బనిజేరుపల్లి అవ్వ జెప్పిన మాట

Solipeta Ramalinga Reddy Article On Telangana Elections - Sakshi

సందర్భం  

ఎన్నికల సమరం... ఊరు వాడల్లో  కార్యకర్తల కప్పదాట్లు,  చేరికలు ఊపందుకున్నాయి. ఇలాంటి సమయంలో  వ్యాసం రాసే తీరిక ఎక్కడా? మూడు, నాలుగు గంటల పాటు నిలకడగా మనసుపెట్టి రాసే సమయం ఉందా?  అదే కాలాన్ని  ఓటర్ల  కోసం ఖర్చు చేస్తే నాలుగు ఓట్లు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనలు చుట్టుముట్టాయి. మనుసు మాత్రం నువ్వు జర్నలిస్టువు కూడా అనే విషయం మర్చిపోతున్నావు అని గుర్తు చేస్తోంది. ఈ మానసిక సంఘర్షణతోనే బనిజేరుపల్లి వెళ్లాను. ఇది నా నియోజకరవర్గంలోని ఓ చిన్న పల్లెటూరు. మల్లన్న సాగర్‌  ముంపు గ్రామం. ఈ ముంపు ఊళ్లను బూచిగా చూపించే ప్రతిపక్షం  ఓట్ల సాగు చేయాలనుకుంటోంది.

ఊరు ముంగిట ఇంటి  అరుగుల మీద 70 ఏళ్ల అవ్వ కూర్చొని ఉంది. మాట కలిపాను. ‘ఓటు  ఎవరికేస్తావు అవ్వా’ అని అడిగాను. ‘కారుకు’ వేస్తా అంది. ‘ఊరును నీళ్లల్ల ముంచినందుకా?’ అని వ్యంగ్యంగా అడిగాను. ‘ఎవరయ్య నువ్వు?’ అని గద్దింపు స్వరంతోనే ఎదురు ప్రశ్నించింది.‘ పింఛిని రూపాయలు ఇంటికి వస్తున్నయి. నా పింఛిని కాయితం పోయి ఎమ్మోరా (తహశీల్దారు) ఆఫీసు కాడ గోడు గోడున ఏడుస్తుంటే  రామలింగన్న జూసి  ఏడ్వకు అవ్వ నేను ఇప్పిస్త అని నా భుజాల మీద చెయ్యేసి తీసుకొని పోయి కాయితం ఇప్పిచ్చిండు. గెలిస్తే కేసీఆర్‌ రూ. 2016 ఇస్తానంటోండు’ అని చెప్పింది. 

తెలంగాణ ఆకాంక్షతో యువత నెత్తుర్లు చింది స్తున్న వేళ  అధికార పక్షంగా కాంగ్రెస్‌ తెలంగాణ నినాదాన్నే అవహేళన చేసింది. కేసీఆర్‌ వీరోచిత ఉద్యమంతో గత్యంతరం లేక తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండి మళ్లీ అవే తప్పులు చెస్తోంది. విలువలను, సిద్దాంతాలను, ఆదర్శాలను పక్కపెట్టి టీడీపీతో జత కట్టటం కాంగ్రెస్‌కి ఆత్మహత్యా సదృశమే.   

అభివృద్ధికి ఆటంకం ఉండొద్దని, కేసీఆర్‌ పాలనకు రెఫరెండం కావాలని ప్రజా తీర్పునకు వెళ్లాలని నిర్ణయించారు. దీన్ని చంద్రబాబు అవకాశంగా తీసుకోవాలనుకున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ ఆయన. ఇందులో చంద్రబాబు, ఆయన తొత్తు రేవంత్‌రెడ్డి ఈ రోజు కాకపోతే రేపైనా జైలుకు పోవటం ఖాయం. దీని నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ఆ కేసు ఫైళ్లను మాయం చేసేందుకు, కుదరకపోతే తారుమారు చేసేందుకు శత విధాల ప్రయత్నిం చాడు. బాబు ప్రతి ఎత్తును కేసీఆర్‌ చిత్తు చేశారు. ఇక చివరి అస్త్రంగా తెలంగాణలో అధికారిక ప్రవేశానికి ఒక సాకు.. ఒక అవకాశం వెదుకుతున్నాడు. ఆయన లక్ష్యం ఒక్కటే. తెలంగాణ నాయకత్వాన్ని ధ్వంసం చేసి, దొంగతనంగా ఫైళ్లను ఎత్తుకుపోవాలే. ప్రాజెక్టులకు అడ్డంపడి  పంటలు ఎండబెట్టాలే. కానీ ఇక్కడ తెలుగుదేశం కూకటి వేళ్లతో పెకిలించుకుపోయింది. ఈ నేపధ్యంలోనే ఆయన దృష్టి అంపశయ్య మీదున్న దివాళాకోరు కాంగ్రెస్‌ మీద పడింది. మహా కూటమి పేరుతో దాన్ని ఉచ్చులోకి లాగాడు. కోట్లాది రూపాయల డబ్బు, మూడు హెలీకాప్టర్లు పంపుతానని కాంగ్రెస్‌ ఢిల్లీ అధిష్టానానికి ఆశ చూపెట్టి ముగ్గులోకి దిం చాడు. ‘బాలనాగమ్మ’ నాటకంలో మాయల ఫకీర్‌ బాలనాగమ్మను కుక్కను చేసి ఆడించినట్టుగా చంద్రబాబు కాంగ్రెస్‌ని ఆడిస్తున్నాడు.  

అసెంబ్లీ రద్దుకు ముందే ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల అమలు తీరుపై సమగ్రమైన పరిశోధన జరిగింది. దాని ఫలితాలను వడబోసి తీసిన సారంనుంచే కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ మినీ మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఇప్పుడు ఇస్తున్న పంట పెట్టుబడి సాయం  రూ 8 వేల నుంచి ఏకంగా  రూ 10 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఆసరా పింఛన్లను రెట్టింపు 1.000 నుంచి రూ.2016కు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లు రూ.1500 నుంచి రూ.3016కు పెంచుతామని చెప్పారు. 2021 నాటికి కోటి ఎకరాల మాగాణం ఖాయమని, ఈ క్రమంలో అన్ని అడ్డంకులు అధిగమించి, ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని ప్రతినబూనారు. 
టీఆర్‌ఎస్‌ మినీ మ్యానిఫెస్టో మీద పుంఖానుపుంఖాలుగా చర్చలు జరిగాయి... జరుగుతున్నాయి.  వితండవాదాలు, విషపు ప్రచారాలను జనం విన్నారు.  నిజానిజాలు అర్థం చేసుకున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఈనెగాసి నక్కలపాలు చేయకుండా తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారో అవ్వ జెప్పిన మాటలను బట్టి తెలుస్తోంది.


సోలిపేట రామలింగారెడ్డి
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక  తాజా మాజీ ఎమ్మెల్యే 94403 80141

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top