రాష్ట్ర స్థాయిలోనే డీఎస్‌కు అవకాశం! | cm kcr meets senior leader d srinivas, discusses several issues | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయిలోనే డీఎస్‌కు అవకాశం!

Jul 23 2015 12:22 AM | Updated on Aug 11 2018 7:06 PM

రాష్ట్ర స్థాయిలోనే డీఎస్‌కు అవకాశం! - Sakshi

రాష్ట్ర స్థాయిలోనే డీఎస్‌కు అవకాశం!

టీఆర్‌ఎస్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు.

డీఎస్ ఇంటికి కేసీఆర్
* అర గంటకు పైగా భేటీ
* తాజా రాజకీయాలపై చర్చలు
* పుష్కరాల తర్వాత డీఎస్ భవితవ్యంపై నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. బుధవారం సీఎం, డీఎస్ ఇంటికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన డీఎస్ ఈనెల 8న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.

ఆయన చేరిక సమయంలోనే త్వరలో డీఎస్ ఇంటికి స్వయంగా వెళ్లి అన్ని విషయాలు చర్చిస్తానని సీఎం ప్రకటించారు. దీనిలో భాగంగా ఆయన బుధవారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని వెంటబెట్టుకుని డీఎస్ నివాసానికి మధ్యాహ్న భోజనానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య తాజా రాజకీయ పరిస్థితులతో పాటు వివిధ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. డీఎస్ అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించుకుంటామని, ఆయనను గౌరవించుకుంటామని కూడా డీఎస్ చేరిక సమయంలో సీఎం పేర్కొన్నారు.

ఈ ప్రకటనల నేపథ్యంలోనే డీఎస్‌ను రాజ్యసభకు పంపించి జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే, తాజా భేటీలో మాత్రం డీఎస్ రాష్ట్ర రాజకీయాలపైనే ఆసక్తి కనబరిచారని తెలిసింది. దీంతో ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని, అది వీలుకాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవిలో నియమించే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉండడంతో ఆయనకు రెవెన్యూ వంటి ముఖ్యమైన శాఖతో కేబినెట్‌లో చోటిస్తారని అనుకుంటున్నారు.

కాగా, పదవుల విషయం సీఎం, డీఎస్ భేటీలో ప్రస్తావనకు రాకున్నా, వీరిద్దరి మధ్య సంభాషణ అదే కోణంలో జరిగినట్లు సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల కోటా మండలి ఎన్నికల్లో డీఎస్‌కు అవకాశం కల్పించి మంత్రి వర్గంలో చోటుతోపాటు మండలిలో పార్టీ నేతగా ప్రకటించవచ్చన్న మాటకూడా వినవస్తోంది.

ఇదిలా ఉంటే అర్ధగంటకు పైగా సీఎం, డీఎస్, ఇతర నేతలు కలిసే ఉన్నారని, ఇద్దరు నేతలు ఏకాంతంగా ఏం మాట్లాడుకోలేదని, ఇతర నేతలు ఉండగానే కలసి భోజనం చే స్తూ వివిధ రాజకీయ అంశాలపై చర్చించుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో గోదావరి పుష్కరాల హడావుడి ముగిశాక, డీఎస్ భవితవ్యంపై ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు అనుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement