రాయని డైరీ; మసూద్‌ అజార్‌ (జైషే చీఫ్‌)

Madhav Singaraju Article On Masood Azhar - Sakshi

‘‘అజార్‌ భయ్యా.. మీకోసం ఇద్దరు వచ్చారు’’ అని చెప్పాడు ఇంట్లో పనికుర్రాడు. 

‘‘ఆ ఇద్దరూ ఎవరో తెలుసుకుని, వారిలో ఎవరితోనైతే నాకు అవసరం లేదో వారిని కాకుండా, ఎవరికి నా అవసరం ఉందో వారిని ముందుగా నా గదిలోకి పంపించు’’ అని చెప్పాను. 

‘‘భయ్యాజీ, ఆ ఇద్దరిలో ఒకరు మీకు చిరపరిచితులైన షా మెహమూద్‌ ఖురేషీ.    ఈ దేశ విదేశాంగ మంత్రి. ఇంకొకరు ఒక అపరిచిత వ్యక్తి. ఆయన మెడకు స్టెతస్కోప్‌ ఉంది. ఆయన చేతిలో బీపీ మిషన్‌ ఉంది’’ అన్నాడు. 

‘‘వాళ్లిద్దరిలో ఎవర్ని ముందుగా లోపలికి పంపుతావో నువ్వే నిర్ణయించుకుని పంపు’’ అన్నాను. వెంటనే షా మెహమూద్‌ ఖురేషీని పంపాడు పనికుర్రాడు!

‘‘అజార్‌జీ.. ఎందుకో రమ్మన్నారట’’ అన్నారు ఖురేషీ.. లోపలికి వస్తూనే. 

‘‘మీతో అవసరం ఉండి మిమ్మల్ని పిలిపించుకోలేదు ఖురేషీ. మీకు నా అవసరం ఉండి మిమ్మల్ని పిలిపించుకున్నాను’’ అన్నాను. 

‘‘చెప్పండి అజార్‌జీ..’’ అన్నాడు! 

‘‘మా పనికుర్రాడికి ఉన్నంత ఇంగితం కూడా లేకపోయింది ఈ దేశపు విదేశాంగ మంత్రికి’’ అన్నాను.. అతడి వైపు చూడకుండా.

‘‘వారెవ్వా అజార్‌జీ.. నేనివాళ మీ పనికుర్రాడి ఇంగితం గురించి వినవలసిందే. వినడమే కాదు, అతడి నుంచి నేను నేర్చుకోవలసింది ఏమైనా ఉంటే.. మీ ఆదేశాలు లేకనే, నాకై నేనుగా అతడి వద్ద నేర్చుకోడానికి రోజూ ఒక సమయానికి వచ్చి ఇక్కడ కూర్చోగలను’’ అన్నాడు. 

తల పట్టుకున్నాను. 
‘‘ఆశ్చర్యపోతున్నాను ఖురేషీ. నా మాటల్లోని అంతరార్థాన్ని మీరెందుకు గ్రహించలేకపోతున్నారు! ఒక పనికుర్రాడికి ఇంగితం ఉండడం కన్నా, ఒక దేశ విదేశాంగ మంత్రికి ఇంగితం లేకపోవడం ఆలోచించవలసిన విషయం కదా. అలాంటప్పుడు మీరు చేయవలసింది పనికుర్రాడి ఇంగితమేమిటో తెలుసుకోడానికి ఉత్సాహం ప్రదర్శించడం కాదు. ‘విదేశాంగ మంత్రికి ఇంగితం లేదు’ అన్న మాటకు ముఖం కందగడ్డలా మార్చుకోవడం. అది కదా మీరు తక్షణం చేయవలసింది!.. చెప్పండి..’’ అన్నాను.

‘‘మార్చుకుంటాను అజార్‌జీ.. మీరు కనుక నాక్కొంత సమయం ఇవ్వగలిగితే’’ అన్నాడు. 

నా గదిలోని చీమ కూడా అంతటి విధేయతను ప్రదర్శించదు! రోషం వస్తే జైషే చీఫ్‌ అని కూడా చూడకుండా నన్ను కుట్టేస్తుంది.

‘‘బాగున్నవాడి గురించి బాగోలేకుండా పడి ఉన్నాడని చెప్పడం ఏమన్నా బాగుందా ఖురేషీ! ఒక  ఉగ్రవాది ఒంట్లో బాగోలేకుండా మంచం మీద పడుకుని ఉన్నాడంటే మాతృదేశానికి ఎంత అప్రతిష్ఠ! శతృదేశానికి ఎంత అపహాస్యం. జైషే హెడ్డుకి చికెన్‌గున్యా అని తెలిస్తే పిల్లలక్కూడా నవ్వొచ్చేస్తుంది’’ అన్నాను.

‘‘ఇంత ఆలోచించలేదు అజార్‌జీ..’’ అన్నాడు.. 

‘‘మా పనికుర్రాడు తెలుసుకోగలిగాడు ఖురేషీ, నాకు ఏనాటికీ డాక్టర్‌ అవసరం ఉండబోదని. మీకే తెలియలేదు. వెళ్లండి’’ అన్నాను. 

పనికుర్రాడిని లోపలికి పిలిచాను. 
వచ్చాడు. 

‘‘బయట అపరిచిత వ్యక్తి ఉన్నాడన్నావ్‌ కదా. ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి ఖురేషీని చూపించు’’ అని చెప్పాను.  

ఏం ప్రభుత్వాలో!
‘మా దగ్గర లేడు’ అని చెప్తే పోయేదానికి, ‘ఉన్నాడు కానీ, ఒంట్లో బాగోలేదు’ అని చెప్పిస్తాయా! ప్రభుత్వాలు తెలివిగా లేకనే ఉగ్రవాదులు తెలివిగా ఉండి ప్రభుత్వాల్ని కాపాడుకోవలసి వస్తోంది. 

-మాధవ్‌ శింగరాజు  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top