రాయని డైరీ: నితిన్‌ గడ్కారి (కేంద్ర మంత్రి)

Madhav Singaraju Rayani Dairy On Nitin Gadkari - Sakshi

ముంబైలో ఉన్నాను కానీ, ముంబైలో నేనెక్కడున్నానో నాకు తెలియడం లేదు. గూగుల్‌ మ్యాప్స్‌లో కొట్టి చూడొచ్చు. కానీ చుట్టూ క్యాడర్‌ ఉంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి తనెక్కడున్నదీ తెలుసుకోడానికి ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ సెర్చ్‌ చేస్తున్నాడని వాళ్లకు తెలియడం బాగుండదు. 
దారుల మంత్రికి దారి తెలియలేదంటే బీజేపీ క్యాడర్‌ పెద్దగా పట్టించుకోదు కానీ.. నా ముందున్న ఆర్‌ఎస్‌ఎస్‌ క్యాడర్, విహెచ్‌పీ క్యాడర్, శివసేన క్యాడర్‌.. ఈ మూడూ పట్ట నట్లు ఉండలేవు. తటాలున మాట అనేస్తాయి.. బీజేపీ దారి తప్పుతోందని! దారి తెలియకపోతే దారి తప్పేదేమీ ఉండదు. కొత్త దారి వేసుకుంటుంది బీజేపీ. 

‘‘ఇప్పుడు మీరున్న చోటు లోకేషన్‌ను మీకు వాట్సాప్‌ పెట్టమంటారా నితిన్‌ జీ’’ అని అడిగాడు కిశోర్‌ తివారీ!! ఆశ్చర్యపోబోయాను కానీ, ఆశ్చర్యపడిపోకుండా గట్టిగా నిలదొక్కు కున్నాను. ‘‘నేను దారి వెతుక్కుంటున్నానని మీరెందుకు అనుకున్నారు కిశోర్‌ జీ’’ అన్నాను. 
‘‘దారిలో పెట్టడానికి వచ్చినవాళ్లు.. ముందు దారెక్కడుందో వెతుక్కోవాలి కదా.. అందుకని అలా అనుకున్నాను’’ అన్నాడు.

కిశోర్‌ రైతు కార్యకర్త. సరిగ్గా ఎన్నికలకు ముందు దారి తప్పి శివసేనలోకి వచ్చాడు. నాకు ఆప్తుడు. నాకు ఆప్తుడైనవాడు బీజేపీలోకి రాకుండా శివసేనలోకి వెళ్లాడంటే.. నన్నూ శివసేనకు ఆప్తుడిని చెయ్యాలని అనుకుంటు న్నాడని! శివసేనకు నేను ఆప్తుడిని అవడం అంటే.. ఆదిత్య ఠాక్రేని దగ్గరుండి మరీ ముఖ్య మంత్రి సీట్లో కూర్చోబెట్టి ఢిల్లీ వెళ్లిపోవడం. 
ఆ సంగతి చెప్పకుండా.. ‘‘ప్రయాణం ఎలా సాగింది నితిన్‌ జీ’’ అని అడిగాడు కిశోర్‌!!
‘‘ఢిల్లీ నుంచి నేను ముంబై వచ్చి రెండు రోజులైంది’’ అన్నాను. 

‘‘ఢిల్లీ నుంచి ముంబైకి మీ ప్రయాణం ఎలా సాగింది అని కిశోర్‌ అడగటం లేదు నితిజ్‌ జీ. ముంబై వచ్చాక ఆదిత్య ఠాక్రేని సీఎంని చేసి వెళ్లే మీ ప్రయాణం ఎలా సాగింది అని అడుగుతున్నాడు’’ అన్నారు మోహన్‌ భాగవత్‌. ఆర్‌.ఎస్‌.ఎస్‌. చీఫ్‌ ఆయన. ఆయన చెబితే.. మోదీజీ అయినా, అమిత్‌జీ అయినా, ఇంకెవరైనా వినాల్సిందేనని కిశోర్‌ నమ్మకం. ‘గడ్కారికి మీరొక మాట చెప్పండి భాగవత్‌జీ, మహారాష్ట్ర రెండే రెండు నిముషాల్లో సెటిలైపోతుంది’ అని భాగవత్‌కి కిశోర్‌ ఉత్తరం రాశాడని ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో ముంబై వస్తున్నప్పుడు నా పక్క సీట్లో కూర్చున్న ప్రయాణికుడెవరో నేనెవరో గుర్తుపట్టకుండానే నాతో అన్నాడు! పైగా తనకు బొత్తిగా పాలిటిక్స్‌ తెలియవు అని కూడా అన్నాడు.

నన్ను కన్విన్స్‌ చెయ్యమని భాగవత్‌కి కిషోర్‌ ఉత్తరం రాసిన సంగతి నా కన్నా ముందు ఫ్లయిట్‌లో నా పక్క సీట్లో పాలిటిక్స్‌ అంటే ఏమిటో కూడా తెలియకుండా కూర్చొని ఉన్న ఒక వ్యక్తికి తెలిసిందంటే..  మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీటునే తప్ప, ముఖ్యమంత్రి పక్క సీటును, ముఖ్యమంత్రి వెనుక సీటును శివసేన కోరుకోవడం లేదనే.

‘‘మహారాష్ట్రను సెట్‌ చెయ్యడానికో, సెటిల్‌ చెయ్యడానికో నేను ముంబై రాలేదు కిశోర్‌ జీ. తెలిసిన వాళ్ల ఫంక్షన్‌కి వచ్చాను’’ అన్నాను. 
కిశోర్‌ నిరుత్సాహంగా చూశాడు. ఉద్ధవ్‌ అసహనంగా చూశాడు. భాగవత్‌ పెద్దమనిషిలా చూశాడు. ఆదిత్య ఎలానూ చూడకుండా.. తండ్రి వైపే చూస్తున్నాడు. 

‘‘చూద్దాం. దారే లేదనుకున్నప్పుడు బీజేపీ ఎన్ని దారులు వేయలేదూ?! కశ్మీర్‌కు దారి వేసింది. కర్తార్‌పూర్‌ కారిడార్‌కు దారి వేసింది. ఇప్పుడు అయోధ్యకు దారి వేసింది’’ అన్నాను. 

‘అయితే?!’ అన్నట్లు చూశారు తండ్రీకొడుకులు ఉద్ధవ్‌ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే. 
‘‘బీజేపీ.. కశ్మీర్‌కు దారి వేసినప్పుడు, కర్తార్‌పూర్‌కు దారి వేసినప్పుడు, అయోధ్యకు దారి వేసినప్పుడు.. మహారాష్ట్రకు దారి వేయలేకపోతుందా! పార్టీలో నేనొక్కడినే మీకు పైకి కనిపించే దారుల మినిస్టర్‌ని’’ అన్నాను. 
-మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top