ఎన్నాళ్లకెన్నాళ్లకో! | Yogi Vemana University new faculty replacement posts | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నాళ్లకో!

Mar 22 2016 5:08 AM | Updated on Sep 3 2017 8:16 PM

ఎన్నాళ్లకెన్నాళ్లకో!

ఎన్నాళ్లకెన్నాళ్లకో!

యోగి వేమన విశ్వవిద్యాలయానికి త్వరలో కొత్త అధ్యాపకులు రానున్నారు.

వైవీయూలో 68 అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం
ప్రతిభకు పట్టం కట్టేలా చర్యలు తీసుకోవాలంటున్న నిరుద్యోగులు


వైవీయూ : యోగి వేమన విశ్వవిద్యాలయానికి త్వరలో కొత్త అధ్యాపకులు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీని చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఇందులో భాగంగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో 3 ప్రొఫెసర్లు, 18 అసోసియేట్ ప్రొఫెసర్లు, 47 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే ఈ నియామకాలను రెండు విడతలుగా చేపట్టనున్న నేపథ్యంలో తొలివిడత నియామక ప్రక్రియ రానున్న మూడు నెలల్లో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్య కార్యాలయంలో వైస్ ఛాన్స్‌లర్, రిజిస్ట్రార్‌లతో ఖాళీల భర్తీ, నియామక ప్రక్రియ విధానంపై సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో నియామక ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియడంతో పాటు పూర్తి స్థాయి మార్గదర్శకాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

బోధనేతర సిబ్బంది భర్తీ లేనట్టేనా?
కడప శివారులో 2006లో విశ్వవిద్యాలయంగా ఏర్పడిన తర్వాత వైఎస్‌ఆర్ హయాంలో నియామక ప్రక్రియ శరవేగంగా సాగింది. ఇతర విశ్వవిద్యాలయాలతో పోల్చితే అధ్యాపక పోస్టులును బాగానే భర్తీ చేయగలిగారు. విశ్వవిద్యాలయానికి 33 ప్రొఫెసర్, 61 అసోసియేట్ ప్రొఫెసర్ , 109 అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు అవసరమని అప్పట్లో గుర్తించారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయం, వైఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 14 మంది ఆచార్యులు, 12 మంది అసోసియేట్, 89 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పని చేస్తున్నారు. వాస్తవానికి ఇంకా చాలా విభాగాల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నా విద్యార్థుల నిష్పత్తి, లభ్యత తదితర అంశాల ఆధారంగా పూర్తి స్థాయిలో కాకుండా పాక్షికంగానే నియామక ప్రక్రియ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా 2012లో పలు విభాగాల్లో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ పలువురు కోర్టును ఆశ్రయించడంతో అచార్యుల పోస్టులు మినహా మిగిలినివి నిలిచిపోయాయి. విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ సిబ్బందిది కీలకపాత్రే. వైవీయూలో నాన్ టీచింగ్ విభాగంలో 22 మంది మాత్రమే రెగ్యులర్ సిబ్బంది పని చేస్తున్నారు. 143 మంది టైంస్కేల్ కింద, 60 మంది అవుట్ సోర్సింగ్ విభాగం, మరో 51 మంది డైలీవేజస్ కింద పనిచేస్తున్నారు. నాన్ టీచింగ్ విభాగంలో 79 ఖాళీల భర్తీ గురించి పట్టించుకోలేదు.

 ప్రతిభకు పట్టం కట్టేరా..?
విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల్లో తమవారిని నియమించుకునేందుకు అధికారంలో ఉన్న నాయకులు ప్రయత్నించడం పరిపాటి. ఇందులో భాగంగానే ఇటీవల రాష్ర్టంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వీటిలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, సానుభూతి పరులకు చోటు కల్పించింది. దీంతో నియామక ప్రక్రియ సజావుగా సాగుతుందా.. లేక సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తారా అన్న అనుమానం అందరిలో తలెత్తుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement