విభజన రాజకీయాలపై అభివృద్ధి గెలుపు

BJP Defeat By Arvind Kejriwal In Delhi Assembly Elections - Sakshi

సందర్భం 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యంత తీవ్ర స్థాయిలో సాగించిన విభజన రాజకీయాల ప్రచార సంరంభాన్ని తిప్పికొట్టిన ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వరుసగా మూడోదఫా అధికారంలోకి రావడమే కాదు.. అనితరసాధ్యమైన విజయాన్ని కూడా అందుకున్నారు. ఈ క్రమంలో ఆద్యంతం సానుకూల దృక్పథం, ప్రజానుకూల ఎన్నికల ఎజెండాలో ఢిల్లీ నమూనా పాలన ఎలా భాగం కావచ్చో జాతి మొత్తానికి చూపించారు. స్పష్టంగా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలూ పాటించి అమలు చేయగల, ఫలితాలను అందించగల పాలనా నమూనాపై ఆధారపడి కేజ్రీవాల్‌ తన వ్యూహాన్ని అమలు చేశారు. ప్రభుత్వం పట్ల బలమైన సానుకూల దృక్పథాన్ని నిర్మించడంతోపాటు కేజ్రీవాల్‌ అత్యంత సమయస్ఫూర్తితో కూడిన రాజకీయ క్రీడను సాగించారు. ఈ క్రమంలో సానుకూల శక్తిని ప్రేరేపిస్తున్న, ప్రజలకోసం కష్టపడుతున్న నిజాయితీ కలిగిన పరిణతి చెందిన వ్యక్తిగా తన ప్రతిష్టను పూర్తిగా పునర్నిర్మించుకున్నారు. ఇవన్నీ కలిసి కేజ్రీవాల్, ఆప్‌ ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలకు గాను 62 స్థానాలను గెల్చుకునేలా చేశాయి. దీంతో ప్రతిపక్షమైన బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. మరోవైపున నామమాత్రమైపోయిన తన ఉనికి ద్వారా కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ ఆశించిన స్థాయిలో ఆప్‌ను దెబ్బతీయలేకపోయింది.

మరోవైపున ఎన్నికల ప్రచారానికి సంబంధిం చిన కొన్ని మెలకువలను కేజ్రీవాల్‌ ప్రధాని మోదీ నుంచి సంగ్రహించడమే ఆప్‌ ఘనవిజయానికి దారితీసింది. మోదీ ప్రచార వ్యూహాన్ని అచ్చుగుద్దినట్లు స్వీకరించిన కేజ్రీవాల్‌ దాంతోనే బీజేపీని చావుదెబ్బ కొట్టారు. అంతకుమించి బీజేపీ తనపై రుద్దజూసిన హిందూ–ముస్లిం ఎరలో చిక్కుకోవడానికి తిరస్కరించారు. ఈ ఒక్క అంశమే బీజేపీ అవకాశాలను కొల్లగొట్టింది.  పైగా హిందూయిజానికి బీజేపీ మాత్రమే ఏకైక ప్రతినిధి కాదని కేజ్రీవాల్‌ బలమైన సందేశం పంపారు. ఢిల్లీలోని హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించడమే కాకుండా బహిరంగంగా హనుమాన్‌ చాలీసాను పఠించారు కూడా. మరోవైపున బీజేపీ హనుమాన్‌ ఆలయాన్ని కేజ్రీవాల్‌ సందర్శించడాన్ని కూడా తప్పు పడుతూ పూర్తి వ్యతిరేక దృక్పథాన్ని అవలంబించడం ద్వారా బీజేపీ తనకేమాత్రం అనుకూలత లేకుండా చేసుకుంది.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీపై చాయ్‌వాలా అస్త్రం ప్రయోగించి మోదీ ఎంతగా ప్రయోజనం పొందారో తెలిసిందే. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ తన్నుతాను దెబ్బతిన్న బాధిత కార్డును ప్రయోగించారు. కొన్ని నెలల క్రితం మోదీ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లే కేజ్రీవాల్‌ కూడా ఈ ఎన్నికలకు గాను తన తల్లి ఆశీర్వాదం తీసుకుని ప్రచారంలో పెట్టారు. రాజకీయాల్లోకి కొన్ని సంవత్సరాల క్రితమే అడుగుపెట్టిన వ్యక్తి అతి శక్తివంతమైన మోదీ–షాల ఎన్నికల యంత్రాంగంతో తలపడి అఖండ విజయాన్ని సాధించడం అత్యంత ప్రధాన విజయంగా చెప్పాలి. అది కూడా ఢిల్లీలోని అన్ని లోక్‌ సభా స్థానాలను బీజేపీ గెల్చుకున్న నేపథ్యంలో 8 నెలలు కాకముందే ఆప్‌ ఇంత విజయం సాధించడం గొప్ప విషయమే. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని 65 అసెంబ్లీ స్థానాలలో మెజారిటీ ఓట్లు సాధించగా కాంగ్రెస్‌ అయిదు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఆధిక్యత సాధించడం గమనార్హం.

ఢిల్లీ ఎన్నికల్లో అద్భుత విజయంతో, ఉచిత విద్యుత్తు, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి తాయిలాలు అందించడం ద్వారా ఓటర్లను ఎలా గెల్చుకోవచ్చో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటికీ కేజ్రీవాల్‌ దారి చూపారు. కేజ్రీవాల్‌ తాయిలాలు నిస్సందేహంగానే దిగువ, మధ్యతరగతి ఓటర్లకు అందాయి. సుపరిపాలనను అమలుచేస్తే ఎన్నికల్లో విజయాన్ని సాధించవచ్చని ఇవి నిరూపించాయి. తాను గత అయిదేళ్లలో చేసిన మంచిపనులను కేజ్రీవాల్‌ ప్రజలకు చేరవేశారు. తాను సాధించిన పనుల రిపోర్టు కార్డుతోనే ఆయన ప్రజల్లోకి వెళ్లారు. గతంలో తాను చేసిన హామీలు నిలబెట్టుకున్నానని మరో అవకాశమిస్తే మిగిలి ఉన్న పనులను కూడా నెరవేరుస్తానని కేజ్రీవాల్‌ సూటిగా చెప్పిన మాటలు ఓటర్లు నమ్మారు. అలాగే, ఢిల్లీలో ఓటర్లు ఆప్‌ అభ్యర్థులకు వేసే ప్రతి ఓటూ స్వయంగా తనకు వేసినట్లేనని కేజ్రీవాల్‌ బలంగా చెప్పారు. హిందూయిజం ముగ్గులోకి దిం పాలని బీజేపీ చేసిన పన్నాగాన్ని దగ్గరకు రానివ్వని కేజ్రీవాల్‌ అభివృద్ధి, పనులు చేయడంలో తన ట్రాక్‌ రికార్డును మాత్రమే ఓటర్లముందు ప్రదర్శించారు. ఆప్‌ విజయానికి ఇదీ ప్రధాన కారణం.

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు 
లక్ష్మణ్‌ వెంకట కూచి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top