బురదలోంచి వెలుగులోకి

Gollapudi Maruthi rao writes on Dawood's son - Sakshi

జీవన కాలమ్‌

ఐశ్వర్యంలో కేవలం మత్తు ఉంది. కానీ ఆముష్మిక జీవనంలో అంతులేని తృప్తి ఉంది. తండ్రిది దోచుకున్న వైభవం. కొడుకుది తనకు తానుగా సంపాదించు కున్న ఆధ్యాత్మిక సంపద. రెంటికీ పొంతనలేదు. ప్రయత్నించినా దొరకదు.

మొదట దావూద్‌ ఇబ్రహీం గురించి.
ఆయనది పెద్ద సామ్రాజ్యం. చాలా దేశాలలో ఆయ నకి పాలెస్‌లు ఉన్నాయి. ప్రతీ పాలెస్‌ పేరూ ‘వైట్‌ హౌస్‌’. ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక పాకిస్తాన్‌లో మోయిన్‌ పాలెస్‌ నిర్మించారు. దాని చుట్టూ అనునిత్యం పహారా కాసే తుపాకీ వీరులు. ఆ పాలెస్‌ గదుల్లో స్వరోస్కి క్రిస్టల్‌ చాండ లీర్స్, ఒక చిన్న జలపాతం, ఎప్పుడు పడితే అప్పుడు ఉష్ణోగ్రతని నిర్ణయించగల స్విమ్మింగ్‌ పూల్, ఒక టెన్నిస్‌ కోర్టు, ఒక బిలియర్డ్స్‌ కోర్టు, ఉదయం జాగింగ్‌ చెయ్యడానికి ప్రత్యేకమైన ట్రాక్‌ ఉన్నాయి. ఆయన స్పెషల్‌ అతిథులు మోయిన్‌ పాలెస్‌లోనే ఉంటారు. మరికాస్త మామూలు అతిథులు పక్కనే ఉన్న బంగ ళాలో ఉంటారు. ఆయనది ఒక మహా చక్రవర్తి జీవితం. ఆయన సూట్లు లండన్‌ ‘సెవైల్‌ రో’లో తయారవుతాయి. ఆయనకి ఖరీద యిన గడియారాలు సేకరించడం సరదా. ఆయనెప్పుడూ పాటక్‌ ఫిలిప్‌ రిస్టువాచీలనే వాడుతాడు. ఆ వాచీలు అరుదైన వజ్రాలతో పొదగబడినవి– ఖరీదు లక్షల్లో ఉంటుంది. నల్ల కళ్లద్దాలు మాసె రాటీ బ్రాండువి. ఆయన వజ్రాలు పొదిగిన పెన్ను తోనే సంతకాలు చేస్తాడు. ఆ పెన్ను ఖరీదు కనీసం ఐదు లక్షలు. ఆయనకి చాలా కార్లు న్నాయి. కానీ బాంబులు పడినా చెక్కుచెదరని నల్లటి మెర్సిడిస్‌లోనే ప్రయాణం చేస్తారు. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన రక్షణను చూసే పాకిస్తాన్‌ రేంజర్ల కట్టుదిట్టాలు– బహుశా పాకిస్తాన్‌ అధ్యక్షుడి రక్షణ కవచాన్ని కూడా వెక్కిరిస్తున్నట్టుంటాయి.

అయితే ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యమంతా ఇవ్వ లేనిది ఒకటుంది. కంటి నిండా నిద్ర. నిద్ర దావూద్‌కి దూరం. పగలు ఏ కాస్తో నిద్రపోయి, రాత్రి వేళల్లో
తన ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఎందరో మంత్రులు, బ్యూరోక్రాట్లు, మహానుభావులు ఆయన్తో ఇంట ర్వ్యూకి తహతహలాడుతుంటారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన వెయిటింగ్‌ గదిలో అల్లా డుతుంటారు ఆయన దర్శనానికి.

ఇదీ దావూద్‌ ఇబ్రహీం అనే హంతకుడి జీవన శైలి. డి–కంపెనీ అధినేత, కుట్రదారుడు, హవాలా చక్రవర్తి– ఇవన్నీ ఆయన బయట ప్రపంచం ఆయనకి పెట్టిన పేర్లు. ప్రపంచంలో ఉన్న పదిమంది గొప్ప నేరస్తుల జాబితాలో ఆయనది మూడవ స్థానం. ఆయన్ని పట్టుకున్నవారికి అమెరికా 250 లక్షల బహు మతిని ప్రకటించింది.

ఆయనకి నాకూ చిన్న బంధుత్వం ఉంది. భారత దేశాన్ని తన అందంతో ఉర్రూతలూగించిన మందాకిని (‘రామ్‌ తెరీ గంగా మైలీ’ తార) ఆయన గర్లఫ్రెండ్‌. ‘భార్గవ రాముడు’ చిత్రంలో నా గర్ల్‌ఫ్రెండుగా నటించి క్లైమాక్స్‌లో నన్ను హత్య చేసింది.

దావూద్‌ ఇబ్రహీం ఒక నిజాయితీపరుడైన పోలీసు కానిస్టేబుల్‌ కొడుకు. మొదటినుంచీ నేర ప్రపంచంతో సంబంధాలున్న దావూద్‌ ఒకానొక దొమ్మీలో తన సోదరుడిని ఒక ముఠా దారుణంగా హత్య చేయగా– వాళ్లని వెంటాడి ఒంటి చేతిమీద వారిని అంతే దారుణంగా హత్య చేసి– నేర ప్రపం చంలో వ్యక్తుల నరాల్లో వణుకు పుట్టించి– రాత్రికి రాత్రి ‘డాన్‌’గా అవతరించాడు. ఇది ‘దోంగ్రీ టు దుబాయ్‌’ పుస్తకంలో హుస్సేన్‌ జైదీ కథనం.

ప్రతీ క్షణం హత్య, నేరం, పగ, తిరుగుబాటు, లొంగుబాటు, రివాల్వర్లు, తుపాకులు, దొమ్మీలతో సతమతమయ్యే జీవితం అతనిది. నిద్రకి అవకాశం లేని, ఆస్కారమూ లేని– అశ్విన్‌ నాయక్, ఛోటా షకీల్, అబూ సలీం, ఛోటా రాజన్, అరుణ్‌ గావ్లీ వంటి పేర్లతో ప్రతిధ్వనించే పాలెస్‌ జీవితం అతనిది. ఈయనకి ఒక్క గానొక్క కొడుకు– మోయిన్‌ నవాజ్‌ డి. కాస్కర్‌. వయస్సు 31. ఇంత గొప్ప, అనూహ్యమైన నేర సామ్రా జ్యానికి అతనొక్కడే వారసుడు. వైభవానికి ఆఖరి మెట్టుగా నిలిచిన ఈ పాలెస్‌లో అతని జీవితం గడిచి ఉంటుంది. హత్యలూ, గూడుపుఠా ణీలు, గూండాలు, అవధుల్లేని ధనం, అధికారం మధ్య అతని జీవితం గడిచి ఉంటుంది.

కానీ ఇదేమిటి! మోయిన్‌ నవాజ్‌కి తండ్రి జీవితం పట్ల ఏవగింపు కలిగింది. కొన్ని సంవత్సరాలుగా తండ్రి వైభవానికి దూరమయ్యాడు. అల్లా పిలుపుని గ్రహించి– ఒక మసీదులో మౌల్వీగా, మత గురువుగా మారిపోయాడు. తండ్రి వైభవానికి దూరమై– పవిత్ర ఖురాన్‌లో 6236 సూక్తులనూ కంఠస్థం చేసి మత గురువుగా మారిపోయాడు. తండ్రి నిర్మించిన పాలెస్‌కి దూరంగా ఒక మసీదు పక్కన చిన్న ఇంట్లో ఉంటు న్నాడట.

ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక దావూద్‌ ఇబ్ర హీం చాలా మనస్తాపానికి గురి అవుతున్నట్టు వార్త.

ఆశ్చర్యం లేదు. అంతులేని సంపదా, అనూహ్య మైన ‘అవినీతి’ జీవనం ఏదో ఒకనాటికి వెగటు పుట్టిస్తుంది. ముఖం మొత్తుతుంది. It is a natural metamorphosis of the progeny from evil to righteousness ఐశ్వర్యంలో కేవలం మత్తు ఉంది. కానీ ఆముష్మిక జీవనంలో అంతులేని తృప్తి ఉంది. తండ్రిది దోచుకున్న వైభవం. కొడుకుది తనకు తానుగా సంపా దించుకున్న ఆధ్యాత్మిక సంపద. రెంటికీ పొంతనలేదు. ప్రయత్నించినా దొరకదు.


- గొల్లపూడి మారుతీరావు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top