ఏఏఈవోల భర్తీపై నీలినీడలు | Replace AAEO On Replacement posts | Sakshi
Sakshi News home page

ఏఏఈవోల భర్తీపై నీలినీడలు

Jul 30 2015 2:33 AM | Updated on Sep 3 2017 6:24 AM

సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఏఈవో) పోస్టుల భర్తీపై నీలినీడలు అలుముకున్నాయి.

సాక్షి, హైదరాబాద్: సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఏఈవో) పోస్టుల భర్తీపై నీలినీడలు అలుముకున్నాయి. ఆదర్శ రైతు వ్యవస్థ స్థానే 4,442 ఏఏఈవోలను నియమించేందుకు ఆరు నెలల కిందటే ప్రక్రియ మొదలుపెట్టిన సర్కారు దీనిపై చేతులెత్తేసింది. ముందుగా 2 వేల పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతించినప్పటికీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 15 వేల పోస్టుల భర్తీల్లో వీటిని చేర్చకపోవడంపై నిరుద్యోగ యువకులు ఆందోళన చెందుతున్నారు. పోస్టుల భర్తీ, సర్వీసు రూల్స్, అర్హత వంటి నిబంధనలను ‘ఏఏఈవో నియామకపు కమిటీ’ ప్రభుత్వానికి పంపింది.

ఏ జిల్లాలో ఎంతమందిని నియమించాలన్న అంశాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కొంది. ఈ పక్రియ పూర్తయి నెలలు దాటినా ప్రభుత్వం వీటి భర్తీపై ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యానవనశాఖ గ్రీన్‌హౌస్, సూక్ష్మసేద్యం వంటి కీలకమైన కార్యక్రమాలు చేపడుతుండడం, ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసిన నేపథ్యంలో తక్షణమే ఏఏఈవోలను నియమించాలనుకున్నారు. సర్వీస్ రూల్స్ ప్రతిపాదించిన తర్వాత గత డిసెంబర్‌లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ సర్కారు మాత్రం ఇప్పటివరకు దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.  ఆదర్శ రైతులు లేక, ఏఏఈవోలు రాక అన్నదాతలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక అవస్థలు పడుతున్నారు.
 
తక్షణమే నింపాలి: నిరుద్యోగ అభ్యర్థులు

ఏఏఈవో పోస్టులను తక్షణమే నింపాలని తెలంగాణ వ్యవసాయ ఉద్యాన డిప్లొమా నిరుద్యోగ అభ్యర్థులు బాలస్వామి, ఎల్లయ్య, కరుణాకర్, కుమారస్వామి, గోపి, మధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు తాము వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధికి బుధవారం విజ్ఞప్తి చేసినట్లు వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement