ఆకాంక్షల జెండా అస్మా

Mallepally Laxmaiah tribute to pakistani rights activist Asma Jahangir - Sakshi

కొత్త కోణం

అస్మా పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఎన్నో నివేదికలను రూపొందించారు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధిగా ఆమె ఇరాన్, భారతదేశం లాంటి చోట్ల జరుగుతున్న మత అసహనాన్ని నిగ్గదీశారు.

‘‘అనుభవాల నుంచి మనమెప్పుడూ సరైన పాఠాలు నేర్చుకోం. సమస్యల మూలాలను తెలుసుకోం. మనం మతాలని రాజకీయం చేయాలని చూస్తే, అది సృష్టించే మంటల్లో పడి మాడి మసైపోతాం!’’ మహా మేధావి, పాకిస్తాన్‌ మానవ హక్కుల నాయకురాలు అస్మా జహంగీర్‌ ప్రపంచానికి చేసిన హెచ్చరిక ఇది. అస్మా జహంగీర్‌ పాకిస్తాన్‌లో పుట్టి పెరిగారు. ప్రపంచంలో మృగ్యమవుతున్న మానవహక్కుల కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి, జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప యోధురాలు. మానవహక్కులే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా బతి కిన అస్మా ఇటీవల లాహోర్‌లో గుండెపోటుతో మరణించారు.

అస్మా జహంగీర్‌ పేరు వినగానే హక్కుల పతాక రెపరెపలు స్ఫురణలోకి వస్తాయి. అస్మా చేసిన కృషిని గుర్తించి ఎన్నో అవార్డులు ఆమె తలుపు తట్టాయి. రామన్‌ మెగసెసె అవార్డు, నోబెల్‌ బహుమతికి ప్రత్యామ్నాయమైన ‘లైవ్లీ హుడ్‌ అవారు’్డ కూడా దక్కాయి. అవార్డుల కన్నా మిన్నగా అస్మా దృఢ దీక్ష కారణంగా పాక్‌ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షల జెండా గగనతలంపై రెపరెపలాడడమే కాదు, ప్రపంచ హక్కుల కరదీపికైంది.

అస్మా జహంగీర్‌ పూర్తిపేరు అస్మా జిలానీ జహంగీర్‌. 1952, జనవరి 27న లాహోర్‌లో జన్మించారు. తండ్రి మాలిక్‌ గులాం జిలానీ ప్రభుత్వోద్యోగిగా పనిచేసి, పదవీ విరమణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. పార్లమెంటు సభ్యునిగా కొనసాగిన జిలానీ 1972లో జుల్ఫీకర్‌ విధించిన మిలిటరీ పాలనను వ్యతిరేకించారు. అందుకు గులాం జిలానీని నాటి ప్రభుత్వం నిర్బంధించి కారాగారానికి పంపించింది. మానవహక్కుల పట్ల అస్మాలో కనిపించే అలాంటి దృఢ సంకల్పానికి తండ్రి జిలానీ చూపిన మార్గమే స్ఫూర్తిగా నిలిచింది. ఆమె మొదటి పోరాటం తండ్రి నిర్బంధాన్ని సవాల్‌ చేయడంతోనే ఆరంభమైంది.
 
అస్మా లాహోర్‌లోని కిన్నెర్డ్‌ కళాశాల నుంచి డిగ్రీనీ, పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి 1978లో ఎల్‌ఎల్‌బి పట్టానూ పొందారు. న్యాయవాద వృత్తిని ప్రారంభించిన ఒక సంవత్సరానికే 1983లో ప్రజాస్వామ్య ఉద్యమంలో క్రియాశీలకమైన కార్యకర్తగా అవతరించి, కీలక పాత్రను నిర్వహించారు. అప్పటి జియా ఉల్‌ హక్‌ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి, కారాగారానికి పంపిం చింది. తరువాత అస్మా 1986లో జెనీవాలోని అంతర్జాతీయ బాలల రక్షణ విభాగానికి వైస్‌ చైర్‌పర్సన్‌గా నియమితుల య్యారు. 1988లో మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చారు. జెనీవాలో ఉన్న సమయంలోనే 1987లో పాకిస్తాన్‌ ప్రభుత్వం మానవహక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి అస్మా తన హక్కుల పోరాటానికి విరామం ఇవ్వలేదు.
 
ఆమె పోరాటం అనేక అంశాలపై కొనసాగింది. ముఖ్యంగా ముస్లిం మహిళల సమస్యలు, రాజకీయ హక్కులు, మైనారిటీ మతాలపై వివక్ష, వేధింపులు, హత్యాకాండలపై నిరంతరం జహంగీర్‌ గళం విప్పారు. 2007 నవంబర్‌లో ఎమర్జెన్సీ విధిం చిన వెంటనే అస్మా జహంగీర్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. 2012 సంవత్సరంలో ఆమెను హత్య చేయడానికి పాకిస్తాన్‌ ఇంటె లిజెన్స్‌ వర్గాలు చేస్తున్న కుట్రలు బయటకు పొక్కడంతో ప్రపంచమంతా అస్మాకు అండగా నిలిచింది. అయినా ఆమె ఎప్పుడూ చావుకు భయపడలేదు. అక్కడే కాదు ఎక్కడైనా హక్కులను గురించి మాట్లాడ్డమంటే ప్రాణాలకు తెగించడమనే అర్థం.

పాకిస్తాన్‌లో దైవదూషణ తీవ్రమైన నేరం. దానికి శిక్ష మరణ దండన. ఇటువంటి కేసుల్లో న్యాయవాదులెవ్వరూ నిందితులకు మద్దతుగా నిలబడరు. కానీ అస్మా మాత్రం అటువంటి కేసులలో పోరాడి విజయం సాధించడం ప్రపంచాన్ని అబ్బురపరిచింది. 1993లో ఒక మసీదు గోడలపై దైవాన్ని దూషిస్తూ రాసారనే నేరారోపణతో సలామత్‌ మసయ, అతని తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేశారు. క్రింది కోర్టు వారికి మరణశిక్ష విధించింది. ఆ కేసులో అస్మా జహంగీర్‌ లాహోర్‌ హైకోర్టులో వారి తరఫున వాదించి 1993 ఫిబ్రవరి, 23వ తేదీన శిక్షను రద్దు చేయించడం ఆమె సాహసానికి మచ్చుతునక.

ఒక దేశద్రోహం కేసు విషయంలో కూడా ఆమె చూపిన చొరవ విశేషమైనది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎం.క్యూ.ఎం పార్టీ నాయకులు అల్తాఫ్‌ హుస్సేన్‌ మీద దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఎలక్ట్రానిక్‌ మీడియాతో సహా అన్ని పత్రికలు, చానళ్లు అల్తాఫ్‌ను బహిష్కరించాయి. న్యాయవాదులెవ్వరూ కూడా ఆ కేసులో వాదించడానికి ముందుకు రాలేదు. కానీ అస్మా ఒక్కరే, ఒక్కరంటే ఒక్కరే నిలబడి భావప్రకటనా స్వేచ్ఛాపతాకాన్ని ఎగురవేసారు. అందుకుగాను ఆమె ఇంటిని సైతం పూర్తిగా ధ్వంసం చేశారు. ఆమెపై భౌతిక దాడికి ఒడిగట్టారు. కానీ ఆమె హక్కుల పోరాటాన్ని కొనసాగించారే తప్ప వెనకడుగువేయ లేదు.

పాకిస్తాన్‌లో 1978లో జియా ఉల్‌ హక్‌ మిలిటరీ పాలనలో అనేక కొత్త చట్టాలు వచ్చాయి. హుదూద్‌ పేరుతో ఉన్న ఈ చట్టంలో ఖురాన్‌ నుంచి తీసుకున్న అనేక అంశాలపై ఆధారపడి శిక్షలు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇందులో ముస్లిం మహిళల విషయంలో అనుసరించిన వైఖరిని అస్మా జహంగీర్‌ సహించలేకపోయారు. ఒక అమ్మాయి వివాహం చేసుకోవడానికి తండ్రితో సహా ఎవరైనా పురుష సంరక్షకుల అనుమతి కావాలి. ఒకవేళ యువతులెవరైనా దీనిని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారమే కాదు, కుటుంబ సభ్యులే ఆ యువతులను చంపేసే సంప్రదాయం ఉన్నది. వీటిని భారతదేశంలో జరుగుతోన్న పరువు హత్యలతో పోల్చవచ్చు. దీని మీద అస్మా జరిపిన పోరాటం గొప్ప ఫలితాలను సా«ధించింది. ఉన్నత న్యాయస్థానం నుంచి న్యాయమైన తీర్పును పొందింది. అంతేకాకుండా పరువు పేరుతో యువతులను హతమార్చిన వాళ్లు ఇస్లామిక్‌ సంప్రదాయం పేరుతో శిక్షల నుంచి తప్పించుకునేవారు. కానీ అస్మా జహంగీర్‌ న్యాయస్థానాల్లో జరిపిన పోరాటం అనేక మంది నేరస్తులకు శిక్షలు విధించేటట్టు చేసింది. ఇందుకుగాను ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొం దించవలసిన అవసరం కూడా ఏర్పడింది.

అస్మా జహంగీర్‌ పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఎన్నో నివేదికలను రూపొందించారు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధిగా ఆమె ఇరాన్, భారతదేశం లాంటి చోట్ల జరుగుతున్న మత అసహనాన్ని నిగ్గదీశారు. మెజారిటీ మతాలు మైనారిటీలపై జరుపుతున్న వివక్ష, అణచివేత, హింసలను ఆమె ఎలుగెత్తి చాటారు.

ఐక్యరాజ్యసమితికి చెందిన మానవహక్కుల విభాగం తరపున భారతదేశంలో మానవ హక్కుల నిర్లక్ష్యంపై కూడా అస్మా జహంగీర్‌ ఒక నివేదికను విడుదల చేశారు. 2009 జనవరి, 26న అది విడుదలయింది. భారతదేశంలో మానవ హక్కులు, పౌరహక్కులు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక హక్కులతో పాటు, డెవలప్‌మెంట్‌ రైట్స్‌ పైన కూడా 2008వ సంవత్సరం మార్చి 3 నుంచి 20 వరకు పర్యటించి ఎన్నో అంశాలను సేకరించారు. భారతదేశంలో మైనారిటీల హక్కులకు భంగం కలిగిస్తున్న అనేకానేక అంశాల పట్ల అస్మా జహంగీర్‌ ఆందోళన వెలిబుచ్చారు. 2006లో రూపొందించిన నూతన చట్టం ఇంకా ఆమోదం పొందక పోవడం పట్ల ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె జీవితమంతా హక్కుల సాధన కోసమే వెచ్చించారు. నిజానికి అస్మా జీవితం, పోరాటం వేర్వేరు కావు. ఆమె జీవితమే పోరాటంగా బతికారు. భవిష్యత్‌ హక్కుల ఉద్యమాలకు వేగుచుక్కగా నిలిచారు.


- మల్లెపల్లి లక్ష్మయ్య

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top