వ్యక్తి స్వేచ్ఛ న్యాయస్థానాల మౌలిక బాధ్యత

Guest Column On Nakkeeran Gopal Held Over Story Linking Tamil Nadu - Sakshi

విశ్లేషణ

వ్యక్తి స్వేచ్ఛకి, జీవితానికి భారత రాజ్యాంగంలోని అధికరణ 21 చాలా అత్యున్నతమైన స్థానాన్ని కల్పిం చింది. వీటిని కాపాడాల్సిన బాధ్యత అన్ని వ్యవస్థల మీదా ఉంది. మరీ ముఖ్యంగా కోర్టుల మీద ఉంటుంది. ఈ బాధ్యత రాజ్యాంగ న్యాయస్థానాలైన హైకోర్టు, సుప్రీంకోర్టుల మీదనే కాదు. అన్ని కోర్టుల మీదా ఉంటుంది. దిగువ కోర్టు న్యాయమూర్తులు తమపై ఈ బాధ్యత లేదని భావిస్తున్నట్టు అనిపిస్తున్నది. వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించి జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ పాత్ర మరీ ఎక్కువ. 

‘నక్కీరన్‌’ పత్రిక సంపాదకుడి అరెస్టు, విడుదల సంఘటన జరిగిన నేపథ్యంలో ఈ విషయాలను ప్రస్తావించాల్సి వస్తుంది. పోలీసులు ‘నక్కీరన్‌’ సంపాదకుడు ఆర్‌. రాజగోపాల్‌ని అరెస్టు చేశారు. అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 124కింద నేరారోపణ చేశారు. రాజ్‌భవన్‌ డిప్యూటీ సెక్రటరీ ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. నిర్మలాదేవి అనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తన దగ్గర చదువుకుంటున్న ఆడపిల్లల్ని మార్కుల కోసం అధికారులకు లైంగికంగా సహకరించమని ప్రోత్సహిస్తున్నదని ఆరోపణలు రావడంతో ఆమెను అరెస్టు చేశారు. ఆమె మాట్లాడిన ఆడియో క్లిప్‌ కూడా బయటకొచ్చింది. తమిళనాడు గవర్నర్‌తో, అతని కార్యదర్శితో ఆమె చాలాసార్లు సమావేశం అయిందన్న ఆరోపణలున్నాయి.

వీటిని గవర్నర్‌ కార్యాలయం ఖండించింది. నిర్మలాదేవి కామరాజ్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఓ కాలేజీలో పనిచేస్తున్నది. పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆమె కొంతమంది అధికారుల పేర్లు బయటపెట్టిందని కూడా తెలుస్తోంది. వీటన్నిటిపైనా ‘నక్కీరన్‌’ పత్రిక కవర్‌ పేజీ కథనాన్ని ప్రచురించింది. తమ కథనానికి ఆధారం పోలీసుల దర్యాప్తేనని ఆ పత్రిక తెలిపింది. ఆమెకు జైల్లో రక్షణ కల్పించాలని, చాలామంది ఆత్మహత్యల పేరుతో జైళ్లలో మరణిస్తున్నారని పేర్కొంది. 

మేజిస్ట్రేట్‌ కోర్టులో గోపాల్‌ తరఫు న్యాయవాదితోపాటు ‘హిందూ’ దినపత్రిక సంపాదకుడు ఎన్‌. రామ్‌ కూడా హాజరయ్యారు. సెక్షన్‌ 124 వర్తించే నేరమేదీ గోపాల్‌ చేయలేదని, ఆ కథనానికి ఈ సెక్షన్‌కు ఎలాంటి సంబంధం లేదని వారు వాదించారు. రాష్ట్రపతిని లేదా గవర్నర్‌ను ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి తెచ్చి వారి చట్టబద్ధమైన అధికారాలను వినియోగించకుండా ఆటంకపరచడానికి ప్రయత్నించినప్పుడు, దౌర్జన్యం చేసినప్పుడు లేదా అక్రమంగా నిర్బంధించినప్పుడు లేదా అలాంటి ప్రయత్నం చేసినప్పుడు, బల ప్రయోగం చేసినప్పుడు, బెదిరించినప్పుడు ఆ సెక్షన్‌ వర్తిస్తుంది.

ఇది నాన్‌ బెయిలబుల్‌ నేరం. ఈ నేరం రుజువైతే ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. నక్కీరన్‌ గోపాల్‌ కథనాన్ని ప్రచురించారు తప్ప గవర్నర్‌తో ప్రత్యక్షంగా కలిసిన సందర్భం లేదు. దౌర్జన్యం శారీరకంగా ఉండాలి. మొత్తానికి గోపాల్‌ న్యాయవాది, రామ్‌ వాదనలతో గోపాల్‌ను మేజి స్ట్రేట్‌ విడుదల చేశారు. దీన్ని పత్రికా విజయంగా భావించవచ్చు. వ్యక్తి స్వేచ్ఛను కాపాడటంలో రాజ్యాంగ న్యాయస్థానాలకు ఉన్నట్టే మేజిస్ట్రేట్‌ కోర్టుకు కూడా బాధ్యత ఉంటుంది. ఎవరినైనా రిమాండ్‌కి తీసుకొచ్చినప్పుడు అందుకు గట్టి ఆధారాలున్నాయో లేదో మేజిస్ట్రేట్‌ పరిశీలించాలి.

ఆరోపించిన నేరాలను అతను చేశాడని విశ్వసించినప్పుడే రిమాండ్‌ చేయాలి. అందుకోసం అన్ని సాక్ష్యాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు పేర్కొన్న నేరాల కింద మాత్రమే కాక వేరే నేరాల ప్రకారం కూడా అతన్ని రిమాండ్‌ చేయవచ్చు. అదేవిధంగా నేరారోపణలు లేవని విశ్వసించినప్పుడు విడుదల చేయొచ్చు కూడా. ఇప్పుడు నక్కీరన్‌ గోపాల్‌ విషయంలో చెన్నై 13వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ చేసింది అదే. ఎంతమంది మేజిస్ట్రేట్‌లు ఈవిధంగా చేస్తున్నారు? ఎంత స్వేచ్ఛగా విధులు నిర్వర్తిస్తున్నారు? ఇది లక్షడాలర్ల ప్రశ్న.

వ్యాసకర్త: మంగారి రాజేందర్‌, టీపీఎస్సీ సభ్యుడు
మొబైల్‌ : 94404 83001

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top