ఇప్పుడు వీస్తున్న సైన్స్‌ గాలి

Narisetti Innaiah Says About Scientists - Sakshi

సందర్భం

జీవితమంతా పరిశోధనల్లో గడిపిన సైంటిస్టులు శాస్త్ర జ్ఞానాన్ని సామాన్యులకు అర్థం చేయించేందుకు ప్రజలముందుకు రావడం విశేషం. రిచర్డ్‌ డాకిన్స్, నీల్‌ డి గ్రాస్, మైకల్‌ షెర్మర్‌ ఈ విషయంలో ఆదర్శనీయులు. 

ఇటీవల సైంటిస్టులు గణనీయమైన ప్రజాసేవ చేస్తున్నారు. జటిలమైన వైజ్ఞానిక పరిశోధనా ఫలితాలు పల్లెటూరి రైతులకు సైతం అర్థమయ్యేటట్టు వివరిస్తున్నారు. పరిశోధనాలయాల్లో జీవితమంతా గడిపిన సైంటిస్టులు ఇలా ప్రజల మధ్యకు రావడం చెప్పుకోదగిన అంశం. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియాలో ఈ వినూత్న మార్పు అనుసరించదగింది. ఇందులో ముఖ్యాంశాలు చూద్దాం. రిచర్డ్‌ డాకిన్స్, నీల్‌ డి గ్రాస్, మైకల్‌ షెర్మర్‌ లను ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవచ్చు. కేవలం పుస్తకాలు రాయడం కాక, కేసెట్లు తయారు చేసి వెబ్‌సైట్‌లో పెట్టి, యూట్యూబ్‌ల ద్వారా విజ్ఞానాన్ని వెదజల్లుతున్నారు. అది ప్రజాకర్షణగా మారింది.

రిచర్డ్‌ డాకిన్స్‌ పరిణామ సిద్ధాంతాన్ని పెద్దలతోపాటు పిల్లల దగ్గరకూ తెచ్చారు. ది మ్యాజిక్‌ ఆఫ్‌ రియాలిటీ రాసి, బొమ్మలతో సహా పరిణామ క్రమాన్ని, విశ్వరహస్యాలను తేటతెల్లం చేశారు. విశ్వాన్ని, సృష్టిని వివరించడానికి పూర్వకాలం నుంచీ ప్రయత్నాలు జరి గాయి. వాటినే ఇప్పుడు డాకిన్స్‌ వైజ్ఞానిక వివరణతో ప్రజల మధ్యకు వచ్చారు. మాజిక్‌ ఆఫ్‌ రియాలిటీ అనే గ్రంథం చక్కని బొమ్మలతో ప్రచురించారు. డేవ్‌ మెకీన్‌ వీటికి అనుగుణంగా బొమ్మలు సమకూర్చారు. హైస్కూలు పిల్లలకు అరటిపండు ఒలిచిపెట్టినట్లుంది ఈ వివరణ. లోగడ మన పూర్వీకులు కథలుగా రాసి, నమ్మి, ఆచరించిన వాటికే ఇప్పుడు ఆధారాలతో అర్థమయ్యేట్టు చూపారు. అదీ విజ్ఞాన సేవ. 

పరిణామ సిద్ధాంత నిపుణుడుగా పేరొందిన రిచర్డ్‌ డాకిన్స్‌ రచనలన్నీ మనలోని అజ్ఞానాన్ని తొలగించి, వివరణ ఇస్తాయి. పరిణామం అంటే కోతి నుంచి మనిషి ప్రసవించడం కాదని క్రమక్రమంగా అన్ని జీవుల్లో జరిగే మార్పు అని సోదాహరణంగా చూపారు. హైస్కూలు స్థాయి పిల్లలు ఇవి చదివితే అసలు విషయాలు తెలిసి పరిణామ క్రమం తేటతెల్లమవుతుంది. అవి సిలబస్‌లో ప్రవేశపెడితే ఇంకా బాగుంటుంది. 
మరొక ఖగోళ శాస్త్రజ్ఞుడు నీల్‌ డి గ్రాస్‌ ప్రస్తుతం హైడెన్‌ పరిశోధనాలయం డైరెక్టర్‌గా ఉంటూ, విశ్వ రహస్యాలకు శాస్త్రీయ ఆధారాలతో జనం ముందుకు వచ్చారు. అనేక సభలు పెట్టి ప్రసంగాలు చేస్తున్నారు. వీడియోలు, ఆడియోలు, సౌండ్‌ ట్రాక్‌లు బయటపెట్టారు. 

విశ్వం గురించి మనకున్న భ్రమలు తొలగించి, విజ్ఞానం ఏం చెబుతున్నదో వివరిస్తున్నారు. హాస్య పూరితమైన ఆయన ప్రసంగాలు వింటే విశ్వరహస్యాలు సులభంగా ఆకళింపు అవుతాయి. లోగడ కార్ల్‌ శాగన్‌ విశ్వం గురించి పరిశోధించి ప్రజలకు చెప్పిన అంశాలనే ప్రస్తుతం నీల్‌ డి గ్రాస్‌ కొనసాగిస్తున్నారు. మాకు తీరిక లేదు అనేవాళ్లు గబగబా చదివి అర్థం చేసుకునేటట్టు రాశారు. 
మరొక ప్రముఖ సైంటిస్టు మైకల్‌ షెర్మర్‌ బిలీవింగ్‌ బ్రెయిన్‌ (Believing Brain) అనీ, ‘హెవెన్స్‌ ఆన్‌ ఎర్త్‌’ అనీ రాశారు. సర్వసాధారణంగా నమ్మే ఆత్మ గురించి గొప్ప వివరణ ఇచ్చి, విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతున్నదో తెలియపరిచారు. వీరంతా పుస్తకాలు రాసి, క్యాసెట్లతో ఊరుకోక, ఊరూరూ తిరిగి ప్రచారం చేయడం నిజమైన విజ్ఞాన సేవ. 

ఆత్మ గురించి షెర్మర్‌ ఇంతగా పరిశీలించి శాస్త్రీయంగా కనువిప్పు కలిగించడం గొప్ప విషయం. ఇవన్నీ మతాలను తిట్టడానికో, మూఢనమ్మకాలను ఖండించడానికో కాదు. జనంలో ఉండే బహుళ ప్రచా రం పొందినవాటిని వైజ్ఞానికంగా విప్పిచెప్పడం వలన చదువుకున్న నమ్మకస్తులకు సైతం కనువిప్పు అవుతుంది. మనలో చాలామంది ఒక్కొక్క రంగంలో ప్రజ్ఞావంతులు కావచ్చు. మిగిలిన శాస్త్ర విభాగాలలో ఏం జరుగుతున్నదో తెలియక మూఢనమ్మకాలకు మొగ్గుతుంటారు. ఆ లోపాన్ని ఈ శాస్త్రజ్ఞులు తొలగించారు. వైజ్ఞానిక రంగంలో ఒక పరిధిలో నిపుణుడు కావడానికే ఎంతో కాలం పడుతుంది. అన్ని రంగాలూ తెలియడం చాలా దుర్లభం. ఆ లోపం పూరించడానికే ఫిలాసఫీ ఆఫ్‌ సైన్స్‌ కావాలి అన్నాడు ఎం.ఎన్‌. రాయ్‌ (మానవేంద్రనాథ్‌ రాయ్‌). ఇప్పుడు ఈ శాస్త్రజ్ఞులు సరిగ్గా అలాంటి కృషే చేస్తున్నారు. 

భారతదేశంలో ఇలాంటి కృషి చాలా అవసరం. శాస్త్రజ్ఞులు పి.ఎం. భార్గవ వలే తమకు తెలిసిన విజ్ఞానాన్ని సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. దాన్ని తప్పకుండా సిలబస్‌లోకి తీసుకురావాలి. లోగడ ఐజాక్‌ అసిమోవ్, కార్ల్‌ శాగన్, రేనీ డ్యూబా, పాల్‌ కర్జ్, ఎం.ఎన్‌. రాయ్‌ చేసిన కృషి నిజమైన ప్రజాసేవ. కేవలం ఖండన మండనలు గాక, విషయాన్ని పోల్చి చెప్పాలి. ఉదాహరణకు జ్యోతి ష్యాన్ని ఖండించే బదులు, పక్కపక్కనే ఖగోళ శాస్త్రం రుజువులతో ఏమి చెబుతున్నదీ పట్టికవేసి చూపవచ్చు. అలాంటి పని వాస్తుకూ అన్వయించి, భవన నిర్మాణ శాస్త్రంతో పోల్చి చెప్పవచ్చు. విషయం తేటతెల్లమవుతుంది. 
మొత్తం మీద విజ్ఞానాన్ని రుజువులతో కూడిన పరిశోధనలను సామాన్యులకు అందించడం శాస్త్రవేత్తల కర్తవ్యం.

- నరిశెట్టి ఇన్నయ్య
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : innaaiah@gmail.com

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top