మితిమీరిన లోటుతో బడ్జెట్‌కు చేటు

IYR Krishna Rao Article On Union Budget 2019 - Sakshi

విశ్లేషణ

అంచనాలలో లెక్కలు తప్పితే మొదటికే మోసం వస్తుంది. ఈ బడ్జెట్లో కొన్ని ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి నాలుగేళ్లు చిత్తశుద్ధితో చేసిన కొన్ని కార్యక్రమాలు వెసులుబాటు కల్పించాయి. రాష్ట్ర బడ్జెట్‌లో ఆదాయాన్ని ఏకంగా 15శాతం పెంచి 19–20 సంవత్సరానికి రెండు లక్షల 25 వేల కోట్లుగా చూపెట్టారు. ఈ స్థాయిలో అమాంతంగా వనరులు ఎట్లా పెరుగుతాయో అర్థం కావటం లేదు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఏకంగా ఒక సంవత్సరంలో 10 వేల కోట్లు పెరుగుతున్నట్లుగా చూపెట్టారు. అమలుచేయలేని, చేయాలన్న ఉద్దేశం లేని అనేక కార్యక్రమాలను ప్రకటించడం కేవలం బడ్జెట్‌ను అపహాస్యం చేయడమే అవుతుంది.

కేంద్రంలో ఒక బడ్జెట్టు, రాష్ట్రంలో ఒక బడ్జెట్టు ప్రవేశపెట్టారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి రెండు బడ్జెట్లలో ప్రజాకర్షణ పథకాలను, వరాలను పొందుపరిచారు. ఎవరు తాయిలాలు ఇవ్వాలన్నా దానికి తగ్గ వనరులు ఉండాలి. బడ్జెట్‌ అంటేనే భవిష్యత్తులోని ఆదాయ వ్యయ అంచనా. ఈ అంచనాలలో లెక్కలు తప్పితే మొదటికే మోసం వస్తుంది. ఈ రెండు బడ్జెట్లు ఎలా ఉన్నాయనే అంశాన్ని పరిశీలించే ముందు రెండు, మూడు సాంకేతికమైన విషయాల మీద మౌలికమైన పరిజ్ఞానం అవసరం. 

ప్రతి బడ్జెట్లో రెవెన్యూ విభాగం, మూలధన విభాగం ఉంటాయి. సాలుసరి పన్నుల రూపంలో ఇతరత్రా వచ్చే ఆదాయాలు రెవెన్యూ ఆదాయంగా చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా జీతాలు, పెన్షన్లు లాంటి సాలుసరి ఖర్చులను రెవెన్యూ ఖర్చులుగా చూపెట్టడం జరుగుతుంది. ఈ విభాగంలో ఖర్చుకన్నా ఆదాయం ఎక్కువగా ఉంటే దానిని రెవెన్యూ మిగులు అంటారు. అది చాలా శుభకరమైన పరిణామం. అదే ఖర్చు ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటే రెవెన్యూ లోటు అంటారు. ఇది మంచి పరిణామం కాదు. ఎంత ఎక్కువ ఉంటే అంత ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది.

ఇక మూలధన పట్టికలో వచ్చే నిధులు అప్పుల రూపంలో ఉంటాయి. ఖర్చు ప్రాజెక్టుల మీద ఆదాయాన్నిచ్చే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే స్థిరాస్తుల మీద ఉంటుంది. తీసుకున్న మొత్తం అప్పులను ద్రవ్యలోటు అంటారు. ఈ తీసుకున్న అప్పులో కొంత భాగం రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి ఉపయోగిస్తే అంతవరకు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టడానికి ఉండే నిధులు తక్కువవుతాయి. ఏ దేశంలో రెవెన్యూ లోటు సున్నా ఉండి మొత్తం అప్పులు ప్రాజెక్ట్స్‌ మీద ఖర్చు పెడతారో ఆ ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా బలోపేతంగా ఉంటుంది. ఇంకొక చిన్న అంశం ప్రాథమిక లోటు. తెచ్చే అప్పులు కనీసం పాత వడ్డీలను కట్టడానికైనా ఉపయోగపడితే ప్రాథమిక లోటు ఉండదు. అప్పుడు భవిష్యత్తులో మరింత అప్పుల భారం వచ్చే అవకాశం ఉండదు. కానీ ప్రాథమిక లోటు ఉండి తెచ్చిన అప్పులు కట్టే వడ్డీల కన్నా ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో అప్పుల భారం పెరుగుతున్నట్టు అర్థం. ఇది మంచి పరిణామం కాదు. 

విచ్చలవిడి బడ్జెట్‌తో మొదటికే మోసం
ప్రజాస్వామ్యంలో ప్రజలదే రాజ్యం. బడ్జెట్లు ప్రజారంజకంగాను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగానూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రజారంజకం పేరుతో పైన పేర్కొన్న సూచికలను పూర్తిగా విస్మరించి విచ్చలవిడిగా బడ్జెట్‌ రూపొందిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే బడ్జెట్లు ఎప్పుడూ వాస్తవికతకు దగ్గ రగా ఉండాలి. ఇక దర్శనీయంగా పెట్టుబడులను, అభివృద్ధిని ఇబ్బడిముబ్బడిగా ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఈ ప్రామాణికాలను ఆధా రంగా చేసుకొని కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు పరిశీలిద్దాం. 

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ మూడు ప్రధానమైన ప్రజారంజక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా దేశమంతటా రైతుల ఖాతాల్లో ఆరువేల రూపాయలు జమ చేసే విధంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా అసంఘటిత కార్మికులకు మూడు వేల రూపాయల పెన్షన్‌ వచ్చే విధంగా మరొక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఐదు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా మార్పు తీసుకొని వచ్చింది. ఇంకా ఎన్నో ఇతర కార్యక్రమాలు ఉన్నా బడ్జెట్‌లో బాగా ప్రాధాన్యత సంతరించుకున్న పథకాలు ఈ మూడు. మరి ఇవి ఆచరణ సాధ్యమేనా! బడ్జెట్లోని గణాంకాలు చూస్తే వాస్తవికతకు దగ్గరగా ఆచరణ సాధ్యంగా ఈ మూడింటినీ ప్రవేశపెట్టారని అర్థం అవుతుంది. ఆదాయపు అంచనాలను చాలా వాస్తవికంగా రూపొందిం చారు.

జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదలను 2%గానే తీసు కున్నారు. 17–18, 18–19 సంవత్సరాల మధ్య వచ్చిన రాబడిలో పెరుగుదల  20% ఉంటే 19–20 ఏడాది రాబడిలో పెరుగుదల 14% గానే తీసుకున్నారు. కాబట్టి ఈ ఆదాయాలు రావటంలో ఎటువంటి సమస్యా ఉండకపోవచ్చు. ద్రవ్యలోటు జాతీయాదాయంలో 3.4%గా అంచనా వేశారు. మూడు శాతం కన్నా తక్కువ ఉంటే మంచి పరిణామంగా భావించాల్సి ఉన్న ద్రవ్యలోటు నిర్వహణ పరిమితులలోనే ఉన్నది (ఝ్చn్చజ్ఛ్చb ్ఛ  జీఝజ్టీట). రెవెన్యూ లోటు కూడా 1.3% దగ్గర ఉంది. ఇది పూర్తిగా లేకపోయినా ద్రవ్య మిగులు ఉన్నా చాలా మంచి పరిణామం. కానీ 1.3% ప్రమాదకరమైన సంకేతమైతే కాదు. ఏడు లక్షల కోట్లకు ప్రాథమిక లోటు చాలా తక్కువగా 38 వేల కోట్లు ఉన్నది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే తీసుకున్న అప్పులలో ఎక్కువ శాతం వడ్డీలు చెల్లించడానికి పోతున్నది కాబట్టి అదనంగా అప్పుల భారం పడే అవకాశం చాలా తక్కువ. 

వాస్తవికతకు దగ్గరగా కేంద్ర బడ్జెట్‌
ఈ బడ్జెట్లో కొన్ని ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి గత నాలుగు సంవత్సరాలు చిత్తశుద్ధితో చేసిన కొన్ని కార్య క్రమాలు వెసులుబాటు కల్పించాయి. ఎన్నాళ్ల నుంచో తెగకుండా సాగు తున్న జీఎస్టీని ఒక కొలిక్కి తెచ్చి ప్రవేశపెట్టడంతో దేశమంతటా ఒకే మార్కెట్‌ ఏర్పడింది. దీని వల్ల వచ్చే ఆదాయాలు కూడా పెరిగాయి. ఆర్థిక మంత్రి చెప్పినట్టు జీఎస్టీ ప్రవేశ పెట్టిన కొత్తలో నెలకు 89,700 కోట్లు ఉన్న ఆదాయం 97 వేల కోట్లకు పెరిగింది. నోట్ల రద్దుతో అదనంగా చాలామంది ఆదాయపన్ను మదింపుకి వచ్చారు. నిరర్థక ఆస్తులను రాబట్టడంలో ఇన్సాల్వెన్సీ చట్టం చాలా ఉపయోగపడింది. ఇప్పటికే మూడు లక్షల కోట్ల దాకా మొండి బకాయిలు వసూలు అయినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దీనితో బ్యాంకింగ్‌ రంగానికి బడ్జెట్‌ ద్వారా సహాయం చేయాల్సిన అవసరం తగ్గింది.

ఈ మంచి పరిణామాలను ఉపయోగించుకొని కొన్ని వర్గాల ప్రజలకు రాయితీలను ప్రకటిస్తూ వాస్తవికతకు దగ్గరగా ఆచరణకు ఏ విధమైన ఇబ్బంది ఉండని బడ్జెట్‌  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పరిశీలిద్దాం. 2017– 18లో రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఆదాయం ఒక లక్షా 91 వేల కోట్లు. 18–19కి ఈ ఆదాయం ఇదే స్థాయిలో ఉంటుందని అంచనా వేసినా, సంవత్సరాంతానికి రెండు శాతం పెరిగి లక్షా 95 వేల కోట్లు అయింది. ఈ ఆదాయాన్ని ఏకంగా 15 శాతం పెంచి 19–20 సంవత్సరానికి రెండు లక్షల 25 వేల కోట్లుగా చూపెట్టారు. ఇంత స్థాయిలో అమాంతంగా వనరులు ఎట్లా పెరుగుతాయో అర్థం కావటం లేదు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఏకంగా ఒక సంవత్సరంలో 10 వేల కోట్లు పెరుగుతున్నట్లుగా చూపెట్టారు.

కేంద్రం పన్నులలో రాష్ట్రాల వాటా 14వ ఆర్థిక సంఘం పెంచిన తర్వాత కేంద్రం గ్రాంట్లను తగ్గించింది. అటువంటి పరిస్థితుల్లో పదివేల కోట్లు అమాంతంగా అదనంగా వస్తాయని చూపెట్టి అమలుచేయలేని, చేయాలన్న ఉద్దేశం లేని అనేక కార్యక్రమాలను ప్రకటించడం కేవలం బడ్జెట్‌ను అపహాస్యం చేయడమే అవుతుంది. అదేవిధంగా సొంత పన్నుల రాబడిలో కూడా పొంతన లేని పెరుగుదలను చూపెట్టుకు న్నారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఒక మద్యం, పెట్రోల్‌ మీద తప్పితే మిగిలిన వాటిపై అమ్మకం పన్ను పెంచే అధికారం రాష్ట్రాలకు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇంత అనూహ్యంగా రాబడి ఎక్కడి నుంచి వస్తుందని అంచనా వేశారో అర్థం కాకుండా ఉంది. 

ఇక అప్పుల విష యానికొస్తే 2017–18 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 86 వేల కోట్ల అప్పు, 2018–19 సంవత్సరంలో 39 వేల కోట్ల రూపాయల అప్పు చేయడం జరిగింది. దీనికి అదనంగా ఈ సంవత్సరం 17 శాతం వృద్ధితో 47 వేల కోట్ల రూపాయల అప్పులకు ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు రెండు వేల కోట్ల రూపాయలుగా చూపెట్టినా అంచనా వేసిన రాబడి వాస్తవ విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది చాలా పెరిగే అవకాశం ఉంది. 32 వేల కోట్లుగా అంచనా వేసిన ద్రవ్యలోటు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఆర్థిక పరిస్థితి దారుణం
అన్నిటికీ మించి ప్రాథమిక లోటు 14, 570 కోట్లు. అంటే మనం తీసుకునే అప్పు వడ్డీలు కట్టగా కూడా ఇంకా 14,570 కోట్లు అప్పు ఉండి భవిష్యత్తులో ఇంకా రుణ భారం, వడ్డీ భారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్రుంగ తీయబోతున్నాయి. 27 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న కేంద్ర బడ్జెట్లో ప్రాథమిక లోటు 39 వేల కోట్లు ఉంటే రెండు లక్షల 25 వేల కోట్ల బడ్జెట్‌ ఉన్న మన రాష్ట్రానికి ప్రాథమిక లోటు 14,570 కోట్లు ఉందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రజారంజకంగా బడ్జెట్‌ను తయారు చేసుకోవడంలో ఎటువంటి తప్పులేదు. ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించటానికి ఎటువంటి విధి విధానాలు అవలంబిస్తే బాగుంటుందో ఆర్థిక శాస్త్రవేత్తలు కొన్ని సూచికలు స్థిరీకరించారు. వాటికి కొంత అటూఇటుగా కొన్ని సంవత్సరాలు బడ్జెట్‌ను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుంది. అది ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి హాని చేయదు. కానీ ఆ సూచికలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఆచరణ సాధ్యం కాని వనరులు లేని ఖర్చు మాత్రమే చూపెడుతూ తయారుచేసిన బడ్జెట్‌ కేవలం భ్రమల భ్రాంతుల బడ్జెట్‌గా మిగిలిపోతుంది. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. ఎవరి చేతి లోనూ మంత్ర దండాలు లేవు కదా.
వ్యాసకర్త : ఐవైఆర్‌ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి

ఈ–మెయిల్‌ :  iyrk45@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top