యూనివర్సిటీ సిబ్బందికి పీఆర్‌సీ | University staff to PRC | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీ సిబ్బందికి పీఆర్‌సీ

Jul 24 2015 2:26 AM | Updated on Sep 3 2017 6:02 AM

యూనివర్సిటీ సిబ్బందికి పీఆర్‌సీ

యూనివర్సిటీ సిబ్బందికి పీఆర్‌సీ

అన్ని యూనివర్సిటీలు, జేఎన్‌టీయూలోని నాన్ టీచింగ్ సిబ్బంది వేతన సవరణకు సంబంధించిన పీఆర్‌సీ ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ 43 శాతం ఫిట్‌మెంట్ మార్చి నుంచే అమలు
సాక్షి, హైదరాబాద్: అన్ని యూనివర్సిటీలు, జేఎన్‌టీయూలోని నాన్ టీచింగ్ సిబ్బంది వేతన సవరణకు  సంబంధించిన పీఆర్‌సీ ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.  ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే 43 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. పదో పీఆర్‌సీ సిఫారసుల మేరకు కరువు భత్యం(డీఏ), ఇంటి అద్దె అలవెన్సు (హెచ్‌ఆర్‌ఏ), సిటీ కాంపెన్సెటరీ అలవెన్స్(సీసీఏ), ఆటోమెటిక్ అడ్వాన్సుమెంట్ స్కీంలు అమలవుతాయని..

ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన జీవోలు యూనివర్సిటీ సిబ్బందికి వర్తిస్తాయని అందులో స్పష్టం చేసింది. తెలంగాణ ఆర్థిక శాఖ బుధవారం ఈ ఉత్తర్వులు విడుదల చేసింది. అందులో ఉన్న ముఖ్యాంశాలివి.. 2013 జూలై నుంచి ఉన్న మూల వేతనానికి 43 శాతం ఫిట్‌మెంట్, కరువు భత్యం విలీనం చేసి మూల వేతనాన్ని స్థిరీకరిస్తారు. 2013 జూలై నుంచి 2014 జూన్ ఒకటో తేదీ వరకు ఉన్న బకాయిలను నోషనల్‌గా పరిగణిస్తారు. ఈ ఏడాది మార్చి నెల వేతనం నుంచి పెరిగిన జీతాలు  చెల్లిస్తారు. 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి వరకు ఉన్న బకాయిల చెల్లింపులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.

ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో దాటవేసిన  విధంగానే బకాయిలకు తదుపరి ఉత్తర్వులు జారీ అవుతాయని ప్రకటించింది.  2014 జనవరి నుంచి 2014 జూన్ ఒకటి వరకు ఉద్యోగులు పొందిన ఇంటీరియమ్ రిలీఫ్‌ను రికవరీ చేయరు. అప్పటినుంచి ఇప్పటివరకు చెల్లించిన ఇంటీరియమ్ రిలీఫ్ మొత్తాన్ని త్వరలో చెల్లించనున్న బకాయిల్లో నుంచి ప్రభుత్వం తిరిగి రాబట్టుకుంటుంది. వేతన సవరణ చేసుకోకుండా పాత వేతనాలతో కొనసాగే  ఉద్యోగులకు 2015 మార్చి నెల నుంచి ఇంటీరియమ్ రిలీఫ్‌ను నిలిపివేస్తారు. సిబ్బంది వేతన సవరణతో పెరిగే అదనపు భారాన్ని యూనివర్సిటీలు తమ దగ్గరున్న ఆర్థిక వనరులతోనే సర్దుబాటు చేసుకోవాలని.. అదనపు నిధులు ఆశించవద్దని ఈ ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement