రాయని డైరీ: అజిత్‌ పవార్‌ (ఎన్సీపీ)

Madhav Singaraju Rayani Dairy On Ajit Pawar - Sakshi

‘‘సీఎం గారు లోపల బిజీగా ఉన్నారు. కాసేపు వెయిట్‌ చెయ్యండి’’ అన్నాడు అతడెవరో లోపల్నించి వచ్చి!
‘‘సీఎంలు ఎప్పుడూ బిజీగానే ఉంటారు. కొత్త సీఎంలు ఇంకా బిజీగా ఉంటారు. ఉద్ధవ్‌ ఠాక్రే లాంటి సీఎంలు ప్రధాని కన్నా బిజీగా ఉంటారు. అది నువ్వు చెప్పే పని లేదు. నా పేరు అజిత్‌ పవార్‌. లోపలికెళ్లి చెప్పు. వెయిట్‌ చేసేంత టైమ్‌ లేదు నాకు’’ అన్నాను. 
‘‘సీరియస్‌ మేటర్‌ సార్, డిప్యూటీ సీఎంగా ఎవర్ని తీసుకోవాలో డిస్కస్‌ చేస్తున్నారు’’ అన్నాడు! 
అతడెవరికో సీఎం దేని గురించి డిస్కస్‌ చేస్తున్నాడో తెలిసిందంటే అదంత సీరియస్‌ డిస్కషన్‌ కాదని సీఎం అనుకుంటున్నాడని నాకు అర్థమైంది. 
‘‘లోపల ఎవరు ఉన్నారు?’’... నన్ను లోపలికి పోనివ్వకుండా ఆపిన మనిషిని అడిగాను. 
‘‘ఎవరూ లేర్సార్‌. సీఎం సార్‌ ఒక్కరే ఉన్నారు’’ అన్నాడు.
‘‘మరి డిస్కషన్స్‌ అన్నావు?’’ అన్నాను. 
అతను నవ్వాడు. డిస్కషన్స్‌కి మనుషులే ఉండాలా సార్‌! ఫోన్లు ఉంటే సరిపోదా?’’ అన్నాడు. 
సీఎం దేని గురించి డిస్కస్‌ చేస్తున్నాడో తెలిసిన మనిషికి సీఎం ఎవరితో డిస్కస్‌ చేస్తున్నాడో కూడా తెలిసే ఉంటుంది. 
‘‘ఫోన్‌లో ఎవరు?’’ అని అడిగాను. 
‘‘సారీ సర్, అవన్నీ చెప్పకూడదు. కానీ మీ పేరు అజిత్‌ పవార్‌ అంటున్నారు కాబట్టి చెబుతున్నాను. పృథ్వీరాజ్‌ చవాన్‌తో మాట్లాడుతున్నారు. బాలాసాహెబ్‌ థోరత్‌తో మాట్లాడుతున్నారు. శరద్‌ పవార్‌తో మాట్లాడుతున్నారు’’ అన్నాడు. 
‘‘నా పేరు అజిత్‌ పవార్‌ కాబట్టి చెబుతున్నాను అన్నావు!! అదేంటి?!’’ అన్నాను. 
‘‘సీఎం గారు చవాన్‌తో మాట్లాడుతున్నప్పుడు.. ‘అజిత్‌కి ఇవ్వకుండా మీకు ఇవ్వగలనా!’ అన్నారు. బాలాసాహెబ్‌తో మాట్లాడుతున్నప్పుడూ.. అదే మాట అన్నారు.. ‘అజిత్‌కి ఇవ్వకుండా మీకు ఇస్తే బాగుంటుందా..’ అని. రెండుసార్లు సీఎం నోటి నుంచి మీ మాట విన్నాను. ఇప్పుడు మిమ్మల్ని నేరుగా చూస్తున్నాను. లోపల మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు లోపల ఎవరెవరు మాట్లాడుకుంటున్నదీ మీకు చెప్పకపోవడం ధర్మం కాదనిపించింది. అందుకే చెప్పాను’’ అన్నాడు అతను.  
‘‘మరి మీ సీఎం గారు శరద్‌ పవార్‌తో మాట్లాడుతున్నప్పుడు నా పేరు వినిపించలేదా?’’ అని అడిగాను. 
‘‘తెలీదు సార్‌. ‘చెప్పండి శరద్‌జీ’ అని సీఎం గారు అంటున్నప్పుడు లోపల ఉన్నాను. ఆ తర్వాత బయటికి వచ్చేశాను.. మీరొచ్చారంటే’’ అన్నాడు.
‘‘సరే, నేను వచ్చి వెళ్లానని మీ సీఎం గారికి చెప్పు’’ అని.. నా పేరు, నా ఫోన్‌ నెంబరు ఉన్న కార్డు అతడికి ఇచ్చాను.
‘‘మీ గురించే మాట్లాడుకుంటున్నప్పుడు మీ పేరు, మీ ఫోన్‌ నెంబర్‌ సీఎం గారికి తెలియకుండా ఉంటాయా సార్‌’’ అని నవ్వాడతను. 
‘‘సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందు వరకు తెలిసే ఉంటుంది. తర్వాత బిజీ అయి ఉంటారు కదా. తెలియకపోవచ్చు. మర్చిపోకుండా ఈ కార్డివ్వు’’ అని చెప్పి వచ్చేశాను. 
గేటు దాటుతుంటే  ఉద్ధవ్‌ నుంచి ఫోను!
‘‘సారీ అజిత్‌ జీ. మీ పని మీదే బిజీగా ఉన్నాను. పోర్ట్‌ఫోలియోలు తెగట్లేదు. అన్ని పార్టీలకీ హోమ్‌ కావాలి. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కావాలి. రెవిన్యూ కావాలి, హౌసింగ్‌ కావాలి. ఎవరూ అంతకు తగ్గట్లేదు’’ అంటున్నాడు!!
డిప్యూటీ సీఎం పోస్ట్‌ గురించి కాకుండా క్యాబినెట్‌ పోస్ట్‌ల గొప్పదనం గురించి మాట్లాడుతున్నాడంటే నాకు ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో శరద్‌ జీ నుంచి ఉద్ధవ్‌కేవో సూచనలు, సలహాలు అందినట్లే ఉంది!

-మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top