
రిజిస్ట్రేషన్ల శాఖకు 16 చాలు!
జిల్లాల పునర్విభజన నిర్ణయంతో రిజిస్ట్రేషన్లశాఖలో ఏర్పడిన గందరగోళానికి తెరదించేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధమయ్యాయి.
⇒ కొత్త జిల్లాల కూర్పుపై సర్కారుకు ఉద్యోగ సంఘాల ప్రతిపాదన
⇒ ఇక ఒకే జిల్లాగా హైదరాబాద్ ఉత్తర , దక్షిణ రిజిస్ట్రేషన్ జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన నిర్ణయంతో రిజిస్ట్రేషన్లశాఖలో ఏర్పడిన గందరగోళానికి తెరదించేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధమయ్యాయి. పాలనా సౌలభ్యం కోసమని రాష్ట్రంలో 27 జిల్లాలను ఏర్పాటు చేయాలని సర్కారు ప్రతిపాదించగా.. రిజిస్ట్రేషన్లశాఖకు మాత్రం 16 జిల్లాలు చాలని వివిధ ఉద్యోగ సంఘాలు ఏక గ్రీవంగా తీర్మానించాయి. కొత్త జిల్లాల కూర్పుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించే నిమిత్తం ఇన్‌స్పెక్టర్ అండ్ జనరల్ కార్యాలయంలో రెండ్రోజులుగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కసరత్తు చేశారు. ఉద్యోగ సంఘాలు రిజిస్ట్రేషన్ జిల్లాల సంఖ్యను 16కు పరిమితం చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాయి.
తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ల సంఘం, గ్రూప్‌వన్ అధికారుల సంఘం, టీఎన్‌జీవో, టీజీవో సంఘాలు ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ ప్రతిపాదనలను శుక్రవారం రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు, స్పెషల్ సీఎస్‌కు, ఉప ముఖ్యమంత్రి(రెవెన్యూ)కి సమర్పించనున్నారు. జిల్లాకో ఆడిట్ రిజిస్ట్రార్ ఉండాల్సిందే: మార్కెట్ వాల్యూ అండ్ ఆడిట్ విభాగంలో ఉండే జిల్లా రిజిస్ట్రార్ పోస్టులను రద్దు చేయాలని సర్కారు ప్రతిపాదించింది. అయితే.. అధిక ఆదాయ వనరు కలిగిన రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఆడిట్ విభాగం లేకపోతే క్షేత్రస్థాయిలో అవకతవకలను నియంత్రించేందుకు వీలు కాదని ఉద్యోగ సంఘాలంటున్నాయి.
దీంతో ప్రతిపాదిత 16 రిజిస్ట్రేషన్ల జిల్లాలకు ఒక జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు ఒక ఆడిట్ రిజిస్ట్రార్‌ను కూడా నియమించాలని ఆయా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్ జిల్లాలు ఇకపై ఒకే రిజిస్ట్రేషన్ జిల్లాగా మారనున్నాయి. పనిభారం అధికంగా ఉన్నప్పటికీ ఒక రెవెన్యూ జిల్లాకు ఒకే రిజిస్ట్రేషన్ జిల్లా ఉండాలంటున్న సర్కారు ప్రతిపాదనలను గౌరవిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.