ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కోర్ మాస్టర్ ప్లాన్ ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వానికి అందనుంది.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కోర్ మాస్టర్ ప్లాన్ ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వానికి అందనుంది. సింగపూర్ వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్ ఈ మేరకు ప్లాన్ తీసుకుని హైదరాబాద్ రానున్నారు. అదే రోజు ఈశ్వరన్ 13 సీట్లున్న ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరి వెళతారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈశ్వరన్ రాజమండ్రికి చేరుకుని పుష్కరాల్లో పాల్గొని మాస్టర్ ప్లాన్‌ను సీఎం చంద్రబాబుకు అందించనున్నారు.
సీఎం, ఈశ్వరన్‌లు అక్కడే కోర్ సిటీ కేపిటల్ ప్లాన్‌పై చర్చించనున్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వం మూడు దశల్లో మాస్టర్ ప్లాన్‌లు రూపొందించింది. మార్చి 30న సీఆర్‌డీఏ పరిధిలో మాస్టర్ ప్లాన్ అందించింది. సీఆర్‌డీఏలో కొంత ప్రాంతాన్ని సెంట్రల్ ప్లానింగ్ ఏరియా (సీపీఏ)గా గుర్తిస్తూ రెండో దశ ప్రణాళికను మే 25న అందించిన సింగపూర్ ప్రభుత్వం చివరి ప్రణాళిక ఈ నెల 20న అందించనుంది.
రాజధానిలో రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిర్మాణాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయాలు ఈ మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచినట్లు సమాచారం. సీడ్ కేపిటల్ ఏరియా 217 చ.కిమీలు అంటే 53,612 ఎకరాల్లో ప్రధాన రాజధాని ప్రాంతం విస్తరించేలా సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది.
సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ అందిన తర్వాత ఏపీ ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయనుంది. 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్‌పై చర్చించనున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీలు పాల్గొంటాయని ఇదివరకే ఈశ్వరన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.