సదా వార్తల్లో వ్యక్తి

Chandrababu Playing Cheap Tricks On YS jagan Government - Sakshi

అక్షర తూణీరం 

ఇటీవల ఎన్నికల్లో చంద్రబాబుకి తిప్పుకో లేని ఎదురుదెబ్బ తగిలింది. ఫలితాలు వచ్చీ రాగానే ఏ మాత్రం అధైర్య పడకుండా తిరిగి ప్రతిపక్ష గళంతో తెరపైకి వచ్చారు. ప్రభుత్వ పక్షాన్ని పూర్తిగా ఎండకట్టి, ఎడారిగా మార్చేద్దా మని బాబు తన సొంత సైన్యంతో, సొంత మీడియాతో రంగ ప్రవేశం చేశారు. ఆ ప్రయత్నం ఏ మాత్రం పండకపోగా, గజం నేల ఎండకపోగా రాష్ట్రంలో నదులన్నీ ఒక్క పెట్టున ఉప్పొంగాయి. కరువు తీరా వర్షాలు పడ్డాయ్‌. మళ్లీ నదులు పొంగాయి. శ్రీశైలం, సాగర్‌ గేట్లు పూర్తిగా ఎత్తెయ్యాల్సి వచ్చింది. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రానికి నీళ్లు వదలాల్సి వచ్చింది. ప్రభుత్వా నికి నీళ్లని నిర్వహించడం ఏ మాత్రం తెలియదని తెలుగు దేశం బురదజల్లే ప్రయత్నం చేసింది. కొద్ది రోజుల క్రితం ఏ డ్యాములున్నాయో ఇప్పుడూ అవే ఉన్నాయ్‌. అప్పుడు జలశక్తి శాఖలో ఏ అధికారులున్నారో, ఇప్పుడూ వాళ్లే ఉన్నారు. సీఎం మారేసరికి పాత అధికారులంతా మంత్రం వేసినట్టు తెలివితక్కువ వారైపో యారా? నాలికలకి వేపరసం పూసుకుని మాట్లా డితే మంచిది కాదు.

వరద రాజకీయం ఆశించి నంతగా రక్తికట్టక పోయేసరికి అవన్నీ కట్టిపెట్టి, మళ్లీ ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అంటూ కొత్త నాట కానికి తెరతీశారు. పల్నాటి కథకి రంగం సిద్ధం చేశారు. గ్రామాలలో కక్షలు, కార్పణ్యాలు లేకుండా ఉండవు. చిన్నచిన్న తగువులు గొడవలై చినికిచినికి గాలివానలై బీభత్సాలవడం మనకి తెలుసు. చంద్రబాబుకి ఒక మానసిక రుగ్మత ఉందని విశ్లేషకులు చెబుతుంటారు. ఆయన నిత్యం వార్తల్లో ఉండాలి. నాలుగు రోజులు మొదటి పేజీకి ఎక్కకపోతే వెలిసిపోతానని ఆయనకు బెంగ, భయం. ఏదీ లేకపోతే పర్వతా రోహకుడి గెటప్‌లో ఏదో ఒక హిమాలయ శిఖరం ఎగ బాకేందుకు నడుం కడతారని ఒక మనో విశ్లేషకుడు చమత్కరించాడు. పవర్‌లో ఉండి ఇన్నాళ్లూ అలసిపోయి ఉన్నారు. జనం ఆ సానుభూతితోనే ఆయనకు సెలవు ఇచ్చారు. వయసు మీద పడింది. అందుకని కనీసం ఓ ఏడాదిపాటు ఇంటిపట్టున ఉండి, వేళకు తిని, టైమ్‌కి నిద్ర పోయి బ్యాటరీని రీచార్జ్‌ చేసుకుంటే మంచిదని పెక్కురి అభిప్రాయం, కానీ ప్రజాసేవ నించి క్షణకాలం కూడా బాబు విశ్రమించలేదు.

అదీ దురదృష్టం. మొన్న వరదల్లో చిక్కుకున్న కృష్ణలంకల్ని పరామర్శించడానికి వెళ్లాను. బంధువులున్నారు. అక్కడ పీకల లోతు నీళ్లలో ఉండి కూడా, ‘నాయనా మొత్తం బాబు జనం కృష్ణా నదిలో చాలా లోతుకుపోయి మరీ ఇసుక లాగే శారు. ఆ పూడికతీతవల్ల వరద కొంచెం శాంతంగా ఉంది’ అంటూ హాస్యమాడారు. ఇంకో టర్మ్‌ టీడీపీ పాలనలో ఉంటే కృష్ణా బేసిన్‌లో పెట్రోలు పొంగిపొర్లేది. బాబులు చాలా లోతుకి వెళ్లారని ఓ సీనియర్‌ ఇంజనీరు బాధపడ్డారు.బాబు ఇలా అయిన దానికి కాని దానికి ప్రెస్‌మీట్లు పెట్టి, వరద బురదని, పల్నాటి చిల్లర రాళ్లని రూలింగ్‌ పార్టీమీద విసిరి ఆనందపడటం కంటే ఇంకో పనికొచ్చే పని చేయకూడదా? అని గ్రామాల్లో పెద్దలు అనుకుంటున్నారు. చేతిలో ‘హెరిటేజ్‌’ సంస్థ ఉంది. అందులో అన్నీ గోడౌన్ల నిండా ఉంటాయ్‌. నీళ్లు కలవని పాలుంటాయ్‌. శుద్ధమైన పాలు కలవని నీళ్లుంటాయ్‌. పాలపొడి పొట్లాలుంటాయ్‌. పందిళ్లకి కాసిన కూరలుం టాయ్‌. పప్పులూ, ఉప్పులూ కావల్సినన్ని. ఎటొచ్చీ నాలుగు గ్యాస్‌ బండలు సంపాయిస్తే ప్రతి లంకకి బాబు పండుగ భోజనం అందించ వచ్చు. ఒక ‘పంట్‌’ మీద అన్నీ పెట్టుకువెళితే లంక ఆనందిస్తుంది 1945లో మోతీలాల్‌ నెహ్రూకి ఎంత ఐశ్వర్యం ఉందంటే–భారతీయు లందరికీ (33 కోట్లు) సంవత్సరం పాటు చక్కని భోజనం పెట్టేంత! అలాగే ఇప్పుడు బాబు పూను కుంటే ఈ లంకల్ని వరద తీసేదాకా పోషించ లేడా? గలడు అంటోంది ప్రజ. పైగా కావల్సి నంత పబ్లిసిటీ! ‘వట్టి మాటలు కట్టి పెట్టోయ్‌! గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌’ ఇది మన రాష్ట్ర స్లోగన్‌.


శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top