చరిత్ర గమనాన్ని మార్చిన డార్విన్‌

Article On Charles Darwin On His Birth Anniversary - Sakshi

ఖగోళ భౌతిక శాస్త్రములో కోపర్నికస్‌ ప్రతిపాదించిన ‘సూర్య కేంద్ర సిద్ధాంతానికి’ ఎంత ప్రాముఖ్యత వుందో, అంతే ప్రాధాన్యత ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త డార్విన్‌ ‘జీవ పరిణామ సిద్ధాంతానికి’ ఉంది. 1809 ఫిబ్రవరి 12న జన్మించిన చార్లెస్‌ రాబర్ట్‌ డార్విన్‌ ఐదేళ్లు ప్రపంచయానం చేసి వివిధ వృక్ష జంతుజాతులను పరిశీ లించి 1859లో ‘ఆన్‌ ది ఆరిజన్‌ ఆఫ్‌ స్పీసీస్‌’ (జీవజాతుల ఉత్పత్తి) అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ప్రకృతిలో జీవజాతులు వేటికవే ఏకకాలంలో రూపొందినట్లు ఎంతోకాలంగా నమ్ముతూ వస్తున్న ప్రజానీకానికి డార్విన్‌ సిద్ధాంతం కొత్తమార్గాన్ని చూపింది. మనుగడ కోసం పోరాటంలో భాగంగా వివిధ జీవజాతుల మధ్య సంఘర్షణ జరుగుతుందని, కొన్ని సందర్భాలలో ప్రకృతితో కూడా జీవజాతులు ఘర్షణ పడతాయని, సంఘర్షణలో నెగ్గినవే మనుగడ సాగించగలవని, జీవ వైవిధ్యం ప్రకృతి ప్రధాన లక్షణమని, వారసత్వం, పర్యావరణం రెండూ మనిషి నడతను ప్రభావితం చేస్తాయని డార్విన్‌ ప్రతిపాదించారు. డార్విన్‌ సిద్ధాంతంతో పలువురు మతాధికారులు విభేదించారు. డార్విన్‌ ప్రచురించిన పుస్తకాలను నిషేధించారు. కార్ల్‌ మార్క్స్, ఆడమ్‌స్మిత్‌ వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు తమ సిద్ధాంతాలతో ప్రపంచ గమనాన్ని మార్చినట్లే, డార్విన్‌ ఆలోచనలు కూడా ప్రజల ఆలోచనల్ని మార్చడంలో కీలకపాత్ర పోషించాయి. గ్రెగర్‌ మెండల్, హర్‌గోవింద్‌ ఖురానా వంటి శాస్త్రవేత్తలు జెనిటిక్‌ ఇంజనీరింగ్‌లో చేసిన పరిశోధనలకు వాలెస్, డార్విన్‌ ఆలోచనలు ఎంతగానో దోహదపడ్డాయి.  

‘జాతుల ఉత్పత్తి’ పుస్తకం ప్రచురితమై 161 ఏళ్లు అయింది.  సృష్టి వాదానికి ముగింపు పలికి సరికొత్త ఆలోచనలకు డార్విన్‌ తెరతీశాడు. జీవశాస్త్రంలో డార్విన్‌ ‘జీవకణ సిద్ధాంతం’, భౌతిక శాస్త్రంలో ఐన్‌స్టీన్‌ ‘సాపేక్ష సిద్ధాంతం’, ఖగోళ శాస్త్రంలో కోపర్నికస్‌ ‘సూర్య కేంద్ర సిద్ధాంతం’, మానసిక శాస్త్రంలో సిగ్మెంట్‌ ఫ్రాయిడ్‌ ‘మనో విశ్లేషణ సిద్ధాంతాలు’ ఆధునిక సైన్స్‌ మరింత పురోగమించడానికి ఎంతగానో దోహదపడ్డాయి. డార్విన్‌ ఆలోచనలను 160 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌లో మతవాదులు వ్యతిరేకించినట్లే, నేడు కొందరు మతోన్మాదులు కూడా తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యుదయ వాదులు, మానవతావాదులు ఉమ్మడిగా డార్విన్‌ ఆలోచనలను మరింతముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం వుంది. (నేడు డార్విన్‌ జయంతి సందర్భంగా)

-ఎం.రాంప్రదీప్‌ ‘ 94927 12836
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top