్టులకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తెలంగాణలోని పబ్లిక్ రంగ సంస్థల్లో సెమీ, అన్‌స్కిల్డ్ ఉద్యోగాల్లో స్థానికులకు 80 శాతం కేటాయించాలి. రామచంద్రాపురం బీహెచ్‌ఇఎల్‌లో ప్రస్తుతం జరిగే నియామకాల్లోనూ స్థానికులకు ప్రాధాన్యతనివ్వాలి’ అని కోదండరాం అన్నారు. ‘రాష్ట్రం విలీనమైన తరువాత... అప్పటి ఒప్పందాలు ఉల్లంఘనకు గురైనందునే నేడు తెలంగాణ ఉద్యమం ఆవిర్భవించింది. తెలుగు ప్రజలు విడిపోయి కలిసి ఉండే అవకాశానికి సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో దెబ్బతీస్తున్నారు’ అని టీజేఎఫ్ అధ్యక్షులు అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు.తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్... ‘హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పది రోజులు కూడా అంగీకరించే పరిస్థితి లేదు’ అన్నారు. టీజేయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మారుతీసాగర్, రాష్ట్ర నాయకులు క్రాంతి, ఎంవీ రమణ, శైలేష్‌రెడ్డి, పల్లె రవి పాల్గొన్నారు.